‘నీ పాదాల మీద నువ్వు నిలబడు’ అంటారు పెద్దలు. ఇవాళ దేశంలో తమ పాదాల మీద తాము నిలబడ్డవాళ్లెవరో అందరికీ కనిపిస్తూ ఉంది. పాదాలు మీద మాత్రమే ఉన్నవారు, పాదాలను మాత్రమే నమ్ముకున్నవారు దేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారా అని కూడా తెలుస్తూ ఉంది. భారతదేశంలోని రోడ్లు గత నెల రోజులుగా చూసినన్ని పాదాలు మళ్లీ బహుశా ఎప్పటికీ చూడవు. చూడాల్సిన అగత్యం రాకూడదనే కోరిక. ఏమి పాదాలు అవి. గర్భంలో ఉన్న పాపను మోస్తూ నడిచిన పాదాలు, బిడ్డను బయటకు తెచ్చిన మరుక్షణం నుంచి నడిచిన పాదాలు, భుజాన ఒక బిడ్డను, చంకలో ఒక బిడ్డను మోస్తూ నడిచిన పాదాలు, శరీరాన్ని వాహనంగా చేసి మొత్తం సంసారాన్ని మోస్తూ అడుగులు వేసిన పాదాలు, ముసలి తల్లిని ఉప్పుమూట గట్టి మోసిన పాదాలు, కదల్లేని తండ్రిని డొక్కు సైకిల్ మీద వేయి కిలోమీటర్లు తొక్కగలిగిన పాదాలు, దారిలో భర్త కన్ను మూయగా అక్కడే ఖననం చేసి కన్నీటిని దిగమింగుతూ నడచిన పాదాలు, అయినవారు సొమ్మసిల్లగా వారిని లేవదీసి నడిపించిన పాదాలు, చుక్క మంచినీరు దక్కక పోయినా గుప్పెడు మెతుకులు అందకపోయినా నడుస్తూ నడుస్తూనే ఉండిపోయిన పాదాలు... నడిచిన పాదాలు... ఆ పాదాలు నిజంగా ఎంత బరువును మోశాయి. ఎంత చెరుపును చూశాయి. పైన మండుటెండ. కింద కాలే నేల.
యాభై రూపాయలకు స్లిప్పర్స్ వస్తాయిగానీ అంత డబ్బును ‘సౌఖ్యాని’కి ఉపయోగించేంత సంపాదన ఇవ్వకుండా ఈ దేశం ఎప్పుడూ జాగ్రత్త పడుతూనే వచ్చింది. పుట్టి బుద్దెరిగినప్పటి నుంచి కాళ్లకు చెప్పులే ఎరక్కుండా పెరిగిన పాదాలు, బొబ్బలను దూది పింజలను చేసుకోవడం తెలిసిన పాదాలు, ఆశను మొప్పలుగా చేసుకుని అనంతమైన మట్టి సముద్రాన్ని ఈదుకుంటూ నడిచిన పాదాలు... మన దగ్గర ఈ పాదాల గోడు విన్నవారు ఎందరు? ఈ పాదాలున్న మనుషుల ఏడుపు తుడిచేవారు ఎవ్వరు? కాని అమెరికాలో అలా కాదు. అక్కడ ప్రతి కాలికి, ప్రతి వేలికీ విలువుంటుంది. గోటికి గొడ్డలిదాకా వెళ్లే హంగామా ఉంటుంది. కావాలంటే చూడండి. అమెరికాలో కరోనా వల్ల లక్ష మంది చనిపోయారు. కాని బతికున్న వారి ప్రాణంతో పాటు దేహం కూడా ముఖ్యమేనని అక్కడ ఇప్పుడు లాక్‌డౌన్‌లలో సడలింపులిస్తున్నారు. ఆ సడలింపులో ముఖ్యమైనది ‘నెయిల్ సెలూన్స్’ (గోళ్ల సౌందర్య శాలలు) తెరవడం. హెయిర్ సెలూన్స్ అవసరాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఫ్లోరిడాలోని మయామిలో నెయిల్ సెలూన్స్ తెరవడంతో గోళ్ల సంరక్షణలో మునిగి ఉన్న స్త్రీలు.
కాని వాటితో సమానంగా ‘నెయిల్ సెలూన్స్’ ఎందుకు తెరుస్తున్నట్టు? ఆర్థిక కార్యకలాపాలు పెంచడానికి కాదు. అమెరికాలో తొంభై శాతం మంది స్త్రీలు సొంత గోళ్ల కంటే పెట్టుడుగోళ్లను కలిగి ఉంటారు. తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు అనే తేడా లేకుండా సౌందర్యం విషయంలో స్త్రీలు ఈ పెట్టుడుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తారు. ఇవి అక్రిలిక్‌తో తయారవుతాయి. రకరకాల ఆకారాల్లో రకరకాల రంగుల్లో దొరుకుతాయి. ఈ నకిలీగోళ్లను నెయిల్ సెలూన్స్‌లో జాగ్రత్తగా పాలిష్ చేసి సొంత గోళ్లకు అతికిస్తారు. అయితే ఈ అతికింపు శాశ్వతం కాదు. వీటిని జాగ్రత్తగా చూసుకున్నన్ని రోజులు ఉంటాయి. బలమైన వస్తువు తగిలినా, వొత్తిడి పడినా విరిగి పోతాయి. అందుకని అమెరికాలో స్త్రీలు తమ కాళ్ల, చేతి గోళ్లను నిర్వహించుకోవడానికి నెయిల్ సెలూన్స్‌ను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇవి లేకపోతే వారికి చాలా అసౌకర్యం. అది తెలుసు కనుకనే రాబోయే ఎన్నికలలో వారి ఆగ్రహానికి గురి కావడం కంటే నెయిల్ సెలూన్స్ తెరిచి నాలుగు ఓట్లన్నా సంపాదించుకోవచ్చని అక్కడి పాలకులు భావిస్తున్నారు. ఇక మన దగ్గర వలస కార్మికుల సంగతి. వారికి కచ్చితంగా ఓటు హక్కు ఉన్నదని చెప్పలేము. ఇప్పుడు ఎన్నికలూ లేవు. నిజానికి ఇది ఎన్నికల సీజన్ అయి ఉంటే వారిని రోడ్డున నడిపించి ఉండేవారా? నెత్తిన పెట్టుకుని తీసుకెళ్లి ఉండేవారు గానీ.
Comments
Please login to add a commentAdd a comment