మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు అన్న కవి మాటలు నిజమవుతున్నాయి. ఆధునిక మానవుల్లో మంచితనం కొడిగడుతోంది. సంకుచిత ధోరణితో మనిషి కుంచించుకుపోతున్నాడు. విజ్ఞానశాస్త్రంలో శిఖరస్థాయికి చేరినా విలువలు పరంగా దిగజారిపోతున్నాడు. ఆధునికుడిగా పరిణామం చెందినా మూఢవిశ్వాసాలతో అంధయుగ ఆనవాళ్లు కొనసాగిస్తున్నాడు. ఆపదలో ఉన్న వాడిని ఆదుకునేందుకు సంశయిస్తున్నాడు. సహాయ చింతన మరిచి సంచరిస్తున్నాడు. యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యోదంతమే ఇందుకు తిరుగులేని రుజువు.
తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సక్సెస్ పరుగులు తీసే సినిమా జనం ఈ వార్త తెలిసినా పెద్దగా స్పందించలేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే సినిమా పెద్దలు ఉదయ్ కిరణ్ మరణాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఫిలిమ్ ఛాంబర్కు తరలించేవరకు అతడి భౌతిక కాయాన్ని సందర్శిన పాపాన పోలేదు. ఇక సినిమా పరిశ్రమను శాసిస్తున్న కొన్ని కుటుంబాలైతే ఆ ఛాయలకే రాలేదు. తోటి నటుడిగా కూడా అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేయలేకపోయాయి. ఇక రాజకీయ నాయకులు, కుల సంఘాల పెద్దల హంగామా సరేసరి.
తోటి మనుషులు కూడా మానవత్వం లేకుండా ప్రవరిస్తుండడమే విస్తుగొలుపుతోంది. నిన్నటివరకు తమ కళ్లెదుటే తిరిగిన మనిషి మరణిస్తే కనీస కనికరం చూపడం లేదు. అతడుంటున్న అపార్ట్మెంట్ యజమాని ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అంగీకరించలేదు. అటు సినిమా పరిశ్రమ వారు పట్టించుకోలేదు. కన్నతండ్రి, భార్య తరపువారు ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. చివరకు నిమ్స్ ఆస్పత్రిలో భౌతిక కాయాన్ని భద్రపరిచారు. అందరూ ఉన్నా అనాథలా అతడి మృతదేహాన్ని ఆస్పత్రిలో దాచాల్సివచ్చింది.
మనిషి ఎలాంటివాడైనా చనిపోయిన తర్వాత ఘనంగా సాగనంపాలనేది మన సంప్రదాయం. కానీ మనిషి చనిపోవడమే పాపం అన్నట్టుగా ఆధునికులు వ్యవహరిస్తుండడం సమాజంలో లుప్తమవుతున్న విలువలకు అద్దం పడుతోంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారి 'చావు' కష్టాలు చెప్పనలవి కాదు. తమ వారెవరైనా చనిపోయితే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చే వీలుండదు. తమ ఇల్లు మైలపడిపోతుందనే ఉద్దేశంతో శవాన్ని గుమ్మం ఎక్కనివ్వని యజమానులే ఎక్కువ. మైలు పేరుతో నిర్ధాక్షిణ్యంగా ఇళ్లు ఖాళీచేయించే మహానుభావులు ఉన్నారంటే అర్థమవుతుంది మనమెంత ముందుకు పోయామో. చాలా విషయాల్లో ఇలాగే జరుగుతోంది. నమ్మకాలను ఎవరూ కాదనరు. కానీ మూఢ విశ్వాసాలతో మానవత్వాన్ని మంటగలపడమే అసలైన విషాదం.
మచ్చుకైనా లేదు మానవత్వం!
Published Tue, Jan 7 2014 3:32 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement