ఉపాధి మర్రి
చెట్టు నీడనిస్తుంది. కానీ ఈ చెట్టు.. బతుకుదెరువునిస్తోంది. కాలమేదైనా సరే... అక్కడి పుచ్చకాయలు చల్లగా కడుపునింపుతాయి. నగరంలో తిరిగి అలసిన వారికి ఆ చెట్టు కింది నిమ్మ సోడా సాంత్వననిస్తుంది. మోటార్ సైకిల్‌పై మొబైల్ మెస్... ఆకలితో ఉన్నవారి కడుపు నింపుతుంది. అద్దెలు చెల్లించలేని చిరు వ్యాపారులకు బతుకు నీడనిస్తోంది మింట్ కాంపౌండ్ సమీపంలోని మర్రి చెట్టు.
ఏళ్ల చరిత్ర ఉన్న ఆ చెట్టు డజనుకుపైగా వ్యాపారాలకు కేంద్రమైంది. ట్యాంక్‌బండ్‌పై షికార్లు కొట్టి అలసిన వారు, కార్యాలయాల్లో పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వచ్చిన ఉద్యోగులు, ఆయా పనుల నిమిత్తం సెక్రటేరియేట్‌కు వచ్చే సామాన్యుల అవసరాలను తీర్చే కేంద్రంగా మారింది.
ప్రతి కాలంలో పుచ్చకాయ...
వేసవిలోనే పుచ్చకాయలు దొరుకుతాయి. ఈ మర్రిచెట్టు నీడలో కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పుచ్చకాయలు అందుబాటులో ఉంటాయి. చుట్టుపక్కల కార్యాలయాల వాళ్లే కాదు... కూడలిలో ఉండటంతో వచ్చీపోయే జనం కూడా అక్కడ ఆగి మరి పుచ్చకాయలు తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ పుచ్చకాయల వ్యాపారంపై ఆధారపడి రెండు కుటుంబాలు బతుకుతున్నాయి.
‘ఫుల్’గా భోజనం...
ఆకలి అవుతుంటే దగ్గర్లో ఏ హోటల్‌కు వెళ్లి భోజనం చేద్దామన్నా వందకు పైగా చెల్లించాల్సిందే. కానీ ఈ చెట్టు నీడన 40 రూపాయలకే పూర్తి భోజనం లభిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయలేని విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు... అనేక మంది ఇక్కడ భోజనం చేస్తుంటారు. ఇలా మూడు నుంచి నాలుగు కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. భోజనం వద్దనుకుంటే... అల్పాహార కేంద్రం కూడా అందుబాటులో ఉంది.
ఆరోగ్య పరీక్షలు...
ఇదే మర్రిచెట్టు నీడన ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు. 20 రూపాయలు ఇస్తే చాలు మీ ఎత్తుకు తగ్గ బరువున్నారా? మీ ఒంట్లో ఎంత కొవ్వు శాతం ఎంత? బీపీ తక్కువా? ఎక్కువా? తెలిపే ఓ యువకుడు కనిపిస్తాడు. ఒంటి నొప్పులకు, ఒత్తిడికి అక్యుపంక్చర్ వైద్యం ఎంతో ఉపశమనం. దీనికి సంబంధించిన పరికరాలు కూడా ఈ చెట్టు కింద లభిస్తాయి.
వస్త్ర వ్యాపారం అదుర్స్..
సామాన్యులకు అందుబాటు ధరలో దుస్తుల వ్యాపారం ఓ పక్క జరుగుతుంటే... మరోపక్క కాలి బూట్లు, చెప్పులు అమ్ముతుంటాడో వ్యక్తి. ఓవైపు సోడా బండి, ఆ పక్కనే ఫ్రూట్ జ్యూస్ బండి ఉంటుంది. ఇంత మంది వచ్చే చోట వాహనాల రద్దీ ఉంటుంది కదా! వాటి పొల్యూషన్ చెకప్ చేయడానికి ఆర్టీఏ అనుమతి పొందిన ఏజెంట్ కూడా అక్కడే సిద్ధంగా ఉంటాడు. ఇలా చిరు వ్యాపారులకు ఆ మర్రి చెట్టు కల్పవృక్షంగా మారింది.
...::: వాంకె శ్రీనివాస్