కిస్ కీ బాతే
‘కిస్ ఆఫ్ లవ్’ కేరళలో రాజుకున్న ఈ వివాదం.. హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కేంద్రంగా నిలిచిన హోటల్‌పై దాడిని ఖండిస్తూ.. హెచ్‌సీయూలో కొందరు విద్యార్థులు నిరసన గళం వినిపిస్తున్నారు. ముద్దుతో కల్చర్‌కు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు. ఎమోషన్స్ ఎక్స్‌ప్రెషన్‌లో ముద్దు కూడా ఓ భాగమని క్యాంపస్ కబుర్లలో ‘కిస్ కీ బాతే’ షేర్ చేసుకున్నారు.
అతిరా: ‘కిస్ ఆఫ్ లవ్’ అనేది చాలా చిన్న విషయం. మోరల్ పోలీసింగ్ (నైతిక నిఘా) పేరుతో మమ్మల్ని రకరకాలుగా వేధించడంలో ఇది ఒక అంశం మాత్రమే. బయట రోడ్డుపై ఒకమ్మాయి, అబ్బాయి కలసి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్లిద్దరికీ పెళ్లి చేయడం నుంచి మొదలుపెట్టారు. ఇదిగో ఈ రోజు ముద్దు పెట్టుకోవడం పెద్ద క్రైమ్ అంటూ మా మీద దాడులు చేస్తున్నారు.
అమ్మూమోహన్: సమాజంలో జరిగే అంశాలపై స్పందించే హక్కు విద్యార్థులుగా మాకుంది. కేరళలో ఒక రెస్టారెంట్‌లో ఓ ఇద్దరు ప్రేమికులు ముద్దు పెట్టుకునే సన్నివేశాన్ని టీవీలో చూసి మొత్తం రెస్టారెంట్‌ని ధ్వంసం చేయడం చిన్న విషయం కాదు. దాని మీద స్పందిస్తే తప్పా..? అలాగని మేమేమీ అందరినీ ముద్దు పెట్టుకోమని సలహాలు ఇవ్వడం లేదు కదా!
ధీరజ్: కేరళలో జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా ఇక్కడ మేం చిన్న గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే..దానిపై పెద్ద రభస చేసి బయట మనుషులొచ్చి మాపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయం? పైగా భారతీయ కల్చర్‌ని పాడుచేస్తున్నామంటూ నిందలు వేస్తున్నారు. కేవలం ప్రేమికుల వల్లే మన కల్చర్ పాడైపోతోందని గగ్గోలు పెడుతున్నారు.
అతిరా: అయినా ‘కిస్ ఆఫ్ లవ్’లో తప్పేముంది. ఆత్మీయంగా హగ్ చేసుకోవడం.. ముద్దుతో మనలోని ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడమే. మోరల్ పోలీసింగ్ పేరుతో కండిషన్లు పెట్టడం పౌరహక్కుల ఉల్లంఘన కాదంటారా!
ధీరజ్: ఎగ్జాట్లీ...అతిరా. ఇదో వంక మాత్రమే. వాలెంటైన్స్ రోజున కనిపించిన ప్రేమికులందరికీ పెళ్లిళ్లు చేయాలనే పేరుతో యువతను వేధించిన సందర్భాలున్నాయి.
శ్రీలత: అవును.. గొప్పగా చదవాలి. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి. ఇష్టమైతే వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు. హైఫై జీవితం గడపొచ్చు. కానీ, స్వేచ్ఛగా స్నేహం చేయకూడదు. ప్రేమించకూడదు. కోరుకున్నవాణ్ని పెళ్లి చేసుకోకూడదు. అలా చేస్తే మన కల్చర్ పాడైపోతుందంటారు. కల్చర్ అంటే ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం ఒప్పుకోవడం ఒక్కటే కాదు కదా ! మన దేశ సంస్కృతిని కాపాడటానికి ఈ ఒక్క పని చేస్తే సరిపోతుందా..?
అతిరా: శ్రీలత.. మొన్నామధ్య నేను మా ఊరెళ్లాను (కేరళ). తమ్ముడు, నేనూ ఫస్ట్ షో సినిమాకి వెళితే టికెట్లు దొరకలేదు. సెకండ్ షోకి వెళ్లాం. అంతే సినిమా అయిపోయాక రిటర్న్ అవుతుంటే.. ఓ పదిమంది గ్యాంగ్ వచ్చి ‘మీరిద్దరు లవర్సే కదా!.. పదండి పెళ్లి చేస్తాం’ అంటారు. నేను షాక్. కాదురా బాబు అని బతిమాలితే వదిలారు. ఆ గ్యాంగ్‌లో ఒకరు మా తమ్ముడి ఫ్రెండ్ రిలేటివ్. వాడి నిజస్వరూపం ఏంటంటే.. ప్రతి రోజూ తాగి వెళ్లి భార్యను కొడతాడట. ఇంట్లో ఆడవాళ్లను చావగొట్టే వీళ్లు దేశంలోని అమ్మాయిలకు రక్షణ
కల్పిస్తారా?
అను : అయినా విద్యార్థులు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. ఇలా నడుచుకోవాలంటూ ఆంక్షలు పెట్టడానికి వీళ్లెవరు ? మమ్మల్ని ప్రశ్నించి, వేధించి నలుగురిలో హీరోలవ్వాలనే ఫీలింగ్‌తో చేస్తున్న పనులివి.
వైఖరి: కేరళలోని రెస్టారెంట్ పగలగొట్టి వారి వ్యతిరేకతను నిరూపించుకున్నారు. మాపై దాడులు చేయడం, లేదంటే రోడ్లెక్కి అరవడాలు తప్ప.. మోడ్రన్ యుగంలో వచ్చే ఏ ఒక్క మార్పుని ఎవరూ ఆపలేరు. అది అయ్యే పని కాదు.
సాయికుమార్: ప్రస్తుతం మా యూనివర్సిటీలో ‘కిస్ ఆఫ్ లవ్’ అనే అంశంపై కేరళ విద్యార్థులకు మద్దతుగా మిగతా అన్నిప్రాంతాల విద్యార్థులు ముందుకొచ్చి వారి అభిప్రాయాలను చెబుతున్నారు. నిజమే మోరల్ పోలీసింగ్ పేరుతో మా నడవడికను కంట్రోల్ చేయాలనుకోవడం తప్పు.
రహమతుల్లా: యస్. ఈరోజు స్టూడెంట్స్ మంచేదో, చెడేదో తెలుసుకోలేని పరిస్థితిలో లేరు. స్నేహంలోనైనా, ప్రేమలోనైనా చేదు అనుభవం ఎదురైతే ఆ బాధ్యత తనదే. లేదంటే వారి తల్లిదండ్రులది. దీని కోసం ప్రత్యేకంగా ఎవరో పని చేయాల్సిన అవసరం లేదు. ‘కిస్ ఆఫ్ లవ్’ అంటే ఎవరిని ఎవరైనా ముద్దుపెట్టుకునే స్వేచ్ఛ ఉంది అని అర్థం. అది అమ్మ కావొచ్చు, అక్క కావొచ్చు, ప్రేమికురాలు కావొచ్చు, భార్య కావొచ్చు. దాన్ని ఒక భావోద్వేగంగానే చూడాలి.
భువనేశ్వరి