పసిడిపై మోజు వల్ల ఎన్ని తిప్పలు!
దేశంలోకి బంగారం దిగుమతులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. దిగుమతి సుంకాన్ని పెంచారు. ప్రయోజనంలేదు. ఇప్పుడు మళ్లీ పెంచారు. బంగారం, వెండి ఆభరణాల దిగుమతి సుంకం ప్రస్తుత 10 శాతంగా ఉంది. దానిని 15 శాతానికి పెంచారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆభరణాల విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బంగారు ఆభరణాలపై రుణ నిబంధనలనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కఠినతరం చేసింది. ఈ చర్యల ద్వారా ఫలితాలు కనిపించే అవకాశాలు తక్కువ.
బంగారానికి మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తరతరాలుగా బంగారాన్ని నమ్ముకున్న జాతి మనది. దురదృష్టమేమిటంటే మన దేశంలో బంగారం ఉత్పత్తి నామమాత్రమే. మనం కొత్తగా వాడుకునే బంగారం మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పసిడిపై మోజు ఎన్నో తిప్పలు తెస్తోంది. మనవారు వ్యయప్రయాసలకు ఓర్చి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడి డాలర్లు సంపాదించినా, వాటిలో కొంత మొత్తం బంగారం తినేస్తోంది. అంటే పసిడి కోసం ఖర్చయిపోతోంది. ప్రతి ఏటా మన దేశం 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం 50 బిలియన్ డాలర్ల దాకా ఖర్చవుతోంది. ఫలితంగా కరెంట్ అకౌంట్ లోటు విపరీతంగా పెరిగిపోతుంది. కరెంట్ అకౌంట్ తీవ్రలోటుకు గురి చేస్తున్న బంగారం దిగుమతులు తగ్గించడానికి ప్రభుత్వ తీసుకునే చర్యలు ఏవీ సరైన ఫలితాలను ఇవ్వడంలేదు. బంగారం దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నాయి. పైగా విలువైన విదేశీమారక ద్రవ్యం ఖర్చయిపోతుంది.
బ్యాంకులు తాము అమ్మిన నాణేలను తిరిగి కొనుగోలు చేయకూడదని ఆర్బిఐ నిబంధన విధించింది. ఈ నాణేలను తిరిగి కొనుగోలు చేస్తే బంగారం దిగుమతులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు కొంతకాలంగా సూచిస్తున్నారు. ప్రభుత్వం గానీ, రిజర్వు బ్యాంకు గానీ ఇతర రకాల ఆంక్షలు విధిస్తున్నాయిగానీ ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. బ్యాంకుల నుంచి కొనుగోలు చేసిన బంగారు నాణేలను తిరిగి బ్యాంకులు కొనుగోలు చేసుందుకు అనుమతించాలని ఎప్పటి నుంచో వినియోగదారులు కూడా కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రజలు బ్యాంకు ద్వారా సులభంగా నాణేలు కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిని తిరిగి అమ్మడానికి మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటుగా అమ్మడం వల్ల కొన్ని సందర్భాలలో వారు పూర్తి విలువను పొందలేకపోతున్నారు. బ్యాంకులు గనుక నాణేలు కొంటే వినియోగదారుకు అమ్మడం తేలికవుతుంది. వారు పూర్తి విలువను పొందగలుగుతారు. బ్యాంకులు బంగారం దిగుమతుల కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేశంలో నిరుపయోగంగా ఉన్న వేల టన్నుల బంగారం కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
మన దేశంలో ప్రజల దగ్గర 30 వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా. ఇందులో కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు, ఇతర బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయగలిగితే దిగుమతి అవసరాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆర్బిఐ ఆ ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమీ లేదని ఆర్బిఐ స్పష్టం చేసింది. బంగారం దిగుమతులు తగ్గించుకునేందుకు ఈ అంశాన్ని రిజర్వు బ్యాంకు పునరాలోచించవలసి అవసరం ఉంది.