మహారుచులకు ఫిదా
పుట్టింది కోల్‌కతాలోనే అయినా, పెరిగింది మాత్రం భాగ్యనగరంలోనే. తెలుగు సంస్కృతితో మమేకమైన బెంగాలీ భామ శిల్పా చక్రవర్తి, తెలుగు అబ్బాయినే పెళ్లాడి, ఇక్కడే స్థిరపడింది. చిన్ననాటి నుంచి ఈ నగరంతో ముడివేసుకున్న అనుబంధాన్ని ఆమె ‘సిటీప్లస్’తో పంచుకుంది. బాల్యంలోని మధుర స్మృతులను నెమరువేసుకుంది. అవి ఆమె మాటల్లోనే..
మా అమ్మ, నాన్న ఇద్దరూ రైల్వే ఉద్యోగులు. మా నాన్నకు హైదరాబాద్ బదిలీ కావడంతో నేను నాలుగో క్లాస్ చదువుతున్నప్పుడు ఇక్కడకు వచ్చేశాం. మేం తార్నాకలో ఉండేవాళ్లం. నాకు అన్న ఉన్నాడు. నాకంటే ఐదేళ్లు పెద్ద. మా చదువులన్నీ రైల్వేకు సంబంధించిన విద్యాసంస్థల్లోనే సాగాయి. అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోవడంతో తినిపించడం, స్కూలుకు, కాలేజీకి తీసుకువెళ్లడం సహా నా పనులన్నీ అన్నయ్యే చూసుకునే వాడు. స్కూలుకి కాలినడకనే వెళ్లేదాన్ని. తోవలో బళ్ల మీద అమ్మే జాంకాయులు, రేగుపళ్లు కొనుక్కుని తినేదాన్ని. కాలేజీకి బస్సులో వెళ్లే దాన్ని. అలాంటి రోజులు మళ్లీ రావు.
పెద్ద ఫుడీని..
మా స్వస్థలం కోల్‌కతా. మేం బెంగాలీలం. ఇక్కడకు వచ్చిన కొత్తలో ఆహారం విషయుంలో కాస్త ఇబ్బందులు పడ్డాం. బెంగాలీ వంటకాలైన కచోడీ, పూరీ, స్వీట్లకు అలవాటు పడిన మేం ఇక్కడి రుచులకు అలవాటు పడటానికి కొంత టైమ్ పట్టింది. నిజానికి నేను పెద్ద ఫుడీని. అప్పట్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర స్వాతి హోటల్‌లో వడలు చాలా టేస్టీగా ఉండేవి. చట్నీస్ రెస్టారెంట్‌లో ఆచారి ఇడ్లీ, స్టీమ్డ్ దోశ కూడా ఇష్టంగా తింటాను. ఇంటర్నెట్‌లో వెదికి మరీ కొత్త కొత్త రుచులతో ప్రయోగాలు చేస్తుంటా.
చిన్నప్పటి నుంచి సిటీతో మమేకం కావడంతో ఇక్కడి బిర్యానీకి, రంజాన్ సీజన్‌లో హలీంకు బాగా అలవాటు పడిపోయూ. ఈ ప్రాంతంతో మమేకమైన నేను పక్కా తెలుగు అబ్బాయిని పెళ్లాడాను. స్కూల్లో చదువుకునే రోజుల్లో నేనే లీడర్‌గా ఉండేదాన్ని. కల్చరల్ షోస్, స్టేజ్ షోస్‌లో పాల్గొనేదాన్ని. చదువులో మంచి మార్కులే వచ్చేవి. ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్‌లోని ఓయుూ అఫిలియేటెడ్ సాయి సుధీర్ కాలేజీ నుంచి ఎంబీఏ (హెచ్‌ఆర్) పూర్తిచేశాను. చదువుకునే రోజుల నుంచి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లందరితో ఇప్పటికీ టచ్‌లో ఉంటుంటాను.
శిల్పారామం చాలా ఇష్టం..
సిటీలో నాకు శిల్పారామం అంటే చాలా ఇష్టం. అక్కడి కళాకృతులు, ఆభరణాలు నన్నెంతో ఆకట్టుకుంటాయి. నేను తరచూ అక్కడకు వెళుతుంటాను. చిన్నప్పుడు ఒకసారి ఫ్యామిలీ అంతా యాదగిరిగుట్టకు వెళ్లాం. చాలా అద్భుతమైన ప్రదేశం. మా నాన్న ఎక్కువగా పూజలు చేస్తుంటారు. సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూల్‌లో మా బెంగాలీ అసోసియేషన్ వాళ్లు ఏటా దసరా వేడుకలను ఘనంగా జరుపుతారు. ఆ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటాను.
ఇక డ్యాన్స్ నా ఫేవరేట్ హాబీ. కథక్ డ్యాన్స్‌లో డిప్లొమా కూడా చేశా. లలితకళాతోరణంలో తొలి ప్రదర్శన ఇచ్చా. హైదరాబాదీలు మంచి కళాభిమానులు. ఇక్కడి ప్రజలు నాకు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. నెల్లాళ్ల కిందటే అమెరికా వెళ్లి, ‘ఆటా’ వేడుకల్లో కథక్ ప్రదర్శన ఇచ్చా. హైదరాబాద్ సిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ వంటి వాటి పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అవకాశం ఉంటే ఈ దిశగా చేపట్టే ప్రచారంలో పాల్గొనేందుకూ నేను సిద్ధం.