కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారం చేపట్టిన తరువాత అత్యధికంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలే తీసుకున్నారు. తీసుకుంటున్నారు. కొన్ని నిర్ణయాలకు జనామోదం అద్వితీయంగా లభిస్తోంది. అయితే రెండు మూడు నిర్ణయాల విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. సమైక్యాంధ్ర రెండుగా విడిపోయిన నేపధ్యంలో ఏపికి ఆర్థిక కష్టాలు, రాజధాని ప్రాంత ఎంపిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో అర్ధంకాక ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల పట్టుకు కూర్చున్నారు. తాము సిఎం అయిన తరువాత పెడతానన్న తొలి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో మరో రాష్ట్రం తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులులేవు. నిధులకు కొరతలేదు. కెసిఆర్ మాత్రం సునాయసంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. అదే ఊపులో పథకాలమీద పథకాలు ప్రకటించేస్తున్నారు. పనిలో పనిగా కొన్ని సంస్థల పేర్లు కూడా మార్చేస్తున్నారు.
కెసిఆర్ ప్రకటించిన పథకాలలో ముఖ్యమైనవి:
1.లక్ష రూపాయల వరకు రైతుల రుణాల మాఫీ
2.దళితులకు మూడు ఎకరాల భూమి
3. ఆటో రిక్షాలకు పన్న రద్దు
4. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు పన్ను రద్దు
5. మూడున్నర లక్షల రూపాయల ఖర్చుతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం
6. వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్
7. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్
8. బీడి కార్మికులకు వెయ్యి రూపాయల భృతి
9.దళితులు, ఆదివాసీలు, లంబాడీల ఆడపిల్లలకు 50 వేల రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకం
10.పలు సాగునీటి పథకాలు
11.కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం
12. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం, ఇల్లు, వారి పిల్లలకు విద్య,వైద్యం.
13.తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగింపు
14. సామాజిక సర్వే ........
ఈ రకమైన పథకాలన్నింటికీ దాదాపు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. సామాజిక సర్వే అంశం కాస్త కష్టమైనప్పటికీ దీని వల్ల తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ప్రభుత్వానికి కూడా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సర్వే విషయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడివారు మాత్రం కొంత భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా స్థానికులు కానివారు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారిని సంక్షేమ పథకాల నుంచి కాలక్రమంలో తొలగించే అవకాశం ఉంటుంది.
ఇకపోతే స్థానికత, మతప్రాతిపదికపై రిజర్వేషన్లు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పు వంటి వాటిపై మిశ్రమ స్పందన వస్తోంది. ప్రధానంగా స్థానికత అంశంపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక కుటుంబం 50 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడింది. వారికి పిల్లలు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరుగుతారు. వారికి వారి కుటుంబ పెద్దల స్వస్థలాలతో సంబంధాలు ఉండవు. అటువంటి వారి పరిస్థితి ఏమిటి? వారిని స్థానికులు కాదంటే వారు ఎక్కడికి పోవాలి? ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఇది ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. మత ప్రాతిపధికపై రిజర్వేషన్లను ముఖ్యంగా బిజెపి విమర్శిస్తోంది. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్చవలసిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. రంగా స్వాత్రంత్ర్యసమరయోథుడు, రైతు నాయకుడు, జాతీయస్థాయిలో రైతు నాయకుడిగా పేరు ఘడించినవారు. అటువంటి వ్యక్తి కేవలం ఏపికి చెందినవారవడం వల్ల అతని పేరు మార్చడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఒక జాతీయ నాయకుని అవమానించడంగా భావిస్తున్నారు. ప్రొఫెసర జయశంకర్ గొప్ప వ్యక్తే. అందులో అనుమానానికి తావులేదు. అతని పేరు కావాలంటే మరో ముఖ్యమైనదానికి పెట్టవచ్చుగదా అని అంటున్నారు. అంబేద్కర్ దూర విశ్వవిద్యాలయం పేరు మార్చగలరా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలను ఇష్టం ఉన్నా లేకున్నా అంగీకరించక తప్పదని, ఇటువంటి విషయాలలో విమర్శలు అనవసరం అని మరికొందరి వాదన. పోరాటాల నేపధ్యంలో ఏర్పడిన ప్రభుత్వాల పాలనలో ఇటువంటి కొత్తపోకడలు తప్పవు. కొత్తనీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోకతప్పదు.
- శిసూర్య