మనోగళం: ఎప్పుడూ అదే కల వస్తూంటుంది! | Actress Sridevi interview | Sakshi
Sakshi News home page

మనోగళం: ఎప్పుడూ అదే కల వస్తూంటుంది!

Published Sun, Aug 11 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

మనోగళం: ఎప్పుడూ అదే కల వస్తూంటుంది!

మనోగళం: ఎప్పుడూ అదే కల వస్తూంటుంది!

ఎదుటివారిలో నచ్చేది/నచ్చనిది!
 నచ్చేది నిజాయితీ, అందరినీ ప్రేమించే తత్వం. నచ్చనిది
 అబద్ధాలాడటం, హిపోక్రసీ.
     మిమ్మల్ని అత్యంత భయపెట్టేది?
 బల్లి అంటే చచ్చేంత భయం. అదనే కాదు, పాకే జీవులు వేటిని చూసినా హడలిపోతాను.
     అత్యంత సంతోషపడిన సందర్భం?
 ఓసారి షూటింగుకు ముంబై వెళ్లాను. ఆ సమయంలోనే ముంబైలో బాంబ్ పేలింది. పేలుడు గురించి తెలియగానే బోనీ చాలా కంగారు పడిపోయాడు. మొదట నేను బస చేసిన  హోటల్‌కి వెళ్లాడట. నేను షూటింగుకి స్టూడియోకి వెళ్లానని తెలిసి కంగారుగా అక్కడికి వచ్చాడు. నన్ను చూసినప్పుడు తన ముఖంలో కనిపించిన ఆనందాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. గుర్తొస్తేనే చాలా సంతోషమనిపిస్తుంది.


     బాధపెట్టిన విమర్శ?
 విమర్శలు అంతగా బాధపెట్టవు కానీ పుకార్లు బాధపెడుతుంటాయి. బోనీని ప్రేమించకముందే నేను ప్రేమలో ఉన్నానని, ఎవరినో పెళ్లి చేసుకోబోతున్నానని, రహస్యంగా చేసేసుకున్నాననీ రాసేవారు. అప్పుడు చాలా బాధనిపించేది.


     ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం?
 కెరీర్ మొదలైన కొత్త. ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాను. ఓ గాజు టేబుల్ మీదికి నెమ్మదిగా దూకాలి. కానీ నేను చాలా వేగంగా దూకేశాను. అంతే, ఒక్కసారిగా అద్దం పగిలిపోయింది. అందరూ కంగారు పడటం చూసి ‘నేను బాగున్నాను, టెన్షన్ పడొద్దు’ అన్నాను. కానీ వాళ్ల ముఖాల్లో ఎక్స్‌ప్రెషన్ చూశాక అర్థమయ్యింది ఏం జరిగిందో. నా కాళ్లలో గాజు పెంకులు గుచ్చుకుపోయాయి. రక్తంతో నా కాళ్లు, దుస్తులు తడిచిపోయాయి. అది నేను గమనించలేదు.
 
     మీ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం?
 నాకు చిత్రలేఖనమంటే ఇష్టం. కానీ పెళ్లయ్యాక  దానికి దూరమయ్యాను. పిల్లలు పెద్దవాళ్లయ్యాకే మళ్లీ మొదలుపెట్టాను. అలసటగానో విసుగ్గానో అనిిపిస్తే, వెంటనే బ్రష్ పట్టుకుంటాను. అది నాకు ఎంతో నాకు రిలీఫ్‌నిస్తుంది.
     మీరు మిస్ అయ్యానని ఫీలయ్యేది...?
 చదువు. నేను చాలా బాగా చదివేదాన్ని. అయితే చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేయడంతో రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమయ్యేది. సినిమాల్లో బిజీ అయిపోయాక తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టేశాను.
     మీరు నమ్మే సిద్ధాంతం?
 నువ్వు నువ్వుగా ఉండు. ఎవరి కోసమూ నీలో లేనిదాన్ని, నువ్వు కానిదాన్ని చూపించే ప్రయత్నం చేయకు.
     వెంటాడే కల?
 నా చుట్టూ బోలెడు పాములు ఉంటాయి. వాటి మధ్యలో నేను బెదురుగా నిలబడి ఉంటాను. ఈ కల చాలాసార్లు వస్తూంటుంది. ముఖ్యంగా ఒంట్లో బాలేనప్పుడు!
     మీరు ఎంతో పదిలంగా దాచుకున్న వస్తువు...?
 నేపాల్‌లో ‘ఖుదాగవా’ షూటింగ్‌లో ఉన్నప్పుడు నన్ను ఎంతగా మిస్సవుతుందో చెబుతూ అమ్మ ఒక ఉత్తరం రాసింది. తింటున్నావా, జాగ్రత్తగా ఉంటున్నావా అంటూ ఎన్ని ప్రశ్నలు వేసిందో! తన ప్రేమకు ప్రతిరూపంగా అనిపించే ఆ ఉత్తరాన్ని ఫ్రేమ్ కట్టించి దాచుకున్నాను.
     దేవుడి మీద నమ్మకం ఉందా?
 ఉంది.  వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం.
  దేవుడు మిమ్మల్ని స్వర్గానికి ఆహ్వానిస్తే, అక్కడ ఎవరిని కలుసుకోవాలనుకుంటారు?
 అమ్మానాన్నల్ని!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement