పిల్లి ‘మ్యావ్’ అనకపోతే ఏమిటర్థం?
... ఏదో అర్థం ఉండే ఉంటుంది. అదేమిటో పిల్లి బాడీ లాంగ్వేజ్‌ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. తమ మూడ్స్‌ని (మానసిక స్థితిని) తెలియజేయడానికి పెంపుడు పిల్లులు అనేక విధాలైన భంగిమలు పెడుతుంటాయి. ఈ సంగతి మీరిప్పటికే కనిపెట్టి ఉంటారు. లేదా మీ పిల్లిని కాసేపు అలా గమనిస్తూ ఉండండి. మీ దృష్టిలో పడేందుకు అది ఎన్ని రకాల వేషాలు వేస్తుందో తెలిసిపోతుంది. పిల్లులకు ప్రధానంగా నాలుగు రకాలైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ భాష ఏమిటో, దాని అర్థం ఏమిటో, ఆ తర్వాత మనం చేయవలసింది ఏమిటో ఓసారి చూద్దాం.
తోకను పైకి లేపితే:
ఇది పిల్లి రిలాక్స్ అయ్యే విధానం. తోకను గాలిలోకి లేపడమే కాకుండా, రెండు చెవులను ముందుకు తెచ్చేస్తుంది. మీ వైపు అడుగులు వేస్తుంది.
అర్థం ఏమిటి?
విశ్రాంత స్థితిలో ఉందని. మీకు స్నేహపూర్వకంగా హలో చెప్తోందని!
అప్పుడు మీరేం చేయాలి?
మీ చేతిని వాసన చూడనివ్వాలి. మీరూ హలో చెప్పాలనుకుంటే పిల్లి తలను, వీపును నెమ్మదిగా నిమరాలి.
వెల్లకిలా పడి, పొట్టను చూపిస్తున్నట్లు అటు ఇటు కదులుతుంటే:
ఇది కూడా రిలాక్స్‌డ్ మూడే. హలో చెప్తున్నట్లు.
అర్థం ఏమిటి?
సాధారణంగా ఇంట్లో వాళ్లతో ఎడబాటు కలిగినప్పుడు, వారు కనిపించగానే పిల్లులు ఇలా చేస్తాయి. తలను, శరీరాన్ని మీ కాళ్లకు ఆన్చి రుద్దుతాయి. ఇంతసేపు ఏమయిపోయావ్ అన్నట్లు వెల్లకిల పడతాయి.
అప్పుడు మీరేం చేయాలి?
తాకి గారాం చేయాలి. పొట్టను తాకకుండా తలపై నిమరాలి. హాయ్ స్వీటీ (లేదా మీకు అలవాటైన ఇంకో పేరు) అంటూ పలకరించాలి.
పక్కకు పడుకుని ఒళ్లు సాగదీసుకుంటే:
అప్పుడు దాని కళ్లు గమనించండి. అర్ధ నిమీలితం అంటారే అలా ఉంటాయి. సగం మూసినట్లు. ముఖం కూడా నిద్రకు వచ్చినట్లు ఉంటుంది.
అర్థం ఏమిటి?
అలా చేస్తుంటే తను ఉన్నది వెచ్చటి ప్రదేశం అయి ఉంటుంది. ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ అలా చేస్తుందన్నమాట. అంతే కాదు. కడుపు నిండుగా ఉన్న సంతృప్తితో బద్ధకంతో ఒళ్లు విరుచుకుంటోందని.
అప్పుడు మీరేం చేయాలి?
పిల్లి కనుక నిద్రలో లేకుండా ఉంటే దాని మూతి దగ్గర మీ చేతిని పెట్టి వాసన చూడనివ్వాలి. తలపై ప్రేమగా చిన్న తాడనం (స్ట్రోక్) లాంటిది ఇవ్వాలి. ఒకవేళ అది నిద్రకు వచ్చినట్లుగా ఉంటే దాన్నలా కొద్దిసేపు వదిలేయాలి.
బెరుగ్గా చూస్తూ ముక్కును నాలుకతో తాకుతుంటే:
అప్పుడు కాస్త దూరంగా ఉండి గమనించాలి. తలను అదిమి పెట్టి, గుడ్లు మిటకరించి ఉంటుంది. మాటి మాటికీ నాలుకను వెనక్కి మడిచి ముక్కును నాకుతుంటుంది.
అర్థం ఏమిటి?
భయపడిందని. దాక్కోడానికి ఒక స్థలం కోసం చూస్తోందని. ఏ క్షణమైనా అక్కడినుంచి లేచి పరుగెత్తబోతోందని.
అప్పుడు మీరేం చేయాలి?
దానిని మరింత భయపెట్టకుండా... వీలైతే దాక్కునే స్థలం ఉన్నవైపు డెరైక్ట్ చేయాలి. పరుగెత్తడానికి అవకాశం ఇవ్వాలి. అంటే మీరు అక్కడి నుంచి తప్పుకోవడం ద్వారా దానికి సురక్షిత మార్గం ఏర్పరచాలి. అది ఎవరిని చూసి భయపడుతోందో, లేదా ఏమి చూసి భయపడుతోందో గమనించి వారిని / వాటిని పిల్లికి దూరం చేయాలి.
వీపును చాపంలా వంచితే:
గమనించండి. ఈ భంగిమలో అది తోకను ముడిచి, బలంగా ఒంటికి అన్చుకుని ఉంటుంది. కళ్లు పెద్దవి చేసి చూస్తుంటుంది.
అర్థం ఏమిటి?
విపరీతమైన భయంతో వణికిపోతోందని.
అప్పుడు మీరేం చేయాలి?
దాని దగ్గరకు వెళ్లకూడదు. దాంతో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. తక్షణం దాన్ని ఎటైనా వెళ్లనివ్వాలి. తాకే ప్రయత్నం అస్సలు చేయకూడదు. టచ్ చేస్తే కనుక అది మిమ్మల్ని రక్కే ప్రమాదం ఉంటుంది.