పెళ్లి కానుకలు
వియత్నాంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లా ఉంది! అలంకరించిన రిక్షాలు కాన్వాయ్‌గా వెళ్తున్న ఈ దృశ్యం రాజధాని హనోయ్‌లోది. పెళ్లికొడుకువాళ్లు తమ కానుకల్ని పెళ్లికూతురు కుటుంబానికి ఇలా పంపుతున్నారు. మహాయాన బౌద్ధ శాఖ విస్తరించివున్న ఆ దేశంలో పెళ్లికి సాంస్కృతికంగా చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా పెళ్లికి వారం రోజులముందు ఈ లాంఛనాలు అందుతాయి.
కొండ కడుపున ఇల్లు
వీళ్లు పెరూ దేశస్థులు. అందులోనూ అయాకుషో రాష్ట్రం వారు. అందునా చుపాన్ గ్రామస్థులు. ఈ ఊరు అండీస్ పర్వతశ్రేణుల్లో ఉంటుంది. ఊరంటే ముప్పై కుటుంబాలంతే! వీళ్లు ఎక్కువగా మొక్కజొన్న, ఆలుగడ్డలు పండిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఈ ఫొటోలో ఉన్న వాళ్ల ఇంటిపేరు డియాజ్. ఫెర్నాండెజ్, లోపెజ్‌లాగే ఇదీ దక్షిణ అమెరికాలో ఎక్కువమందికి ఉండే ఇంటిపేరు. సరేగానీ, ఇంతకీ వీళ్లు ఇవ్వాళ ఏం వండుకున్నారు? నూడుల్సు, ఆలుగడ్డలు, చిక్కుళ్లు, మొక్కజొన్న. అన్నట్టూ, అయాకుషోలో 33 చర్చిలున్నాయి. ఏసుక్రీస్తు జీవితంలోని ఒక్కో సంవత్సరాన్నీ ఒక్కోటీ ప్రతిబింబిస్తుంది.
మళ్లీ బడికి...
సోమవారం నాడు బడికి వెళ్లడమంటే... కష్టమే కదా! క్యూబా పిల్లలకైనా తప్పేది కాదు కదా! ఈ గుర్రపుబండి దృశ్యం అక్కడి ‘శాన్ జోస్ డె లాస్ లాజస్’లోది. అన్నట్టూ, అక్కడ విద్య మొత్తం ప్రభుత్వాధీనంలో ఉంటుంది. క్యూబా తన బడ్జెట్‌లో పది శాతం ఈ రంగానికి కేటాయిస్తుంది. యునెస్కో ప్రకారం అగ్రదేశాలు అమెరికా , బ్రిటన్ కేటాయించేది వరుసగా 2, 4 శాతాలు మాత్రమే!