అవి ఇప్పటి వలే డిజిటల్ కెమెరాలు అందుబాటులో లేని రోజులు. మా ఫ్రెండ్ ఒకరి దగ్గర చిన్న కెమెరా ఒకటి ఉండేది. పిక్‌నిక్ మొదలు తీర్థయాత్రల వరకు రీల్లు కొనుక్కొని ఫోటోలు దిగేవాళ్లం. ఒకసారి ఫ్రెండు పెళ్లికి పూరీ(ఒడిషా)కి వెళ్లాం.పెళ్లి కార్యక్రమాలలో ఫోటోలతో పాటు జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలో, సముద్రం దగ్గర ఫోటోలు దిగాలని కలలు కన్నాం.ఆ రోజు పూరీకి ప్రయాణం. హడావిడి పనులతో రీలు కొనడానికి సమయం చిక్కింది కాదు.ఒక పెద్దాయన మా బాధను చూసి...‘‘పూరీలో సవాలక్ష స్టూడియోలు ఉంటాయి. కావలసిన రీలు దొరకడం ఏమంత కష్టం కాదు’’ అనడంతో మా నిరాశ మాయమైంది. పూరీ చేరిన రోజు ఆదివారం కనుక దుకాణాలన్నీ మూసి ఉన్నాయి.‘అయ్యో!’ అనుకున్నాం.కూపీ తీస్తే ‘‘ఒక స్టూడియో ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ప్రయత్నించి చూడండి’’ అన్నాడు ఒక వ్యక్తి.రిక్షా మాట్లాడుకొని వెళ్లాం.అప్పటికీ చాలా సమయం వృథా అయింది.హడావిడిగా రిక్షా దిగి ఆ స్టూడియోలో రీలు కొని కెమెరాలో లోడు చేసి సముద్ర తీరం చేరుకున్నాం. వచ్చిపోయే కెరటాలతో రకరకాల ఫోజులలో ఫోటోలు దిగాం. ఆ తరువాత పెళ్లి ఫోటోలు తీయడం మొదలుపెట్టాం.
అమ్మలక్కలైతే పనులు ఎగ్గొట్టి మరీ రకరకాల చీరల్లో ఫోటోలు దిగారు. మరునాడు రీలు ఇచ్చాం. సాయంత్రం వస్తే ఎన్ని కరెక్ట్‌గా వచ్చాయో చూసి చెబుతాను అన్నాడు ఫోటోగ్రాఫర్.సాయంత్రం స్టూడియోకు వెళ్లాం.ఫోటోలు ఎలా వచ్చాయో అనే ఆసక్తి మాలో అంతకంతకూ పెరుగుతోంది.ఫోటోగ్రాఫర్ రీలు విప్పి చూపించాడు.అంతా తెల్లగా కనబడింది.అది చూసి మేము తెల్లముఖాలేశాం.రీలు మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్‌పైర్ అయిందట. హడావిడిలో ఇది మేము పట్టించుకోలేదు. ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని వెర్రి నవ్వొకటి నవ్వుకోవడం తప్ప ఏం చేయగలం?
– ఏ.గోవిందరాజులు ఖరగ్‌పూర్
తెల్లముఖాలేశాం!
Published Sun, Sep 30 2018 1:58 AM | Last Updated on Sun, Sep 30 2018 1:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment