ఆజన్మం: వజ్రం పళ్లు తోముతుందా?
వజ్రం కూడా డైనింగ్ హాల్‌కు వస్తుందా? పాలకోసం అందరిలా వరుసలో నిలబడుతుందా?
ఆంజనేయులు మీసాలు చూసి నాలాగే భయపడుతుందా?
అప్పటికి రెసిడెన్షియల్ స్కూల్లో చేరి రెండో రోజు. మేడ్చల్ నుంచి వచ్చానన్న కారణంగా శ్రీశైలం ఫ్రెండయ్యాడు. కొత్త బడిలోకో, కొత్త ఉద్యోగంలోకో అడుగుపెట్టగానే, తక్షణం ‘ఒకరు’ ముందు పరిచయం అవుతారు. ఆ పరిచయానికి ఏవైనా కారణాలుండొచ్చు. అలాగని అవే కారణాలున్నవారు పరిచయం కాకపోవచ్చు కూడా! అంటే, ఆ ఒకరిలో ఉండే స్వాభావికమైన గుణమేదో వెంటనే దగ్గరయ్యేలా చేస్తుంది. అయితే, ఈ తక్షణ స్నేహం తర్వాతి కాలంలో కూడా నిలబడుతుందని చెప్పలేం. అది కేవలం ఆ పరిస్థితులకు మనం అలవాటు పడటానికి ఉపకరిస్తుంది. చాలాసార్లు అంతవరకే ఆ స్నేహపు ప్రయోజనం. అలా శ్రీశైలం స్నేహం నేను కీసరగుట్ట గురుకుల పాఠశాలలో తొలి బెరుకులు పోగొట్టుకోవడానికి పనికొచ్చింది. శివరామిరెడ్డి సార్ ఊతపదం ఏమిటి? అప్పల్రాజు సార్ క్వార్టర్‌లో జామచెట్టు కాయలు ఎలా ఉంటాయి? పిల్లలు తెంపిన సీతాఫలాలు ఏ పొదల మాటున మాగేస్తారు? నర్సు మేడమ్ దృష్టిలో పడేందుకు పీఈటీ సార్ ఎలా నవ్వుతాడు? ఇట్లాంటివేవో విడతలుగా చెప్పాక, ఒకబ్బాయిని చూపించి, ‘కీసరగుట్ట వజ్రం’ అన్నాడు శ్రీశైలం. ‘‘ఆటల్లో ఫస్టు; చదువులో ఫస్టు.’’
ఐలేశ్వర్ నాకంటే ఓ క్లాసు జూనియరే! కానీ నాకన్నా బలంగా ఉంటాడు. నాకన్నా ఎత్తుగా ఉంటాడు. పైగా, నాలా ఎనిమిదిలో కాకుండా ఐదో తరగతిలోనే అక్కడ చేరడం వల్ల, స్కూల్ పరంగా నాకన్నా సీనియర్ కూడా!
ఒక వజ్రపు ఉనికి అంటూ తెలిసింతర్వాత, వందమందిలో ఉన్నా అది కనబడుతుంది. అలా నేను ఎక్కడికెళ్లినా ఐలేశ్వర్ ఇట్టే ఫోకస్ అయ్యేవాడు. ప్రేయర్‌లో కనబడేవాడు; స్పోర్ట్స్ పీరియడ్‌లో కనబడేవాడు; ఒంటికి తువ్వాలు చుట్టుకుని కూడా కనబడేవాడు.
కానీ అలా చూడటంలో ఒక నిరాశ ఏదో నన్ను కమ్మేసేది. వజ్రం కూడా డైనింగ్ హాల్‌కు వస్తుందా? పాలకోసం అందరిలా వరుసలో నిలబడుతుందా? ఆంజనేయులు మీసాలు చూసి నాలాగే భయపడుతుందా? నేనూ పళ్లు తోముకుని, అతడూ పళ్లు తోముకుని, నోరు నిండిపోయినప్పుడు ఎడమవైపు పెదాల మూల నుండి జారిపోయే నురగ ఏర్పరిచే చార ఇద్దరికీ ఒకటే అయినప్పుడు అతడు నాకన్నా గొప్పవాడు ఎలా అవుతాడు? వజ్రాన్ని నాతో సమానంగా నిలబెట్టే, ఇంకా చెప్పాలంటే నాతో సమానంగా కిందికి దిగజార్చే ఈ దైహిక కార్యక్రమాల మీద నాకు కోపం వచ్చేది. ఆ వజ్రం వాటిని నిరసించాలని ఆశపడేవాడిని. కానీ ఆ వజ్రం గట్క టిఫిన్ రోజు ఆబగా తింటోందే! మల్లయ్య తుడిచి వెళ్లాక ఉండే టేబుల్ మీది తేమను కూడా పట్టించుకోవడం లేదే! అలా ఆకాశంలోంచి వచ్చి, ఇలా వెళ్లిపోతేనేగానీ లేదంటే అతడు వజ్రం ఎలా అవుతాడు? అందుకే తను నాకు కేవలం ఐలేశ్వర్‌గానే మిగిలిపోయాడు.
చాలా ఏళ్ల తర్వాత, ఒక చెన్నై పారిశ్రామికవేత్త గురించి పేపర్లో చదివాను. ఆయన కష్టపడి పైకొచ్చాడు; అనూహ్యమైన విజయాలేవో సాధించాడు; ఇంకా తన అనుభవాలేవో చెప్పాడు. అవేవీ నన్ను ఆకట్టుకోలేదుగానీ, ‘పెరుగన్నంలో ఆవకాయ వేసుకుని తినడం ఇష్టం’ అన్నాడు. అదిగో, అది నన్ను పట్టేసింది. ఆయన గొప్పవాడే కావొచ్చు; కానీ అంతదాకా మా ఇద్దరి మధ్యన ఏదో పరాయితనం ఉండింది. ఈ మామిడికాయ పెరుగన్నం మాట ఎత్తేసరికి, ఆయన్ని నాలోకి తీసుకోవడానికి అడ్డంకిగా ఉన్నదేదో కరిగిపోయింది.
అజయ్ దేవ్‌గన్‌లాంటి వంకరపళ్లు నాక్కూడా ఉన్నాయి కాబట్టి, ఇద్దరమూ ఒకటే అనుకునేవాణ్ని. దేహానికి మించి కూడా మనిషి ఉంటాడని నాకు ఎప్పటికోగానీ అర్థం కాలేదు. ‘వజ్రం’ ఫస్టు వస్తుంది; మరొకటి రాదు. ఆవకాయ తిన్నంత మాత్రాన మనం మరేదో కాలేము. పికాసోకి మోషన్స్ అయ్యాయంటే, అది దేహం కల్పించే బరువు. మనుషులు వదిలి వెళ్లగలిగే గుణాత్మకమైన విలువని నేను శరీర పరిమితి కోణంలో అర్థం చేసుకుంటూ, అసలైన అర్థాన్ని అందుకోవడంలో విఫలమయ్యాను. ఒకప్పుడు, ఒకరికి మహత్వం ఆపాదించిన తర్వాత, వారు మామూలుగా ఉండటం నచ్చేదికాదు. దానికి విరుద్ధం గా, మహత్వం అనేది మామూలైపోయినవాళ్లు మామూలు మనుషుల్లా వ్యవహరించడం నచ్చుతోందిప్పుడు.
- పూడూరి రాజిరెడ్డి