ఫ్యాన్ ఎక్కడుంటుందో? | Old jinsan Artwork | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ ఎక్కడుంటుందో?

Published Sun, Aug 30 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

ఫ్యాన్ ఎక్కడుంటుందో?

ఫ్యాన్ ఎక్కడుంటుందో?



 సోఫా ఎక్కడుంది?
 ‘అదిగో సీలింగ్‌పై’
 ‘డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంది?’
 ‘అది కూడా సీలింగ్‌పైనే’
 డైనింగ్ టేబుల్, సోఫా సీలింగ్‌పై ఉంటాయా... అదెలా?! ఎలాగో తెలియాలంటే చైనా వెళ్లాల్సిందే.
    
 టూరిజానికి కావలసింది ఏమిటి?
 ఆకర్షణ.
 అదెక్కడి నుంచి వస్తుంది?
 భిన్నత్వం నుంచి.

 అవును. ఆ భిన్నత్వమే చైనాలోని ‘ఫోక్ పెయింటింగ్ విలేజీ’ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకోవడానికి కారణం. జిన్‌షాన్ జిల్లాలో ఉన్న ఫెన్‌జియింగ్ నగరాన్ని చూస్తే ప్రాచీన నాగరికతను చూసిన అనుభూతి కలుగుతుంది.  చరిత్రాత్మకమైన మూడు రాతి వంతెనలు ఇక్కడ ఉన్నాయి. అందుకే దానికి ‘ప్రాచీన నీటి నగరం’ అని కూడా పేరు.
 
 ప్రాచీన జిన్‌షాన్ చిత్రకళ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందడం, ప్రముఖ చిత్రకారుడు చెంగ్ షిఫా పుట్టిన ప్రాంతం కావడంతో ఫెన్‌జియింగ్  కళాకారులను ఎంతో ఆకర్షిస్తుంటుంది. ఒకవైపు ప్రఖాత్య చిత్రకళా వెలుగుతో ప్రకాశించే ప్రాంతాలు, మరోవైపు  చారిత్రక వైభవాన్ని కళ్లకు కట్టే ప్రాచీన నిర్మాణాలు. ఇలా రెండు రకాల విశేషాలతో ఫెన్‌జియింగ్ అందరినీ అలరిస్తుంది. మరి పర్యాటకులను ఆక ర్షించడానికి ఇది మాత్రమే సరిపోదు అను కున్నారో ఏమో... ఫెన్‌జియింగ్‌లో ‘చైనా ఫోక్ ఆర్ట్ విలేజ్’ను నిర్మించారు. ‘మడిసన్నాక కాస్త కళా పోషణ ఉండాలి’ అనుకునేవాళ్లకి ఈ విలేజ్ కన్నులకు పండుగను తెస్తుంది. ఈ విలేజ్‌లో ఎక్కడ చూసినా జానపద చిత్రాలు కనిపించి మురిపిస్తుం టాయి. ఇక్కడ అంతకంటే అతి పెద్ద ఆకర్షణ... తలకిందుల ఇళ్లు. మొత్తం ఇంటిని తిప్పి పెట్టినట్టుగా కనిపించే ఈ గృహాల వైభవాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు.
 
 నిజానికి తలకిందుల ఇళ్లు కొత్తేమీ కాదు. రష్యా, జర్మనీ, ఆస్ట్రియాల్లో కూడా ఇలాంటి చిత్రమైన నిర్మాణాలు జరిగాయి. అయితే వాటి కంటే ఎక్కువగా ఈ చైనా  ఇళ్లకు ప్రాచుర్యం లభించింది. కారణం... ఇళ్లతో పాటు ఇంటీరియర్ డిజైన్ కూడా  తలకిందుల థీమ్‌ను ఫాలో కావడం!‘‘మొదటిసారి ఈ తలకిందుల ఇంట్లోకి  అడుగుపెట్టినప్పుడు కళ్లకేదో మాయపొర కమ్మినట్లు అనిపించింది. ఒక్కసారిగా భూమి గిర్రున తిరిగినట్టని పించింది. కాళ్లు ఇంటి పై కప్పుపై ఉండి సీలింగ్ ఫ్యాన్ ఫ్లోర్‌పై ఉండడం ఎంత విచిత్రం!’’ అంటున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన ఒక టూరిస్టు.
 
 ‘‘ప్రపంచం తలకిందులైంది అనే మాట వింటుంటాం.  ఇక్కడి ఇండ్లలోకి  అడుగు పెట్టినప్పుడు నాకు అలాగే అనిపించింది. మొదట్లో కాస్త కళ్లు తిరిగి నట్లు కూడా అనిపించింది’’ అంటాడు జపాన్ టూరిస్ట్ అచిహిరో. ఈ తలకిందుల ఇండ్లతో పాటు ఆర్ట్ విలేజ్‌లోని కంట్రీ సైడ్ కార్నివాల్, చైనా ఫోక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ మొదలైనవి పర్యాటకులను బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి.
 అనుకరణ అనే సరికొత్త ఎత్తుగడతో ప్రస్తుత చైనా పాలకులు టూరిజాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అయితే అనుకరణ మాత్రమే దానికదే ఆకర్షణగా నిలవదు. ఫెన్‌జియింగ్ నగరానికి ఉన్న ప్రాచీన చారిత్రక వైభవం ఈ తలకిందుల ఇండ్లకు ప్రాచుర్యాన్ని కలిగిస్తోంది.
 
 ‘పోస్ట్  మోడ్రన్ టెక్నిక్‌తో కట్టిన నిర్మాణాలు ఇవి’ అంటారు ఆర్కిటెక్చర్ గురించి తెలిసినవాళ్లు. ‘రివర్స్ సైకాలజీ ఆధారంగా నిర్మించిన నిర్మాణాలు ఇవి’ అంటారు మానసిక శాస్త్రంతో పరిచయం ఉన్నవాళ్లు. ఏ రంగం వాళ్లు ఎలా విశ్లేషించినా, సామాన్యులు మాత్రం ఈ తలకిందుల ఇళ్లలోకి అడుగు పెట్టినప్పుడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఆనందమే ఈ ఆర్ట్ విలేజ్‌ను చైనాలోని టాప్ టూరిస్ట్ అట్రాక్షన్‌‌స లిస్టులోకి చేర్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement