చీకట్లో ఒకరోజు...
పట్టుకోండి చూద్దాం
‘‘నువ్వు ఆ సృజనను పెళ్లి చేసుకుని ఉంటే ఇలా అద్దె ఇంట్లో కాకుండా ఏడంతస్తుల మేడలో కాలు మీద కాలు వేసుకొని సుఖంగా జీవించేవాడివి. నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు?’’ అని అడిగింది జానకి.
జానకిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కిశోర్. ఈ పెళ్లి వాళ్ల ఇంట్లో వాళ్లకు ఎంతమాత్రం ఇష్టం లేదు.
కిశోర్ మేనత్త సుజాత కోటీశ్వరురాలు.
భర్త చిన్నవయసులోనే చనిపోయినా అధైర్యపడకుండా నలుగురు గొప్పగా చెప్పుకునే పారిశ్రామికవేత్తగా ఎదిగింది. చిన్నస్థాయి నుంచి కోట్లు సంపాదించే పారిశ్రామికవేత్తగా ఎదిగిన సుజాత అంటే చుట్టాలు పక్కాలలో చాలా గౌరవం. ఆమె జీవితాన్ని పిల్లలకు పాఠాలుగా చెబుతుంటారు.
సుజాతకు ఒకే కూతురు. పేరు సృజన.
సృజనకు కిశోర్ అంటే చెప్పలేనంత ఇష్టం.
పెళ్లంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటానని పట్టుబట్టింది.
అతి కష్టం మీద కూతురు కోరికను మన్నించింది సుజాత.
అయితే మరోవైపు పరిస్థితి భిన్నంగా ఉంది.
కిశోర్ తన కొలిగ్ అయిన జానకిని ప్రేమించాడు.
సృజన ప్రపోజల్‌ని తిరస్కరించి జానకిని పెళ్లి చేసుకున్నాడు.
‘‘కిశోర్ తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు’’ అంటూ చాలామంది తిట్టారు.
ఇక కుటుంబ సభ్యులైతే కిశోర్‌తో మాట్లాడడమే మానేశారు. ఒక విధంగా చెప్పాలంటే తమ నుంచి బహిష్కరించారు.
తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్యతో పాటు ఉంటున్నాడు కిశోర్.
‘‘కిశోర్ స్థానంలో వేరే ఎవరినీ భర్తగా ఊహించలేను. నేను ఎవరినీ పెళ్లి చేసుకోను’’ అంది సృజన.
కూతురికి రకరకాలుగా చెప్పి చూసింది సుజాత.
ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా చేయించింది.
అయినా ఫలితం లేదు.
‘‘కిశోర్‌ను తప్ప ఎవరినీ భర్తగా ఊహించలేను’’ అని ఎప్పటిలాగే చెబుతుంది తప్ప ‘పెళ్లి చేసుకుంటాను’ అనడం లేదు సృజన.
తన కూతురి జీవితాన్ని ఎడారి చేసిన కిశోర్ అంటే సుజాతకు అసహ్యం ఏర్పడింది.
‘‘ఏ భార్యను చూసి అయితే మురిసిపోతున్నావో... ఆ భార్య వల్లే చనిపోతావు’’ అని కిశోర్‌ను కసిగా తిట్టుకుంది సుజాత.
ఆరోజు కిశోర్, జానకీల పెళ్లి రోజు.
పెళ్లి చేసుకోవడానికి తాము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో ఒకసారి గుర్తుతెచ్చుకున్నారు ఇద్దరు.
‘‘నువ్వు ఆ సృజనను పెళ్లి చేసుకుని ఉంటే ఇలా అద్దె ఇంట్లో కాకుండా ఏడంతస్తుల మేడలో కాలు మీద కాలు వేసుకొని సుఖంగా జీవించేవాడివి. నాలో ఏం నచ్చి పెళ్లి చేసుకున్నావు?’’ అని అడిగింది జానకి.
‘‘నీ మనసు చూసి పెళ్లి చేసుకున్నాను. మంచి మనసును కోట్లతో కొలవలేము’’ అన్నాడు కిశోర్.
కొద్దిసేపటి తరువాత....
‘‘నేను క్రికెట్ మ్యాచ్ చూస్తాను’’ అంటూ టీవి ముందు వాలిపోయాడు కిశోర్.
జానకి తన గదిలోకి వెళ్లి పుస్తకం చదువుకుంటుంది.
కొద్దిసేపటి తరువాత కరెంట్ పోయింది.
కొత్తగా ఇల్లు మారారు. ఇంట్లో వెలిగించడానికి ఒక్క క్యాండిల్ కూడా లేదు. జానకి సెల్‌ఫోన్ రిపేర్‌లో ఉంది.
కరెంట్ వచ్చేలోపే కిశోర్ హత్యకు గురయ్యాడు.
పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు.
జానకిని ఎంక్వ్యేరీ చేశారు.
‘‘ఆయన టీవీ చూస్తున్నారు. కొద్దిసేటి తరువాత కరెంట్ పోయింది. నేను గది నుంచి బయటకు రాలేదు. పుస్తకం చదువుతూ కూర్చున్నాను’’ అని చెప్పింది జానకి.
ఇంట్లో వెలిగించడానికి ఒక్క క్యాండిల్ కూడా లేదు.
జానకి సెల్‌ఫోన్ రిపేర్‌లో ఉంది.
మరి ఆ చీకట్లో ఆమె పుస్తకం ఎలా చదవగలిగింది?
పోలీసులు జానకిని ఎందుకు అనుమానించలేదు?
Ans:
పోలీసులు జానకిని అనుమానించకపోవడంలో ఎలాంటి తప్పులేదు. జానకి అంధురాలు. ఆ చీకట్లో ఆమె చదివింది బ్రెయిలీ బుక్. దీన్ని చదవడానికి వెలుగుతో పని లేదు కదా!