శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు | Sakshi
Sakshi News home page

శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు

Published Sat, Mar 29 2014 11:44 PM

sri jaya nama samvatsara panchangam

మేషం
 (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 5.)
 
వీరికి జూన్ 19 నుంచి చతుర్ధంలో గురుడు ఉచ్ఛస్థితి సంచారం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నా, క్రమేపీ పరిస్థితులు కొంత చక్కబడతాయి. నవంబర్ నుంచి అష్టమ శని ప్రారంభం. సప్తమ, అష్టమ రాశుల్లో శని సంచారం అంత అనుకూలం కాదు.  మొత్తం మీద వీరికి మధ్యస్థంగా ఉంటుంది.  కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యం కాగలదు. ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానం పాటించడం సర్వదా శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. తలచిన పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. ద్వితీయార్థంలో వాహన, గృహయోగాలు. వ్యాపార సంస్థల వారికి సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి. ద్వితీయార్థంలో పదోన్నతులతో పాటు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి తప్పదు. రాజకీయవర్గాలకు మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ద్వితీయార్థంలో పదవులు, సన్మానాలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కుజుడు, నవంబర్ నుంచి శని అష్టమస్థితి కారణంగా వ్యవహారాలలో చిక్కులు. వ్యయప్రయాసలు. చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. ఈ కాలంలో స్థానచలనాలు కలిగే అవకాశం. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం.  వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదృష్ట సంఖ్య-9.
 
 వృషభం
 (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం -5.)
 
 వీరికి ప్రథమార్ధంలో గురు, శని, రాహువుల అనుకూల స్థితి ఉపకరిస్తుంది. వ్యయంలో కేతువు వల్ల మానసిక క్లేశాలు, వ్యయప్రయాసలు. ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారం కలిగినా శుభస్థితి వల్ల మధ్యస్థంగా ఉంటుంది. జూలై నుంచి పంచమ రాహువు, లాభస్థితిలో కేతువు అన్ని విధాలా అనుకూలురు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రథమార్థంలో రాబడి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులు చేరువ కాగలరు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చొరవ చూపుతారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే తొందరపాటు మాటల కారణంగా ఇంటాబయటా వివాదాలు నెలకొనే అవకాశముంది, ఆచితూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. భూసంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కళాకారులు నైపుణ్యాన్ని చాటుకుని ముందుకు సాగుతారు. రాజకీయవర్గాల వారు కొత్త పదవులు చేపట్టే వీలుంది. ప్రజాదరణ పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. సాంకేతిక వర్గాలవారికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. అక్టోబర్ - నవంబర్ మధ్య అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమ శని ప్రభావం వల్ల కొంత చికాకులు తప్పకపోవచ్చు. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించండి. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-6.
 
 మిథునం
 (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం - 1.)
 
 వీరికి జూన్ నుంచి గురుబలం విశేషం. ప్రథమార్థంలో శని, రాహుకేతువులు అనుకూలురు. జూలై నుంచి అర్థాష్టమ రాహువు ప్రభావం కలిగినా గురుబలం ఉపకరిస్తుంది. మొత్తం మీద వీరికి ద్వితీయార్థం అనుకూల కాలమని చెప్పాలి. స్వతంత్రభావాలు, నిర్ణయాల వల్ల కొన్ని చిక్కులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఒక్కొక్కప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు జూన్ తర్వాత పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలాసవంత జీవనానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి మంచి గుర్తింపు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుని విజయాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు శుభసూచకాలే. పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. నవంబర్ - జనవరి మధ్య కుజుని అష్టమస్థితి సంచారం వల్ల ఈతిబాధలు, మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మకరరాశి కుజునికి ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యారాధన మంచిది. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, మాఘమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5.
 
 కర్కాటకం
 (ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6, అవమానం - 1.)
 
 వీరికి జూన్ నుంచి గురుడు స్వక్షేత్ర సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలం. జూలై నుంచి అర్థాష్టమ రాహువు, నవంబర్ 1 వరకు అర్థాష్టమ శని ప్రభావం అధికం. మొత్తం మీద వీరికి ఆదాయానికి లోటు లేకున్నా వృథా ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇంటాబయటా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మంచికి వెళ్లినా అపవాదులు భరించాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ద్వితీయార్థంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సాధించే వీలుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడే వీలుంది. అయితే, శని, రాహువుల ప్రభావంతో పాటు, జూలై -సెప్టెంబర్ మధ్య కుజుని అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా అవసరాలకు డబ్బు అందడం విశేషం. జనవరి - ఫిబ్రవరి మధ్య అష్టమ కుజుని ప్రభావం వల్ల చర్మ, ఉదర సంబంధిత రుగ్మత లు, తద్వారా ఔషధసేవనం. వ్యాపారులు స్వల్పలాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు పైస్థాయి నుంచి ఒత్తిళ్లులు ఎదురైనా సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు నైపుణ్యాన్ని చూపినా తగిన గుర్తింపు రావడం కష్టమే. రాజకీయవర్గాల వారు ద్వితీయార్థంలో కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం. శని, గురు, రాహువు, కుజులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య-2.
 
 సింహం
 (ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4.)
 
 వీరికి జూన్ వరకూ గురుడు యోగదాయకుడు. తదుపరి వ్యయస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సివస్తుంది. జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని యోగదాయకులు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలుఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. జీవిత భాగస్వామి సలహాల ద్వారా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ద్వితీయార్థం నుంచి గురుబలం తగ్గడం వల్ల కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులతో కూడిన బదిలీలు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారు జారవిడుచుకున్న అవకాశాలను తిరిగి పొందుతారు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. పదవీయోగం, సన్మానాలు. క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తా చాటుకుంటారు. నవంబర్ నుంచి శనికి అర్థాష్టమ స్థితి, సెప్టెంబర్ - అక్టోబర్  మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఉదరం, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ కాలంలో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-1.
 
 కన్య
 (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 5, అవమానం - 4.)
 
 వీరికి జూన్ నుంచి గురుడు లాభస్థితి విశేషమైనది. నవంబర్ వరకూ ఏల్నాటిశని ఉన్నా గురుబలం వల్ల ప్రభావం తగ్గుతుంది. నవంబర్ నుంచి ఏల్నాటి శని పూర్తికాగలదు. జన్మరాశిలో జూలై వరకూ కుజుని స్తంభన వల్ల కొంత ఆందోళన, మానసిక అశాంతి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మధ్యమధ్యలో కొంత అవరోధాలు కలిగినా దేవగురుడు మీకు అన్ని విధాలా అనుకూలించడం వల్ల  అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. పెండింగ్‌లోని కోర్టు కేసులు పరిష్కారమవుతాయ. స్థిరాస్తి వృద్ధి. జీవితాశయ సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిహసించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మొదట్లో కొంత వెనుకబడినా క్రమేపీ అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు సఫలమవుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దరిచేరి ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష ప్రజాదరణ. వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడలు, శాస్త్ర, సాంకేతిక వర్గాలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5.
 
 తుల
 (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7)
 
 వీరికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ కుజుడు వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం ఊరట కలిగించే విషయం. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత, జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు ఎదురవుతాయి. చేసే కార్యాలలో ఏకాగ్రత లోపించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల నిర్ణయాలలోనూ ఆచితూచి అడుగు వేయడం సర్వదా శ్రేయస్కరం. బంధువులు, మిత్రుల నుంచి అపవాదులు, విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రధమార్థంలో గురుని భాగ్యస్థితి, తదుపరి దశమస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి, పైస్థాయి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు.  స్థానచలన సూచనలు ఉన్నాయి.  కళాకారులకు ద్వితీయార్థంలో కార్యజయం, శుభవార్తలు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలించే అవకాశం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా సాగడమే ఉత్తమం. రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు, ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద వీరికి సామాన్యమనే చెప్పాలి. శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పఠించండి. జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-6.
 
 వృశ్చికం
 (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 7)
 
 వీరికి జూన్ 18వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల సంచారం అనుకూలం కాదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి వల్ల ఏల్నాటి శని ప్రభావం ఉన్నా జన్మరాశిపై గురుదృష్టి వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. జూన్ వరకూ కొంత ఆదుర్దా, మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆవాంతరాలు, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో మౌనం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. జూన్ నుంచి శుభకార్యాల నిర్వహణ. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. సమాజంలో మంచి గుర్తింపు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన లేదా ఆస్తి లాభాలు ఉంటాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమ పెరిగినా తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వారి కృషి కొంతమేరకు సఫలమవుతుంది. విద్యార్థుల కష్టం కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకున్న అవకాశాలు దక్కుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు, తిరిగి జనవరి - ఫిబ్రవరి మధ్య కుజ ప్రభావం వల్ల ఒత్తిడులు, అయినవారితో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వీరు శని, రాహు, గురు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ  మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-9.
 
 ధనుస్సు
 (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7)
 
 వీరికి జూన్ వరకు గురుడు సప్తమంలోనూ, తదుపరి అష్టమంలోనూ సంచరిస్తాడు. నవంబర్ వరకూ శని లాభస్థానంలో సంచారం. తదుపరి వ్యయస్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నుంచి వీరికి ఏల్నాటిశని ప్రారంభం. అయితే గురుడు అష్టమంలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం, వ్యయస్థితిలోని శనిని వీక్షించడం మంచిది. మొత్తం మీద శ్రమ కలిగినా కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ప్రథమార్థంలో వాహనాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది, తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగాలు, విశేష ప్రజాదరణ. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. క్రీ డాకారులు, శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నవంబర్ నుంచి ఏల్నాటిశని ప్రారంభం వల్ల కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. చేసే పనిలో ఏకాగ్రత లోపించడం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వీరు శని, గురులకు జపాదులు నిర్వహించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఉపకరిస్తుంది. చైత్ర, శ్రావణం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3.
 
 మకరం
 (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 3.)
 
 వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేష యోగకారులై ఉంటారు. మొత్తం మీద వీరికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తలచిన పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు.  పట్టుదలతో కార్యోన్ముఖులై ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాల వారికి చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. కళాకారులు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకుంటారు, పురస్కారాలు వంటివి పొందుతారు. విద్యార్థుల శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అవకాశాలు మెరుగుపడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలలో అవరోధాలు వంటి చికాకులు ఎదురవుతాయి. వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ  మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8.
 
 కుంభం
 (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3.)
 
 వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగకారకుడు. భాగ్యస్థానంలో శని, రాహువులు సామాన్యులు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రధమార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశయాలు సాధిస్తారు. శత్రువిజయం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాబడితో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. పంటల దిగుబడి పెరిగి రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయవర్గాలకు పద వులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలు గతం కంటే మెరుగైన  అభివృద్ధిని సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడారంగాల వారికి పూర్వవైభవం. అష్టమరాశిలో జూలై వరకూ కుజుడు, జూలై నుంచి రాహువు సంచారం అంత మంచిది కాదు. దీనివల్ల మానసిక ఆందోళన. చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఈ గ్రహాలకు పరిహారం చేయించుకుంటే మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8.
 
 మీనం
 (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6.)
 
 వీరికి జూన్ నుంచి గురుడు విశేష యోగప్రదుడు కావడంతో పాటు, స్వక్షేత్రాన్ని వీక్షించడం శుభదాయకం. అష్టమ శని, రాహు ప్రభావం ఉన్నా గురుబలం వీరికి కొండంత అండగా ఉండడం శుభసూచికం. మొత్తం మీద వీరికి అనుకూలమనే చెప్పాలి. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు.  పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. బంధువర్గం, జీవిత భాగస్వామి తరఫు వారితో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు, గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, వాహనయోగాలు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ద్వితీయార్థంలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పనిభారం మాత్రం తప్పదు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల వారు జూన్ నుంచి అభివృద్ధి పథంలో సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు కొంత వ్యతిరేకత ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. విజయాల కోసం శ్రమపడాలి. శాస్త్ర, న్యాయ, సాంకేతికరంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. జూలై -సెప్టెంబర్ మధ్య అష్టమంలో కుజ, శని కలయిక వల్ల ఈతిబాధలు, మానసిక ఆందోళన. జీవిత భాగస్వామితో విభేదాలు. చర్మ, గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. శనికి తైలాబిషేకం, సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మేలు. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3.
 సర్వేజనా సుఖినోభవంతు...
 
 పుష్కరాలు...
గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో  ప్రవేశంతో గంగానది, వృషభం-నర్మద, మిథునం-సరస్వతీ, కర్కాటకం-యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం-తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం-తుంగభద్ర, కుంభం-సింధు నది, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి.
 
 శూన్యమాసాలు - నిర్ణయాలు
 సూర్యుడు మీనరాశిలో ఉండే  చైత్రం, మిథున రాశిలో ఉండే ఆషాఢం, కన్య యందు భాద్రపదం, ధనుస్సులో ఉన్నప్పుడు పుష్య మాసం  శూన్య మాసములని అంటారు. ఈ శూన్య మాసాల్లో శుభకార్యాలు నిర్వర్తించరు.
 
 ఆయనములు
ఆయనములు రెండు. సూర్యుడు (రవి) మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించునప్పుడు దక్షిణాయనం  ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైన దిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement