నన్ను విజేతని చేసిన రాత్రి!
నిద్రలేని రాత్రులు
నెంబర్‌వన్ అనడంలో కాస్త అహంకారం ధ్వనిస్తోంది.కృష్ణగారు చాలా మంచి వ్యక్తి. అహంకారమన్నదే తెలియని మనిషి. ఆయనకు అనవసరంగా అహంకారాన్ని ఆపాదిస్తున్నానేమో అని కలత చెందాను.
ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని నిద్రలేని రాత్రులు తప్పకుండా ఉంటాయి. నాకూ ఉన్నాయి. కానీ అన్నీ పంచుకోవాలని నేను అనుకోవడం లేదు. ఓ వ్యక్తి దూరమయ్యాడనో, ఓ సంఘటన కలిచి వేసిందనో నిద్ర లేకుండా గడిపిన క్షణాల్ని పంచుకోబోను. ఎందుకంటే నేను సింపథీ కోరుకోను. అందుకే నన్ను విజేతని చేసిన ఓ రాత్రి గురించి చెబుతాను. అప్పుడు నా కెరీర్ మంచి వేగంగా పరిగెడుతోంది. రాజేంద్రుడు - గజేంద్రుడు, మాయలోడు చిత్రాలు వరుసగా సక్సెస్ అయ్యాయి. తరువాతి సినిమాను కృష్ణ గారితో తీయాలని నిర్ణయం అయిపోయింది. ఆ చిత్రం పేరు ‘నెంబర్‌వన్’ అని అనౌన్స్ చేసేశాను. అప్పుడు మొదలయ్యింది అసలు సమస్య.
అప్పటికి చిరంజీవి, బాలయ్య తదితరులు మంచి స్వింగ్‌లో ఉన్నారు. కృష్ణగారికి కాస్త సినిమాలు తగ్గాయి. అలాంటి సమయంలో ఆయనతో ‘నెంబర్‌వన్’ అనే సినిమా తీయడంలో ఉద్దేశమేమిటి, ఆయనే ఇండస్ట్రీలో నెంబర్‌వన్ అనా? అనే ప్రశ్న తలెత్తింది. అది చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్న. నాకసలు అలాంటి ఉద్దేశమే లేదు. కానీ అందరికీ మాత్రం నా టైటిల్ అదే సందేహాన్ని కలిగించింది. కొందరైతే స్వయంగా నా దగ్గరకు వచ్చారు. ‘కెరీర్ బాగుంది, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు, ఇందుకు ఇలాంటి రిస్క్, మీకు చెడ్డపేరు వస్తుంది’ అన్నారు. దాంతో నాకు భయమేసింది. అనవసరంగా కమిటయ్యానా అనిపించింది. ఆలోచనలో పడ్డాను. రెండు మూడు రోజులు అదే టెన్షన్‌లో ఉన్నాను. ఓ రోజు రాత్రయితే అసలు నిద్రే పట్టలేదు.
అయితే టైటిల్ మార్చాలన్న ఆలోచన మాత్రం నాకు రాలేదు. ఎందుకంటే... ‘కొబ్బరిబొండాం’ టైటిల్ పెట్టినప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కొబ్బరిబొండాం, జాంగిరి, జిలేబీ కూడా సినిమా పేర్లేనా అని కొందరు కామెంట్ చేశారు. అప్పడాలు, సాంబార్లు కూడా సినిమా పేర్లుగా పెట్టేస్తారా అంటూ ఎంతోమంది విమర్శించారు. కానీ సినిమా రిలీజయ్యాక మాత్రం ఆ పేరు కరెక్ట్ అని అందరూ అంగీకరించారు. ఇప్పుడు కూడా నా టైటిల్ కరెక్ట్ అని నాకు తెలుసు. కానీ అపార్థాలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి, టైటిల్‌ని ఎలా జస్టిఫై చేయాలి, ఆడియెన్స్‌ని ఎలా కన్విన్స్ చేయాలి అన్నదే నా తపన.
ఆ రాత్రంతా కంటి మీదికి కునుకు రాలేదు. అందరూ అనేదాంట్లో తప్పు లేదు. నెంబర్‌వన్ అనడంలో కాస్త అహంకారం ధ్వనిస్తోంది. కృష్ణగారు చాలా మంచి వ్యక్తి. అహంకారమన్నదే తెలియని మనిషి. ఆయనకు అనవసరంగా అహంకారాన్ని ఆపాదిస్తున్నానేమో అని కలత చెందాను. నాలుగున్నర, ఐదు కావస్తుండగా మనసులో ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ‘ఇంటి బాధ్యతలు ఎవరు తీసుకుంటారో అతడే ఆ ఇంటికి పెద్ద, ఆ కుటుంబంలో అతడే నెంబర్‌వన్’... ఇదే ఆ ఆలోచన. ఆనందం వచ్చేసింది. మనసు తేలిక పడింది. నా సమస్య పరిష్కారమైపోయిందనిపించింది. దాంతో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయాను. ఉదయం రచయిత దివాకర్‌బాబు గారి దగ్గరకు వెళ్లి నా ఆలోచనను చెప్పాను. ఆయన దానిని అందమైన ఫార్మాట్‌గా మార్చారు.
ఆ ఫార్మాట్‌లోనే ‘నెంబర్‌వన్’ రిలీజయ్యింది. మంచి సక్సెస్ అయ్యింది. నెగిటివ్ ఆలోచనలకు, కామెంట్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ప్రశంసల జల్లు కురిపించింది. ఈ అనుభవం నాకో గొప్ప సత్యాన్ని అవగతమయ్యేలా చేసింది. అదేంటంటే... విజయాల్ని అందుకునే ప్రయత్నంలో నిద్రలేని రాత్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. నిద్రపోకుండా చేసిన ఆలోచనలు కొన్నిసార్లు మన జీవితాల్నే మార్చేస్తాయి.
- సమీర నేలపూడి