3వ ప్రపంచ యుద్దం | World war 3 is coming | Sakshi
Sakshi News home page

3వ ప్రపంచ యుద్దం

Published Sun, Jul 2 2017 12:01 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

3వ ప్రపంచ యుద్దం - Sakshi

3వ ప్రపంచ యుద్దం

చరిత్ర ఆత్మను దర్శించగలిగే పరిణతికి ప్రపంచం ఇంకా చేరుకోలేదా? కొందరు మహనీయులనూ, కొన్ని సందర్భాలనూ మినహాయిస్తే తన గతం అందించిన తాత్వికతను అందుకోవడానికి మానవాళికి ఇంకా ఎన్ని యుగాలు కావాలి? ఇప్పుడు మానవాళి వేసుకోవలసిన ప్రశ్నలివి. మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భాన్నీ, అందులో కోటిన్నరకు పైగానే బలైన ప్రాణాల గురించీ, అక్షరాలా ఏరులై పారిన నెత్తుటినీ, వర్షించిన కన్నీటినీ తలుచుకుంటున్న సమయంలో... మూడో ప్రపంచ యుద్ధం గురించిన హెచ్చరికలతో, గర్జనలతో, అణ్వాయుధాల మోహరింపుతో భూగోళం ప్రతిధ్వనించడం ఇందుకు తిరుగులేని సాక్ష్యం. 21వ శతాబ్దం ఆరంభం నుంచి వినిపిస్తున్న ‘మూడో ప్రపంచ యుద్ధం’ మాట రోజురోజుకూ మరింత స్ఫుటంగా వినిపిస్తోంది.

‘అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఏ క్షణంలో అయినా ఘర్షణ ఆరంభం కావచ్చు.’ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఏప్రిల్‌ 15, 2017న చేసిన ప్రకటన ఇది. కానీ ఈ ఘర్షణ ఆ రెండు దేశాలకూ, లేదా మరికొన్ని దేశాలకే పరిమితమయ్యేది కాదు. క్షణాలలో ప్రపంచ దేశాల సమస్యగా మారుతుంది. ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుంది. ఇది రెండు ప్రపంచ యుద్ధాల చరిత్ర ముక్తకంఠంతో చెబుతున్న కఠోర వాస్తవం.

ఈ సంవత్సరం ఏప్రిల్‌ 7న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిరియా వైమానిక స్థావరం అలెప్పో మీద 59 టొమాహాక్‌ క్షిపణులను ప్రయోగించారు. వెంటనే యుద్ధం అంచుల మీద ఉన్న దేశాలూ, ఖండాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. నిజం చెప్పాలంటే ఆ ఉద్రిక్తతలు కొత్తవి కావు. బయటపడే సమయం కోసం వేచి ఉన్నవే. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసాద్‌  విషపూరిత వాయువును ప్రయోగించాడన్న వార్త రాగానే ట్రంప్‌ క్షిపణి దాడికి ఆదేశించారు. ఆ వేడి చల్లారకుండానే, సరిగ్గా వారానికి (ఏప్రిల్‌ 13) అఫ్ఘానిస్తాన్‌లోని ఐఎస్‌ఐఎస్‌ స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఒక క్షిపణిని ప్రయోగించింది.

ఇది అణ్వాయుధం కాకున్నా, అమెరికా ఆయుధాల పొదిలోని అత్యంత శక్తిమంతమైన క్షిపణి. దీనికే ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ అన్న పేరు కూడా ఉంది. సిరియా, అఫ్ఘానిస్తాన్‌ల మీద దాడుల తరువాత అదే ఊపులో ఉత్తర కొరియా మీద కూడా అమెరికా క్షిపణులు కురిపించవచ్చునంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో ప్రపంచ శాంతికి పెద్ద బెడదగా పరిణమించిన మూడు ప్రదేశాలు అవే. ఇస్లాంను అడ్డం పెట్టుకుని నిత్యం నెత్తురుటేరులు పారిస్తున్న ఐఎస్‌ఐఎస్‌ స్థావరం సిరియా. అఫ్ఘానిస్తాన్‌ కూడా అలాంటిదే. ఇక అణ్వాయుధాలతో చాలా దేశాలను భయకంపితులను చేస్తున్న దేశం ఉత్తర కొరియా. సిరియా మీద దాడి జరిగిన వెంటనే ఉత్తర కొరియాకు చెందిన ‘నిరాయుధీకరణ, శాంతి స్థాపన సంస్థ’ అధికార ప్రతినిధి ఒక హెచ్చరిక జారీ చేశాడు. అది: ‘ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్తతలు నెలకొని ఉన్న కొరియా ఉపఖండ శాంతి, రక్షణలకు భంగం వాటిల్ల చేసే రీతిలో అమెరికా పెద్ద ఎత్తున అణ్వాయుధాలను మోహరించింది. పరిస్థితిని యుద్ధం అంచులకు తీసుకువెళ్లింది.

 ఒక ప్రమాదకర పరిస్థితిని సృష్టించింది. ఈ స్థితిలో ఏ క్షణంలోనైనా థెర్మో న్యూక్లియర్‌ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.’ ఆ సంస్థను ఉత్తర కొరియా విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖే నిర్వహిస్తుంది. ఆ ప్రతినిధి మాట ఎలా ఉన్నా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ రెచ్చగొట్టే చర్యలు,  ముందు నుంచీ రణ కండూతితో ఉన్న అమెరికాను వేడెక్కిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి ఉత్తర కొరియాతో  విద్వేషాన్ని సడలనివ్వకుండా కొనసాగిస్తున్న దక్షిణ కొరియాలోనే ఇప్పుడు అమెరికా తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది.

 ప్రస్తుతం అక్కడ 28,500 మంది అమెరికా సైనికులు సిద్ధంగా ఉన్నారు. దీనితో పాటు ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద యుద్ధంలో మునిగి తేలుతున్న దేశాలు 67 వరకు ఉన్నట్టు ఇటీవల ఒక సర్వేలో తేలింది. ఇంత ఉద్రిక్తతల మధ్య ఆ మూడు దేశాల మీద అమెరికా యుద్ధ సన్నాహంలో ఉంది. అందుకే మరో ప్రపంచ యుద్ధం భయం భూగోళాన్ని వెంటాడుతోంది.

రెండు ప్రపంచ యుద్ధాలలో
‘ఒకరోజున ఐరోపా దేశాలన్నీ యుద్ధంలో దిగుతాయి’... ఒక్క సంవత్సరంలో చనిపోతాడనగా జర్మనీ చాన్స్‌లర్‌ అటోవాన్‌ బిస్మార్క్‌ అన్నమాటలి. 1897 నాటికి ఆయన చూసిన ఐరోపా ఖండ పరిస్థితులు అందుకు తగ్గట్టే ఉన్నాయి. ఆయన భయానికి మొదటి హేతువు ఆయన చాన్స్‌లర్‌గా పనిచేసిన జర్మనీయే కావడం ఒక వైచిత్రి. మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్‌వార్‌ ఎందుకు ఎలా వచ్చింది? ఐరోపా దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు ఒక కారణం. రష్యా–సెర్బియా, జర్మనీ, ఆస్ట్రియా–హంగెరీ, ఫ్రాన్స్‌–రష్యా, బ్రిటన్‌–ఫ్రాన్స్‌– బెల్జియం, జపాన్‌–బ్రిటన్‌’ ఈ రీతిలో దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న దేశం మీద దాడి జరిగితే ఒప్పందం చేసుకున్న దేశం రక్షణ సహకారం అందిస్తుంది.

అందుకే సెర్బియా, ఆస్ట్రియా–హంగేరీల ద్వైపాక్షిక  సమస్య ప్రపంచ యుద్ధంగా రూపుదాల్చింది. సెర్బియా మీద దాడికి ఆస్ట్రియా–హంగేరీని జర్మనీ ప్రోత్సహించింది. దీనితో సెర్బియాతో ఒప్పందం ఉన్న రష్యా రంగంలోకి దిగింది. ఫ్రాన్స్‌ మీద దాడి కోసం బెల్జియంను ఆక్రమించినందుకు బ్రిటన్‌ జర్మనీ మీద యుద్ధం ప్రకటించింది. బ్రిటన్‌ అధీనంలోని వలస దేశాలన్నీ (భారత్‌ సహా) యుద్ధంలో పాల్గొన్నాయి. దీనికి తోడు విస్తరణ కాంక్ష, ఆయుధ పోటీ పెరిగాయి.  వర్తమాన ప్రపంచంలో కూడా ఇలాంటి ఒప్పందాలు, ఆయుధ పోటీ కనిపిస్తాయి.

 ఇందుకు ‘నాటో’ పెద్ద ఉదాహరణ. జపాన్‌ మీద దాడి జరిగితే నాటో తరఫున అమెరికా ఆ దేశానికి రక్షణగా వెళుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి మొదటి ప్రపంచ యుద్ధమే బీజాలు వేసింది. ఆ యుద్ధం తరువాత శాంతి స్థాపన కోసం జరిగిన వెర్సయిల్స్‌ ఒప్పందం విజేత కూటమిలోని ఏ దేశానికీ సంతృప్తిని ఇవ్వలేకపోయింది. జర్మనీ మీద విజేత దేశాలు చేసిన దోపిడీ అడాల్ఫ్‌ హిట్లర్‌ వంటి జాత్యహంకార నేతను ప్రపంచం మీదకు తెచ్చింది. ఇప్పుడు అణ్వాయుధ పోటీ, ఇస్లామిక్‌ ఉగ్రవాదం, వ్యూహ ప్రతివ్యూహాలు  రెండు ప్రపంచ యుద్ధాల నాటి పరిణామాలనే, క్రమాన్నే గుర్తుకు తెస్తున్నాయి.

ఆరో ప్రయోగమే జరిగితే.....!
29–5–2017న ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఇది అచ్చంగా అమెరికాను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయోగం. ఆర్థిక ఆంక్షలను దాటి, అమెరికా చేత యుద్ధ ప్రకటనను సిద్ధం చేయించే క్రమంలోనే ఉత్తర కొరియా ఆ చర్యకు పూనుకుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలను తాకగల ఒక అణ్వాయుధాన్ని రూపొందించుకోవడమే ఉత్తర కొరియా లక్ష్యం. ఆ దేశం నిర్వహిస్తున్న ప్రతి అణు పరీక్ష లేదా క్షిపణి పరీక్ష ఆ లక్ష్యాన్ని సాధించే దిశగానే సాగుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. దీనికి సమాధానం అన్నట్టు మరునాడే (మే 30) అమెరికా కూడా క్షిపణి పరీక్ష జరిపింది.

 ఈ రెండు దేశాల మధ్య 2006 సంవత్సరం నుంచి ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఉత్తర కొరియా మొదటిసారి అణు పరీక్ష (పన్గగరి అనే చోట) జరిపినది 2006లోనే. తరువాత 2009, 2013, 2016లో (రెండుసార్లు) ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహించింది. అంటే కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆధ్వర్యంలో ఐదు అణు పరీక్షలు జరిగాయి. ఇందులో తొలి పరీక్ష ఉపరితలం మీద జరిపినా, మిగిలినవి భూగర్భంలో నిర్వహించారు. ఇక తాజాగా జరిపిన (మే 29వ తేదీన) బాలిస్టిక్‌ క్షిపణి 450 కిలోమీటర్లు ప్రయాణించిన స్కడ్‌ తరహా క్షిపణి. ఇది జపాన్‌ సముద్ర తీరంలో పడినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది. మూడు వారాల వ్యవధిలో ఉత్తర కొరియా జరిపిన మూడో పరీక్ష ఇది.

 ఈ ఏడాదిలో జరిపిన పరీక్షలలో పన్నెండవది. ఉత్తర కొరియా క్షిపణి తమ దేశ సాగరతీరాన్ని తాకడం జపాన్‌ను సహజంగానే ఆగ్రహానికి గురిచేసింది. దీనికి తగిన సమాధానం చెబుతామని వెనువెంటనే ఆ దేశ ప్రధాని షింజో అబే హెచ్చరించారు. జపాన్‌ అమెరికా మిత్రపక్షం. ఉత్తర కొరియా కనుక ఆరో అణు పరీక్ష జరిపితే అమెరికా నోటి నుంచి యుద్ధ ప్రకటన వెలువడడానికి పెద్ద సమయం పట్టదు. ఎందుకంటే ఐదో అణు పరీక్ష తరువాత అమెరికా విదేశాంగమంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ ‘తమ వ్యూహాత్మక సహన విధానం ఇక ముగిసింది’ అని ప్రకటించారు. కానీ రెక్స్‌ ప్రకటన వెలువడిన వెంటనే ‘సంయమనం’ పాటించవలసిందిగా చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ అమెరికాను కోరినట్టు ఆ దేశ టీవీ చానల్‌ ఒకటి ప్రకటించింది.

 ఉత్తర కొరియా  చైనా మిత్రదేశం. అంతకంటే ముందే, మరో అణు పరీక్ష జరిపితే ఉత్తర కొరియా మీద తీవ్ర స్థాయి శిక్షాత్మక చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా కూడా హెచ్చరించింది. ఇది అమెరికా మిత్రదేశం. తన సైనిక స్థావరాలను ఇప్పుడు అమెరికా దక్షిణ కొరియాలోనే ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంది. ఆ రక్షణ వ్యవస్థ పేరే – టెర్మినల్‌ హై అల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌ (థాడ్‌). సోవియెట్‌ రష్యాతో విభేదాలతో అమెరికా పంచన చేరిన చైనా వైఖరి ఇప్పుడు మారింది. ఎవరి పేరెత్తితే అమెరికా మండిపడిపోతున్నదో సరిగ్గా ఆ ఉత్తర కొరియాకే మద్దతు ఇస్తున్నది.

చైనా, దానితో పాటు రష్యా కూడా అమెరికాకు వ్యతిరేకంగా మారడానికి థాడ్‌ కూడా కారణమే. ఉత్తర కొరియాతో ఘర్షణే అనివార్యమైతే చైనా మీద ఆధారపడే ఉద్దేశం ఇప్పుడు అమెరికాకు పూర్తిగా లేదన్న సంకేతం ట్రంప్‌ ఇచ్చేశారు కూడా. ‘ఉత్తర కొరియా మీద చైనా సాయంతో లేదా స్వతంత్రంగానే అమెరికా చర్యకు దిగుతుంది’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఇందుకు సమాధానంగా, ‘దక్షిణ కొరియాలోని అమెరికా సైనిక స్థావరాలను నాశనం చేస్తా’మని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఇది కూడా ప్రపంచాన్ని భయపెడుతోంది.

కొత్త పరిణామం
చైనా, అప్పటి సోవియెట్‌ రష్యా ఏకం కాకుండా 1970 దశకం నుంచి అమెరికా జాగ్రత్తగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు ఉత్తర కొరియా, సిరియా పరిణామాల నేపథ్యంలో నేటి రష్యా, చైనా కూడా అమెరికాలో ఉమ్మడి శత్రువును చూస్తున్నాయి. సిరియా మీద అమెరికా మరొకసారి దాడికి దిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని రష్యా, ఇరాన్‌ కూడా ప్రకటించాయి. ప్రస్తుతం ఆ రెండు దేశాలు సిరియాకు అనుకూలంగా ఉన్నాయి. దీనికంటే తీవ్రమైన పరిణామం మరొకటి ఉంది. రష్యా, చైనాలు ఎంత దగ్గరయ్యాయంటే, దక్షిణ కొరియాలో అమెరికా నెలకొల్పిన టెర్మినల్‌ హై అల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌ (థాడ్‌)ను తమ తమ ‘రక్షణ ప్రయోజనాల కోసం’ ధ్వంసం చేయాలన్న ఏకాభిప్రాయంతో ఉన్నాయి.

 థాడ్‌ వ్యవస్థను ధ్వంసం చేసే కార్యక్రమానికి రష్యా, చైనా అధికారులు  ఒక ఒప్పందానికి వచ్చారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాయే వెల్లడించింది (జనవరి 13, 2017). థాడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే యోచన నుంచి విరమించుకోవలసిందిగా కూడా రష్యా, చైనా ఒక సంయుక్త ప్రకటనలో అమెరికాకు సూచించాయి. అసలు రష్యా, సిరియాల మీద ఆర్థిక ఆంక్షలు విధించాలని బ్రిటిష్‌ విదేశాంగ కార్యదర్శి బోరిస్‌ జాన్సన్, అమెరికా విదేశాంగమంత్రి జాన్‌ కెరీ (అక్టోబర్‌ 18, 2016) కోరిక వెలిబుచ్చారు.

నిజానికి సిరియా, ఉత్తర కొరియాల పట్ల ట్రంప్‌ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరితో రష్యా, చైనా అమెరికాకు వ్యతిరేకంగా ఏకమవుతాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. ‘సిరియా ఘర్షణ ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. సిరియాలో జరుగుతున్న ఘర్షణ ప్రపంచాన్ని యుద్ధం అంచులకు నెడుతోంది’ అని టర్కీ ఉప ప్రధాని న్యుమన్‌ కుర్తుల్‌మస్‌ కూడా హెచ్చరించారు. టర్కీ అమెరికా మిత్ర దేశం. ఐసిస్‌ మీద జరుపుతున్న గగనతల దాడులలో అమెరికాకు సహకరిస్తున్నది. ఇక్కడ సిరియా మీద అమెరికా దాడిని రష్యా ఖండించిందంటే దానర్థం ఐఎస్‌ఐఎస్‌ను ఆ దేశం సమర్థిస్తున్నట్టు కాదు. మే 31, 2017న రష్యా సేనలు కూడా ఆ ఉగ్రవాద సంస్థ స్థావరాల మీద దాడులు చేశాయి.

తైవాన్‌–చైనా ఘర్షణతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?
అసలు మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందని భావించే విశ్లేషకులు కూడా ఉన్నారు. అందుకు కారణాలు ఇవి: ట్రంప్‌ ఎన్నికైన వెంటనే ‘ఒకే చైనా’ అంశం మీద తాను చర్చలకు ప్రయత్నిస్తానని తైవాన్‌ అధ్యక్షురాలు సా యింగ్‌వాన్‌కు ఫోన్‌లో హామీ ఇవ్వడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. చైనా (మెయిన్‌ ల్యాండ్‌)తో సంబంధాలు కోరుకునే వారు, తైవాన్‌తో సంబంధాలు నెరపరాదు. అంటే తైవాన్‌ను చైనా అంతర్భాగంగా గుర్తించాలి.

 అమెరికా, చైనాల మధ్య చిరకాలంగా అమలవుతున్న ఈ విధానాన్ని ట్రంప్‌ హఠాత్తుగా ఉల్లంఘించారు. తరువాత నష్ట నివారణ చర్యలు ప్రారంభించి, తాము ఏక చైనా విధానానికే కట్టుబడి ఉంటామని చెప్పుకున్నా చైనా వెనక్కి తగ్గలేదు. నిజానికి తైవాన్‌ జలసంధి మీద ఆధిపత్యం ఉంటే తప్ప తన మిత్రదేశాలు దక్షిణ కొరియా, జపాన్‌లను అమెరికా నిలబెట్టుకోలేదు. ట్రంప్‌ అత్యుత్సాహం సంగతి ఎలా ఉన్నా,  తైవాన్‌ జలసంధి మీద సుదూరంలో ఉన్న అమెరికా ఆధిపత్యం సాధ్యం కాదు. కానీ, చైనాతో మాత్రం బంధం తెగి, ఒక బలమైన కొత్త శత్రువును తయారు చేసిపెట్టింది.

 ఏక చైనా విధానం పట్ల చైనాకు చాలా పట్టింపు ఉంది. తైవాన్‌ తన ఆధిపత్యం కిందే ఉండాలని చైనా శాసిస్తున్నది. అందుకు తైవాన్‌ అంగీకరించడం లేదు. ఈ స్థితిలో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌ వంటి ఎనిమిది దేశాలు తైవాన్‌ పనుపున జపాన్‌లో శాంతి చర్చలు ఏర్పాటు చేశాయి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలో  మిత్రపక్షాల నౌకల మీద చైనా మెరుపు దాడి (జూన్‌ 2, 2015)చేసింది. అసలు మూడో ప్రపంచ యుద్ధానికి ఇదే నాందీ వాచకమని నిర్ధారణకు వచ్చిన వారు కూడా లేకపోలేదు. చైనా కూడా తన బలగంలోని ఏకైక ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను తైవాన్‌ జలసంధిలోని వివాదాస్పద ప్రాంతంలోకి ప్రవేశపెట్టింది (జనవరి 12, 2017). తైవాన్‌ కూడా తన బలగాలను మోహరించింది.

యుద్ధం ఎంతటిదని కాదు, ఎన్నేళ్లు జరిగిందని కాదు... ఎన్ని కూటములు సంఘర్షించాయని కాదు, ఎన్ని ఆయుధాలు ప్రయోగించారని కాదు... అదంటూ ప్రారంభమైతే మొదట బలయ్యేది సత్యం. దాని కంటే ముందు ధ్వంసమయ్యేది అంతరాత్మ. ఏ యుద్ధమూ ఏ సమస్యనూ పరిష్కరించలేదు. పరిష్కరించదు కూడా. పాకిస్తాన్, ఉత్తర కొరియాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక్కడ నుంచే అవి ఉగ్రవాదులకు  అందే అవకాశం కూడా ఉందన్న భయాలు ఉన్నాయి.

మొదటి రెండు ప్రపంచ యుద్ధాలకు మించి పొంచి ఉన్న ప్రమాదం ఇప్పుడు ఉగ్రవాదుల దగ్గర కూడా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం అంటూ మొదలైతే మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలకు మించిన విధ్వంసానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలి. అప్పుడు హిరోషిమా, నాగసాకిలే అణుబాంబు బీభత్సాన్ని అనుభవించాయి. ఇప్పుడు ప్రపంచమంతా హిరోషిమా వలెనో, నాగసాకి వలెనో మాడిపోతుంది. మిగిలేదేమీ ఉండదు. చింతించడానికి కూడా ఏమీ మిగలదు భస్మ సింహాసనాలు తప్ప.

ప్రపంచాన్ని అంతం చేయదలుచుకున్నవాడు సుమా!
కిమ్‌ జాంగ్‌ ఉన్‌.... ఉత్తర కొరియా అధ్యక్షుడు. అమెరికాను సాహసంతో లేదా దుస్సాహసంతో ఢీకొంటున్నాడు. నిజానికి అమెరికాను సవాలు చేసే ఒక నాయకుడు భూగోళం మీద అవతరిస్తే ప్రపంచ మేధావులు అతడికి హారతులు పడుతూ ఉంటారు. అలాంటి వీరోచిత చరిత్ర ఫైడల్‌ కాస్ట్రోది. తరువాత సద్దాం హుస్సేన్, కల్నల్‌ గడాఫీలు అమెరికా మీద తిరగబడినప్పుడు ప్రపంచ మేధావులు వారిని ఆకాశానికెత్తారు. కానీ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ విషయంలో ఎవరూ నోరు మెదపడం లేదు. ముఖ్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌ వంటి వివాదాస్పదుడి మీద కాలుదువ్వుతున్నప్పటికీ ఉన్‌కు మీడియా నుంచి, మేధావుల నుంచి  మద్దతు రావడం లేదు.

 ఇందుకు కారణాలు ఉన్నాయి. ఉత్తర కొరియా (డెమోక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా) కమ్యూనిస్టు దేశమని చెప్పుకుంటుంది. నిజానికి అక్కడ సాగుతున్నది ‘కిమ్‌’ వంశ పాలన. వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా వారి రాజకీయ పక్షం. రెండు కొరియాలు రెండో ప్రపంచ యుద్ధ ఫలితాలు. జపాన్‌ అధీనంలో మూడున్నర దశాబ్దాలు మగ్గిన కొరియా, 1945లో రెండుగా చీలింది (ఉత్తర కొరియా, రాజధాని పైన్గాంగ్‌. దక్షిణ కొరియా, రాజధాని సియోల్‌). ఉత్తర కొరియాలో కిమ్‌ జాంగ్‌ సుంగ్‌ మొదట అధికారం చేపట్టడంతో కిమ్‌ వంశ పాలన మొదలైంది. తరువాత ఆయన కుమారుడు కిమ్‌ సొంగ్‌ ఇల్‌ వచ్చాడు. తరువాత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అధికారం చేపట్టాడు. ఏడు దశాబ్దాల ఈ కమ్యూనిస్టు/వంశ పాలనలో ఉత్తర కొరియాకు దక్కింది పేదరికమే.

ఉత్తర కొరియా వాసుల తలసరి ఆదాయం కంటే దాయాది దేశం దక్షిణ కొరియా వాసుల తలసరి ఆదాయం 15 రెట్లు ఎక్కువ. ఉత్తర కొరియాలో ప్రత్యర్థుల అణచివేత, హక్కుల ఉల్లంఘన, శిక్షలు చాలా ఎక్కువ. అక్కడ ‘మూడు తరాల శిక్ష’ అమలవుతోంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే, అతని తరువాత రెండు తరాల వారు కూడా శిక్ష అనుభవించాలి. ఐక్యరాజ్య సమితి దర్యాప్తు సంస్థ ఈ వాస్తవాలను వెల్లడించింది. డిసెంబర్‌ 10, 2015న సమితి భద్రతామండలి ఈ అంశాలను చర్చించింది. అక్కడ 80,000 నుంచి, 1,20,000 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు. ఎందరో సైనికాధికారుల ఆచూకీ తెలియడం లేదు.

ఉత్తర కొరియా వెళ్లిన తమ దేశవాసులు పదిమంది వరకు కనిపించకుండా పోయారని జపాన్‌ ఫిర్యాదు చేసింది. నిజానికి మొన్న ఫిబ్రవరిలో క్షిపణి పరీక్ష జరిగిన తరువాత మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో కిమ్‌ జాంగ్‌ నమ్‌ అనే వ్యక్తిని కొందరు హత్య చేశారు. అతడు ఉన్‌కు స్వయంగా అన్నగారే. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో అణు పరీక్ష దరిమిలా డొనాల్డ్‌ ట్రంప్‌ వరస హెచ్చరికలు ఇస్తున్నప్పుడే ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూరెర్ట్‌ అమెరికా దూకుడును ఉద్దేశించి సందర్భోచితమైన ప్రకటన చేశారని అనిపిస్తుంది. డ్యూరెర్ట్‌ ‘ఏసియన్‌’ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) అధ్యక్షుడు కూడా.

 కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మీద ఒక అంచనాకు రావడానికి ఆ ప్రకటన గొప్పగా ఉపకరిస్తుంది. ‘‘ఈ ప్రపంచం అంతాన్ని చూడాలని అనుకుంటున్న కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో ఆచితూచి వ్యవహరించవలసింది. సంయమనం పాటించవలసింది.’’ కానీ, ఎంత గట్టిగా రణ గర్జనలు చేస్తున్నప్పటికీ ఉన్‌ నిజంగా యుద్ధానికి దిగుతాడా అని చాలామందికి అనుమానం ఉంది. అమెరికాతో ఒక వేళ యుద్ధమే జరిగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తన గెలుపు మీద ఉన్‌కి కూడా అనుమానాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా తన వంశ పాలన అంతం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది ఉన్‌కు సమ్మతం కాదు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేసుకోండి. రష్యా, ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ సామ్రాజ్యాలు పేక ముక్కల్లా కూలిపోయాయి. సానుకూలం కావచ్చు, ప్రతికూలమైనది కావచ్చు– యుద్ధంతో మార్పు రావడం తథ్యం.

మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు?
ఆస్ట్రియా–హంగేరీ అధీనంలో ఉన్న సెర్బుల భూభాగాలు బోస్నియా, హెరిజిగోవినా. బోస్నియా రాజధాని సరాయేవోలోనే ఆస్ట్రియా–హంగేరీ యువరాజు ఫెర్డినాండ్, యువరాణి సోఫీ చోటెక్‌ల జంట హత్యలు జరిగాయి. జూన్‌ 28, 1914న సెర్బు జాతీయవాది గవ్‌రిలో ప్రిన్సిప్‌ వారిని కాల్చి చంపాడు.  చూడబోతే ఇది రెండు దేశాల ద్వైపాక్షిక సమస్యలా ఉంటుంది. దానికే ప్రపంచ దేశాలన్నీ యుద్ధానికి కాలు దువ్వాలా? అంత సైన్యాన్ని, మందుగుండును నష్టపోవాలా? నిజానికి ఆ జంట హత్యలు మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్‌వార్‌కు తక్షణ కారణమే. 1890 దశాబ్దం నుంచే ఇలాంటి ఒక మహా యుద్ధానికి రంగం సిద్ధమయిన మాట వాస్తవం.

సెర్బియా (రాజధాని బెల్‌గ్రేడ్‌) దేశాన్ని కేంద్రంగా చేసుకుని ఆస్ట్రియా–హంగేరీ అధీనంలోని భూభాగాలలో ఉన్న మిగిలిన సెర్బులు విశాల సెర్బియా కోసం పోరాడుతున్నారు. వీరే ఐరోపా దక్షిణాది స్లావ్‌లు. అందుకే రష్యా వీరికి మద్దతుగా ఉంది. విశాల సెర్బియా ఆశయానికి అడ్డురాకుండానే ఫెర్డినాండ్‌ను హత్యచేయాలని సెర్బు జాతీయవాదులు పథకం వేసుకున్నారు. అందుకు ఎంచుకున్న చోటే సరాయేవో. అక్కడ సైనిక శిబిరాల పర్యవేక్షణకు ఫెర్డినాండ్‌ వచ్చినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. నిజానికి ఫెర్డినాండ్‌ ఆస్ట్రియా యువరాజు. అసలు రాజు ఫ్రాంజ్‌ జోసెఫ్‌. అతడు అవసాన దశలో ఉన్నాడు. జోసెఫ్‌ ఏకైక కుమారుడు రుడాల్ఫ్‌ 1889లోనే ఆస్ట్రియా రాజ్యంలోని మేరిలింగ్‌ అటవీ అతిథి గృహంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.

 ప్రభు వర్గంలోని ఒక మహిళతో ఉండగా ఆ ఇద్దరినీ కూడా ఎవరో హత్య చేశారు. జోసెఫ్‌ భార్య ఎలిజబెత్‌. 1898లో జెనీవా పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె నివశించిన హోటల్‌ ముందే ఒక ఉగ్రవాది హత్య చేశాడు. కాబట్టి ఫెర్డినాండ్‌ను కూడా అడ్డం లేకుండా చూసుకోవాలని సెర్బు జాతీయవాదులు పథకం వేశారు. ఆ విధంగా అది ద్వైపాక్షిక సమస్యే. కానీ వెనువెంటనే ప్రపంచ దేశాలను యుద్ధం వైపు నడిపించే పరిణామాలకు కారణమైంది. సరాయేవో హత్యల దరిమిలా జూలై 6న జర్మనీ ఆస్ట్రియా– హంగేరీ రాజ్యానికి తన సంపూర్ణ మద్దతు పలికింది. ఈ పరిణామానికే చరిత్రలో ‘బ్లాంక్‌ చెక్‌’ అని పేరు. అప్పటిదాకా ఊగిసలాడుతున్న ముసలి చక్రవర్తి జోసెఫ్‌ జూలై 28న సెర్బియాపై యుద్ధం ప్రకటించాడు. 29, 30 తేదీలలో బెల్‌గ్రేడ్‌ మీద బాంబుల వర్షం కురిపించాడు.

రష్యా సెర్బియాకు మద్దతుగా వచ్చింది. రష్యాను ఇందుకు ప్రోత్సహించినది ఫ్రాన్స్‌ అని చెబుతారు. అయితే రష్యా తన నిర్ణయం మార్చుకోవాలని జర్మనీ సూచించింది. రష్యా పట్టించుకోలేదు. 30వ తేదీ బాంబు దాడి తరువాత ఆస్ట్రియా మీద యుద్ధ ప్రకటన చేసింది కూడా. అంటే జర్మనీ మీద యుద్ధమే. ఆగస్ట్‌ 1న జర్మనీ రష్యా మీద యుద్ధ ప్రకటన చేసింది. రష్యాను పురికొలిపినది ఫ్రాన్స్‌ కనుక ముందు ఆ దేశాన్ని మొదట కబళించాలని జర్మనీ నియంత విల్‌హెల్మ్‌ సైన్యాన్ని కదిలించాడు. నిజానికి జర్మనీకి అపారమైన యుద్ధ భయం ఉంది. అందుకు కారణం– 1893లో రష్యా, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన ఒప్పందం. దీనికి ప్రతీకారంగా జర్మనీ ష్లిఫెన్‌ పథకాన్ని తయారు చేసుకుని సిద్ధంగా ఉంది. దాని ప్రకారం తనకు వ్యతిరేకంగా ఒప్పందం కుదుర్చుకున్న రష్యా, ఫ్రాన్స్‌ల మీద ఏకకాలంలో దాడి చేయాలి.

ఈ క్రమంలోనే జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల మధ్య బఫర్‌ స్టేట్‌లా ఉన్న బెల్జియంను జర్మనీయే సర్వనాశనం చేసింది. ఒక తటస్థ రాజ్యం మీద దాడికి దిగినందుకు ఆగ్రహిస్తూ బ్రిటన్‌ ఆగస్ట్‌ 4న యుద్ధంలోకి దిగింది. బ్రిటన్,ఫ్రాన్స్, రష్యా, సెర్బియా, బెల్జియం, ఇటలీ, జపాన్, అమెరికా (ఆలస్యంగా 1917లో దిగింది), గ్రీస్, రుమేనియా మరికొన్ని దేశాలు ఒక శిబిరంలో ఉండి పోరాడాయి. వీటినే మిత్రరాజ్యాలంటారు. ఒక్కడ ఒక చారిత్రక వైచిత్రిని గుర్తు చేసుకోవాలి. జర్మనీ నియంత విల్‌హెల్మ్, రష్యా జార్‌ నికోలస్, ఇంగ్లండ్‌ ప్రధాని ఐదో జార్జి – ముగ్గురూ విక్టోరియా మహారాణి మనుమలే. వరసకి సోదరులే. జర్మనీ, ఆస్ట్రియా–హంగేరీ, టర్కీ, బల్గేరియా మరొక శిబిరంగా ఏర్పడినాయి. వీటిని అక్ష రాజ్యాలంటారు. కొన్ని లక్షల ప్రాణాలను బలితీసుకుని, ఐరోపాను మరుభూమిగా మార్చిన తరువాత వెర్సయిల్స్‌(ఫ్రాన్స్‌) సంధితో నవంబర్‌ 11, 1918న మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది.

రెండో ప్రపంచ యుద్ధం అందుకే!
మొదటి ప్రపంచ యుద్ధం, తరువాత జరిగిన వెర్సయిల్స్‌ శాంతి సంధి రెండో ప్రపంచ యుద్ధానికి బీజాలు సిద్ధం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆరంభించిన దేశాలే రెండో ప్రపంచ యుద్ధాన్ని కూడా ఆరంభించాయి. నాజీ జర్మనీ 1939 సెప్టెంబర్‌లో పోలెండ్‌ కారిడార్‌ మీద దురాక్రమణకు దిగింది. బ్రిటన్, ఫ్రాన్స్‌  దీనికి ఆగ్రహించి జర్మనీ మీద యుద్ధం ప్రకటించాయి. ఇదే రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. కానీ వెనుక వందల కారణాలు ఉన్నాయి. వెర్సయిల్స్‌ సంధితో జర్మనీ తీవ్ర అసంతృప్తికి లోనయింది. ఆల్సెస్, లోరెన్‌ అనే ప్రాంతాలు ఫ్రాన్స్‌ దక్కించుకుని అక్కడి ఖనిజ సంపదను తవ్వుకు పోవడం ఆరంభించింది.  యుద్ధానికి నష్టపరిహారమన్నమాట. అలాగే అక్కడి అడవులు, ఇతర వనరులు కొన్ని దేశాలకు దఖలు పడ్డాయి. దీనితో చెలరేగిన తీవ్ర అసంతృప్తి నుంచి జనించినదే నేషనల్‌ సోషలిస్టు పార్టీ. అదే నాజీగా ప్రసిద్ధి చెందింది. దీని నాయకుడే అడాల్ఫ్‌ హిట్లర్‌.

జర్మనీ దుస్థితికి యూదులు, అప్పులు కారణమని ప్రచారం ప్రారంభించాడతడు. దురాక్రమణ అతడి విధానం. జర్మనీ చుట్టూ దేశాలను ఆక్రమించడం మొదలుపెట్టాడు. అందులో చెకొస్లొవాకియా ఒకటి. ఇది మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా ఏర్పడినది. 1938లో హిట్లర్‌ దీనిని చుట్టముట్టాడు. పశ్చిమాన ఉన్న సూడెట్‌ల్యాండ్‌ అతడి లక్ష్యం. ఇక్కడ జర్మన్లు ఎక్కువగా ఉన్నారు. దురాక్రమణకు అతడు చూపిన కారణం కూడా అదే. హిట్లర్‌ దూకుడు ప్రపంచాన్ని అప్పటికే హడలెత్తిస్తోంది. ఇక్కడే బ్రిటన్‌ జర్మనీతో చిత్రమైన ఒప్పందం చేసుకుంది. ఇది హిట్లర్‌ లాంటి వాణ్ణి బుజ్జగించడానికి చేసిన వృధా ప్రయత్నం. సూడెట్‌ల్యాండ్‌ తరువాత ఇక దురాక్రమణ విధానానికి స్వస్తి చెబుతానని హిట్లర్‌ ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత బ్రిటన్‌ అందుకు అనుమతించింది.

1938లో హిట్లర్‌ సూడెట్‌ల్యాండ్‌ను ఆక్రమించాడు. సంతకం తడి ఆరకుండానే ఉల్లంఘించడం హిట్లర్‌ లక్షణం. మరుసటి సంవత్సరమే పోలెండ్‌ కారిడార్‌ను ఆక్రమించాడు. ఇక్కడ కూడా జర్మన్లు ఎక్కువే. సోవియెట్‌ రష్యా కూడా హిట్లర్‌ను బుజ్జగించే యత్నం చేసింది. రష్యా మీద జర్మనీ, జర్మనీ మీద రష్యా పరస్పరం దాడి చేసుకోకూడదంటూ ఆగస్ట్‌ 24, 1939లో జర్మనీ విదేశాంగ మంత్రి వాన్‌ రిబెన్‌ట్రాప్‌కీ, స్టాలిన్‌కీ మధ్య ఒప్పందం జరిగింది. నిజానికి ఈ ఒప్పందంలోనే లోపాయికారి అవగాహన కూడా ఉందన్న విమర్శ ఉంది. పోలెండ్‌ను తమ రెండు దేశాలు పంచుకోవాలన్నదే ఆ రహస్య అవగాహన (1920 నుంచి పోలెండ్‌ మీద సోవియెట్‌ రష్యాకు కూడా కన్ను ఉంది).

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, సోవియెట్‌ రష్యా, పోలెండ్‌ వంటి 23 దేశాలు మిత్ర రాజ్యాల పేరుతో ఒక శిబిరంగా ఏర్పడినాయి.అక్ష రాజ్యాల కూటమిలో జర్మనీ, ఇటలీ, జపాన్, బల్గేరియా, రుమేనియా వంటి 27 దేశాలు చేరాయి. 1939లో ఆరంభమైన రెండో ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది.

ఇన్ని నిప్పురవ్వల మధ్య.....
వర్తమాన ప్రపంచంలో సంఘర్షణలతో సతమతమవుతున్న దేశాల సంఖ్య తక్కువేమీ కాదు. ఒక సర్వే ప్రకారం 67 దేశాలు అశాంతితో, రక్తపాతంతో విలవిలలాడుతున్నాయి. ఇరుగుపొరుగుతో పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్న దేశాలు, అంతర్యుద్ధాలతో నెత్తురోడుతున్న దేశాలు, వేర్పాటువాదుల హింసతో కునారిల్లుతున్న దేశాలు ఇందులో ఉన్నాయి. ఆయా దేశాలతో పోరాడుతున్న గెరిల్లా సంఘాలు, వేర్పాటువాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు, మతోన్మాద సంస్థలు 761 వరకు ఉంటాయని అంచనా. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్, కాంగో, ఈజిప్ట్, లిబియా, మాలి, మొజాంబిక్, నైజీరియా, సోమాలియా, సూడాన్, అఫ్ఘానిస్తాన్, భారత్, మైన్మార్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, చెచెన్యా, దాగెస్తాన్, ఉక్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, సిరియా, యెమెన్, కొలంబియా, మెక్సికో, తజకిస్తాన్, సియెర్రాలియోన్, పెరూలియా, మెడగాస్కర్‌... ఇంకా ఎన్నో దేశాలు ఏదో ఒక తరహా యుద్ధంలో తలమునకలై ఉన్నాయి.

 వీటిలో కొన్ని చోట్ల 1950ల యుద్ధం నుంచి జరుగుతోంది. ఇందులో ప్రపంచాన్ని ప్రధానంగా ఆకర్షిస్తున్న యుద్ధం అఫ్ఘానిస్తా¯Œ  యుద్ధం. సెప్టెంబర్‌ 11, 2001 డబ్లు్యటీవో టవర్ల మీద దాడి తరువాత అమెరికా అక్టోబర్‌ 7, 2001న ఆరంభించింది. పైన చెప్పుకున్న దేశాలలో జరుగుతున్న  ఘర్షణలు, యుద్ధాల గురించి మిగిలిన ప్రపంచానికి చాలావరకు ఎరుక లేదు. నిజమే కానీ, ఒకటి మాత్రం చారిత్రక వాస్తవం. 1900 ప్రాంతంలో సెర్బియా కేంద్రంగా ఒక ఉగ్రవాద సంస్థ పనిచేసేది. పేరు బ్లాక్‌హ్యాండ్‌. దాని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం బ్లాక్‌హ్యాండ్‌ చర్యే. ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీ చోటెక్‌ సరాయేవో పర్యటించడానికి వచ్చినప్పుడు (జూన్‌æ 28, 1914) కాల్పులు జరిపి హత్య చేసిన గవ్‌రిలో ప్రిన్సిప్‌ బ్లాక్‌హ్యాండ్‌ సభ్యుడే. ఏ దేశంలో ఏ నిప్పురవ్వ మరో మహాయుద్ధానికి ప్రపంచాన్ని సిద్ధం చేయబోతున్నదో!

భారత్‌ ఏం చేయాలి?
ఇంతవరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలలో కూడా భారత్‌ పాల్గొనవలసి వచ్చింది. అప్పుడు మనదేశం బ్రిటిష్‌ వలస. ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ప్రపంచ యుద్ధమే అనివార్యమైతే  ఏ విధంగా చూసినా భారత్‌ కీలక నిర్ణయం తీసుకోక తప్పదు. పాకిస్తాన్, చైనా అలాంటి యుద్ధానికి దూరంగా ఉండలేవు. ఆ రెండు దేశాలకు తొలి శత్రువు భారత్‌. పైగా ఇటీవల సబ్‌మెరైన్‌ క్రూయిజ్‌ మిసైల్‌ను పాకిస్తాన్‌ విజయవంతంగా ప్రయోగించింది. ఇది అణ్వాయుధాలను తీసుకుని లక్ష్యాన్ని చేరగలుగుతుంది. ఇస్లామిక్‌ తీవ్రవాదం ఆ యుద్ధంలో కీలక అంశంగా ఉంటుంది. అప్పుడైనా దానితో పోరాడుతున్న భారత్‌ అనిష్టంగా అయినా రంగ ప్రవేశం చేయక తప్పకపోవచ్చు.
 
– డా. గోపరాజు నారాయణరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement