అభిప్రాయం
ప్రాజెక్టులు కట్టడం, కాళేశ్వరాన్ని నిర్మించడం, కాలువలు, బావులు, చెరువులు తొవ్వించే పని కేసీఆర్ తనకు తానే విధించుకున్న అతిపెద్ద సవాల్. దేశంలో ఎక్కడా జరగనన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నేరుగా పాలనా పగ్గాలు చేపట్టిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలే ఎజెండాగా తమ పరిపాలనా రంగాన్ని రూపొందించుకున్నారు. ఉద్యమ ఉత్తేజంతో పాలనారంగాన్ని కూడా సంస్కరించుకుంటూ అనేక కొత్త పథకాలకు రూపకల్పన చేసి మున్నెన్నడూ లేని విధంగా ఆచరణాత్మకంగా ఫలితాలను కూడా ప్రజల ముంగిటికి తీసుకువస్తున్నారు. అది ఇంటింటికి నల్లా నీళ్లు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తవ్వించడం, ప్రాజెక్టుల నిర్మాణాల వంటి భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నాలుగేళ్ల పాలనలోనే తెలంగాణ భీడుభూములపై నీళ్లను ప్రవహింపచేస్తున్నారు. ఇది ప్రభుత్వమే ఒక మిషన్‌గా మారి చేస్తున్న భగీరథ యత్నం.
తెలంగాణ సమాజంలో ఎత్తుపల్లాలున్నాయి. 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారు. ఈ వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క అడు గుపైకి వేసుకుంటూ ముందుకుసాగాలి. అందుకు ప్రధాన సాధనంగా విద్యా, వైద్య రంగాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పేద పిల్లలందరికీ ఉచితంగా నాణ్యమైన చదువందాలి. కార్పొరేట్‌ను తలదన్నే చదువును పేదలవాకిళ్లకాడికి కేసీఆర్ తీసుకొచ్చారు. 815 గురుకులాలు పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. కేజీ నుంచి పిజీ పిల్లలకు ఉచిత చదువును అందించేందుకు శ్రమిస్తున్నారు. అంగన్‌వాడీ స్కూళ్ల దగ్గర్నుంచి వాళ్లపై ఒక్కపైసా పడకుండా బహుజన పిల్లల్ని చదివిస్తున్నారు.
‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’’ అన్న స్థితి నుంచి ఇప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ కిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు పెంచడం వల్ల పేదప్రజలకు వైద్యం సులభంగా అందే దశకు చేరుకుంటున్నారు. ప్రజలకు అనేక రకాల ఆదాయపరి మితి పెంపుకు సంబంధించిన పనులను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆసరా పెన్షన్లు, ఇంటింటికి ఆరుకిలోల బియ్యం, మున్సిపాల్టీల్లో రూపాయికే నల్లా కనెక్షన్, బీడీ కార్మికుల భృతి, సింగరేణి, ఆర్టీసి ఉద్యోగుల జీతాలను పెంచడం, టెంపర్‌వరీగా పనిచేస్తున్న ఉద్యోగులకు మంచిస్కేల్స్ ఇవ్వడం ఇవన్నీ సంక్షేమంలో భాగంగానే చేస్తున్నారు.
రైతు బజారులు, సద్దిమూట పథకం, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు సమన్వయ సమితిని ఏర్పరచటం, భూరికార్డుల ప్రక్షాళన, సమన్వయ సమితుల ఏర్పాటు సంచార పశువైద్యశాలలు ఇవన్నీ సంక్షేమ రాజ్యం లక్షణాలు. అంగన్‌వాడీ జీతాలు 150 శాతం పెంచారు. ఆశా వర్కర్ల జీతాలు రూ.6,000 వరకు పెంచారు. అమ్మఒడి ప«థకం, ఒంటరి మహిళలకు రూ.1,000ల భృతి ఇవన్నీ సంక్షేమ పధకాలుగా ప్రజల దగ్గరకు వెళ్లాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు వేలకోట్లతో సంక్షేమ పథకాలను రూపొందించారు. బీసీ కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎంబీసీ కార్పొరేషన్‌లను ప్రకటించి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ రోజు లక్షల మంది ప్రభుత్వ పెన్షన్ల ద్వారా సహాయం పొందుతున్నారు. కోఆపరేటివ్ మోడల్‌లో చిన్న, మధ్య తరగతి వర్గాలకు సాయం అందజేసే పని మొదలైంది. ప్రధానంగా చేతివృత్తులవారు, సంచారజాతుల వారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు చేతి వృత్తుల ద్వారా లేదా ఆధునిక వృత్తుల ద్వారా ఉత్పత్తులు చేస్తే ఆ ఉత్పత్తుల అమ్మకానికి ప్రభుత్వమే ముందుకు రావ డం విశేషం.
తెలంగాణలో ప్రభుత్వ రంగం ద్వారా విద్యా, వైద్యరంగాల్లో సేవలు అందించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని జాగ్రత్తగా నిర్వహిస్తే అది ధనికులకు పేదలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే చర్యే అవుతుంది. గురుకులాలపై ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థిపై లక్ష రూపాయల ఖర్చు చేస్తున్నారు. వృద్ధులకు ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు. ప్రాజెక్టులు కట్టడం, కాళేశ్వరాన్ని నిర్మిం చడం, కాలువలు, బావులు, చెరువులు తొవ్వించే పని కేసీఆర్ తనకు తానే విసురుకున్న అతిపెద్ద సవాల్. దాన్ని కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంపూర్ణంగా గెలవబోతుంది. 60 ఏళ్లలో ఎవరూ చేయలేని పనిని టీఆర్‌ఎస్ చేసి కొత్త చరిత్రను రచించుకుంటూ ముందుకు సాగుతుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను పూర్తి చేయబోతుంది.
ఉద్యోగుల చర్చల్లో జీతాలు పెంచమని కోరితే, వాళ్లడిగిన దానికంటే రెండు రెట్లు అధిక జీతాన్ని కేసీఆర్ ప్రకటించారు. కార్పొరేట్ వ్యవస్థకు ఇవ్వాల్సిన రాయితీలను తగ్గించుకుని ఆ నిధులను రైతాంగానికి అందజేసే క్రియాశీలకమైన పనికి కేసీఆర్ నడుంకట్టారు. ఆదాయ వనరులను పెంచింది. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏ కోణం నుంచి చూసినా అది సంక్షేమ రాజ్యంగా ముందుకుసాగుతుంది. కేసీఆర్ దార్శనికతతో పునర్నిర్మాణ పనికి పూనుకోవడమే సంక్షేమ రాజ్యం ఏర్పడటానికి కారణం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించిన విజయాలు తెలం గాణ భవిష్యత్‌ను మరింత తేజోవంతంగా చేయడానికి పునాదులు వేసినట్లయింది.
- జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు
మొబైల్ : 94401 69896
Comments
Please login to add a commentAdd a comment