శత వసంతాల విప్లవ శకం | AP. Vithal writes on centenary of revolutionary era | Sakshi
Sakshi News home page

శత వసంతాల విప్లవ శకం

Published Tue, Nov 7 2017 2:12 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

AP. Vithal writes on centenary of revolutionary era

అక్టోబర్‌ విప్లవ శత వార్షికోత్సవం

బుద్ధుని నుంచి అంబేడ్కర్‌ వరకు మన దేశ ప్రగతిశీల వారసత్వాన్ని స్వీకరించి, మార్క్సి జంతో సమ్మిళితం చేయాలి. అప్పుడే దేశ, కాల పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అన్వయించడమనే అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తిని గ్రహించినట్టు లెక్క. అత్యంత అణగారిన ప్రజలైన దళితులు, గిరిజనులు, బాగా వెనుకబడిన కులాలు, మైనారిటీలు, మహిళలు తమ సమస్యలపై జరిపే పోరాటాల్లోనే కాదు, సోషలిస్టు పోరాటంలో కూడా ముందు నిలవాలి. అప్పుడే భారతావనిలో ‘అక్టోబర్‌’ విప్లవం పొద్దు పొడుస్తుంది.

నవంబర్‌ ఏడు, సామ్యవాద విప్లవాల నూతన శకానికి నాంది పలికిన అక్టోబర్‌ విప్లవ దినోత్సవం. ఎన్నో ఆటుపోట్లను, గెలుపుఓటములను, ఎదురు దాడులను తట్టుకుంటూ ఆ మహత్తర శ్రామిక వర్గ విప్లవ పతాక నిలిచింది. ఆ చారిత్రక విప్లవ శత వార్షిక సంవత్సరం సామ్యవాద ఉద్యమ, విప్లవ పరామర్శకు సముచిత సందర్భం. ‘ప్రతి మనిషీ ఆత్మ గౌరవంతో జీవిస్తూ మరోవ్యక్తి దోపిడీకి గురికాకుండా స్వచ్ఛందగా, చైతన్యయు తంగా, తన శక్తిని బట్టి శ్రమ చేస్తూ, తన జీవితావసరాలను తీర్చుకోగల నూతన కమ్యూనిస్టు వ్యవస్థ’ అక్టోబర్‌ విప్లవానికి ముందు వరకు సిద్ధాం తమే. ఆ విప్లవంతోనే అది ఆచరణలో రూపుదిద్దుకునే క్రమం మొదలైంది, ప్రపంచ శ్రమజీవుల కలల పంట సోషలిస్టు వ్యవస్థ ఆవిర్భవించి ప్రపంచా నికి ఆదర్శమై నిలిచింది. అక్టోబర్‌ విప్లవంతో మొదలైన విప్లవ శకంలో భాగంగానే చైనా, వియత్నాం, క్యూబా, తూర్పు యూరప్‌ దేశాలలో సోష లిస్టు విప్లవాలు విజయవంతమయ్యాయి. మార్క్స్, ఏంగెల్స్‌లు రూపొం దించిన మార్క్సిజం ఈ క్రమంలో లెనిన్, మావో, హోచిమిన్, క్యాస్ట్రో వంటి మహనీయుల విప్లవ, సైద్ధాంతిక కృషితో సుసంపన్నమైంది. మార్క్సిజం కార్మికవర్గ శాస్త్రీయ విప్లవ సిద్ధాంతమే కాదు, మహత్తర మానవీయత సాధన దిశగా చేపట్టిన బృహత్‌ సంకల్పం. ప్రపంచ దేశాలు తమ తమ దేశాల్లోని విభిన్న పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకునే సాధారణ విప్లవాచరణ గానే మార్క్స్, ఏంగెల్స్‌లు 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను తయారు చేశారు. పలువురు విమర్శకులు తెలిసీ, తెలియకా ఈ విషయాన్ని విస్మరి స్తున్నారు. మార్క్స్‌ అంచనావేసినట్టు సోషలిస్టు విప్లవం మొదట అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో గాక వెనుకబడిన రష్యాలో విప్లవం విజయ వంతంగా కావడమే మార్క్సిజం తప్పని లేక అక్టోబర్‌ విప్లవమే తప్పని తేల్చే రకరకాల కుతర్కాలు నాటి నుంచి నేటి వరకు çపుట్టుకొస్తూనే ఉన్నాయి.

సృజనాత్మక విప్లవాల ప్రయోగశాల
కానీ, లెనిన్‌ 1917 నాటి నిర్దిష్ట పరిస్థితుల్లో వెనుకబడిన రష్యాలో విప్లవానికి పరిస్థితులు అత్యంత అనువుగా ఉన్నాయని గ్రహించి, ముందడుగు వేశారు. ఆ క్రమంలో ఆయన ప్రపంచ శ్రామికవర్గ పార్టీలకు ఆయా దేశాల ప్రత్యేక భౌతిక పరిస్థితులకు మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అన్వయించుకోవడమే ఆ విప్లవ సిద్ధాంతపు నిజ సారంగా చాటారు. అలాంటి సృజనాత్మక అన్వయానికి  అక్టోబర్‌ విప్లవం ప్రయోగశాల అయింది. జారు చక్రవర్తుల పాలనలోని భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. ఆ వ్యవస్థ ప్రతీకలైన జమీందారుల (కులక్కులు) చేతుల్లో రైతాంగం తదితర విశాల ప్రజానీకం క్రూర దోపిడీ, అణచివేతలకు గురవుతూ ఆసహనంతో రగిలిపోతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో లెనిన్‌ కార్మిక సైద్ధాంతిక నాయకత్వమే గాక, వారి ప్రత్యక్ష నాయకత్వంలో రైతాంగ గ్రామీణ పేదలు తదితర పీడిత ప్రజలను ప్రధాన శక్తులుగా విప్ల వంలోకి సమీకరించి విజయం సాధించారు. ఆయన చేసిన సృజనాత్మకమైన అన్వయంతో కూడిన ఆచరణ తోడై మార్క్సిజం–లెనినిజం కమ్యూనిస్టుల సిద్ధాంతంగా రూపుదాల్చింది. తదనుగుణంగానే రష్యన్‌ సోషలిస్టు ప్రభుత్వం జారీ చేసిన తొలి శాసనమే ‘ఓ తల్లీ భూదేవీ! ఇన్నాళ్లూ తన స్వేదంతో నిన్ను పుష్పింపజేసి, ఫలింపజేసి నీకు సార్థకత చేకూర్చిన నీ ప్రియతమ రైతుకు చెంద కుండా జమిందారులు, భూస్వాముల చేతుల్లో బందీగా ఉన్నావు. నేటి నుంచి వారి చెర నుంచి విముక్తమైన నీ ప్రియతమ రైతు సమాగమంలో సంతో షంగా పులకించమ’ని తెచ్చిన దున్నేవానికి భూమి చట్టం. జారుల పాలన లోని రష్యా జాతుల బందిఖానగా ఉండేది. విప్లవానికి ముందు వాగ్దానం చేసినట్టే సోషలిస్టు ప్రభుత్వం జాతులకు విముక్తిని కల్పించి, సోవి యట్‌ రష్యాలో ఐచ్ఛిక భాగస్వాములను చేసుకుంది.

‘అక్టోబర్‌’ బాటలో సోషలిస్టు విప్లవాల వెల్లువ
చైనా విప్లవం కూడా మార్క్సిస్టు సిద్ధాంత స్ఫూర్తితోనే తమ దేశంలో సోషలిస్టు విప్లవానికి దారితీసే తొలిమెట్టుగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని మావో సారధ్యంలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ విజయవంతం చేసింది. ప్రధానంగా చాంగ్‌ కై షేక్‌ పాలకుడుగా భూస్వామ్య ప్రభుత్వాల పాలనలో మగ్గిపోతున్న ౖచైనా రైతాంగ, తదితర పేదల దయనీయ పరిస్థితిని, అప్పటి భూస్వామ్య వ్యవస్థను భౌతిక వాస్తవికవాద దృక్పథంతో విశ్లేషించి, మార్క్సిజం–లెనిని జాన్ని తన దేశానికి అన్వయించగలిగారు. విముక్తి సైన్యం సహాయంతో గెరిల్లా పోరాటాలతో చిన్న, పెద్ద విముక్తి ప్రాంతాలను సృష్టించుకున్నారు. వాటిని శత్రువు స్వాధీనం చేసుకున్నా వెనుకంజ వేయలేదు. ఉత్తర సరిహద్దు ప్రాంతంలోని యెనాన్‌ రాష్ట్రం వరకు లాంగ్‌మార్చ్‌గా సుప్రసిద్ధమైన సుదీర్ఘ పోరాటాన్ని విముక్తి సైన్యం సాగించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ తమ దేశ ప్రత్యేకతలకు అనుగుణంగా దీర్ఘకాలిక  గెరిల్లా పోరాటం ద్వారా అక్కడ సోష లిస్టు వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలికింది.

అమెరికన్, ఫ్రెంచ్‌ వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన వియత్నాం జాతీయ విముక్తి ఉద్యమానికి, సోవియట్‌ యూనియన్, చైనాల స్ఫూర్తితో హోచిమిన్‌ నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలోని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ  మార్క్సిజాన్ని సృజనాత్మకంగా తమ విముక్తి పోరాటానికి అన్వయించింది. జాతీయ విముక్తి పోరాటాన్ని, మార్క్సిస్టు విప్లవ పోరా టాన్ని అత్యుత్తమంగా మేళవించగలిగింది. నాటి నిర్దిష్ట అంతర్జాతీయ పరిస్థి తులకు తగ్గట్టుగా గెరిల్లా పోరాటాన్ని, చర్చలు సంప్రదింపులను జోడించి మొదట ఉత్తర ప్రాంతంలో సోషలిస్టు వ్యవస్థకు పునాది వేసి, ఆ పిమ్మట దక్షిణ వియత్నాంను విముక్తం చేయగలిగారు. ఇక లాటిన్‌ అమెరికాలోని క్యూబాలో, సామ్రాజ్యవాద ఏజంటు,  అమెరికా బంటు బాటిస్టా కీలుబొమ్మ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ద్వారా ఫిడెల్‌ క్యాస్ట్రో నాయకత్వాన అక్కడి విప్ల వానికి నాందీ ప్రస్తావన జరిగింది. విజయానంతరంగానీ, తమది మార్క్సిస్టు సిద్ధాంత ప్రాతిపదికపై, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన జరిగిన సోషలిస్టు విప్లవమని క్యాస్ట్రో ప్రకటించలేదు. లాటిన్‌ అమెరికా ప్రజల ఆరాధ్య నాయ కుడు జోస్‌ మార్తె ప్రభావం క్యాస్ట్రోపై స్పష్టంగా కనిపించేది. ఆయనను తరచూ ఉల్లేఖిస్తుండేవారు. క్యూబా విప్లవంపై లాటిన్‌ అమెరికన్‌ ముద్ర విస్ప ష్టంగా కనిపిస్తుంటుంది. వియత్నాం, క్యూబా విప్లవాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి యువతరంపై గొప్ప, సానుకూల విప్లవ ప్రభావ్ని చూపాయి.

ఈ ప్రపంచ సోషలిస్టు విప్లవ సంక్షిప్త వర్ణన విస్పష్టంగా ఆవిష్కరించే తిరుగులేని వాస్తవం ఒక్కటే. మార్క్సిస్టు సిద్ధాంతం ఎన్నడూ విప్లవాన్ని ఒక మూసలో సాగేదిగా చూడలేదు, లెనిన్‌ మొదలుగా విజయవంతంగా విప్లవా లకు నేతృత్వం వహించిన  నేతలంతా తమ దేశ నిర్దిష్ట పరిస్థితులను, ప్రత్యే కతలను సమగ్రంగా శాస్త్రీయంగా అర్థం చేసుకుని మార్క్సిజాన్ని సృజనా త్మకంగా అన్వయించి, ఆచరణకు దిగినవారే. అలాంటి కృషి పట్ల మన దేశం లోని కమ్యూనిస్టు పార్టీలు, నేతలు ఎంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు, ఇస్తున్నారు అనేదే అసలు ప్రశ్న. ‘‘మార్స్స్, ఏంగెల్స్‌ల రచనల నుంచి అదే పనిగా ఎన్నైనా చెప్పవచ్చు. కానీ కావలసింది మన దేశ పరిస్థితులకు వాటిని ఎలా అన్వయించగలం?’’ అన్నదే అసలు ప్రశ్న అని కామ్రేడ్‌ సుందరయ్య తర చుగా అంటుండేవారు. మన విప్లవానిది రష్యా మార్గమా,  చైనా మార్గమా? సార్వత్రిక తిరుగుబాటు పంథానా, దీర్ఘకాలికసాయుధ పోరాటమా? వంటి సమస్యల చుట్టూనే మన కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీల వాదోపవాదా లన్నీ తిరిగాయి. అంతేగానీ మన దేశ భౌతిక పరిస్థితుల, ప్రత్యేకతలను మార్క్సిస్టు శాస్త్రీయ దృక్పథంతో ఆకళింపు చేసుకోవడానికి అంత ప్రాధా న్యత ఇవ్వలేదని అనిపిస్తుంది.

భారతదేశ ప్రత్యేకతలను గుర్తిస్తేనే...
మన దేశంలోకి మార్క్సిజం, కమ్యూనిస్టు ఉద్యమం ప్రవేశించడానికి శతా బ్దాల పూర్వం నుంచి పీడిత ప్రజలను హిందూ భావజాలం విధించిన చాతుర్వర్ణ వ్యవస్థ సామాజికంగా ఆర్థికంగా తీవ్రమైన అణచివేతకు గురి చేస్తూ ఉండేది. అగ్రవర్ణాల సేవలో శూద్రులు తరించాలని అది శాసించింది. పంచములు లేదా దళితులు సమాజంలోని అట్టడుగు అంతస్తుగా ఉండే వారు. యూరప్‌ దేశాలలోని బానిస వ్యవస్థ ‘‘మన హైందవ భారతంలో కుల వ్యవస్థగా ఘనీభవించింది’’ అని నంబూద్రిపాద్‌ అన్నారు. అయితే ఆ బానిస వ్యవస్థ... భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలుగా పరివర్తన చెందినా వాటిలో సైతం బానిసత్వం మరో రూపమైన కులవ్యవస్థ ఇంకా కొనసాగింది. నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలు ఎంతగా ప్రవేశిస్తున్నా కుల వ్యవస్థ చెక్కు చెదరడం లేదు. కమ్యూనిస్టు ఉద్యమం ఈ కులవ్యవస్థ స్వభా వాన్ని దాని నిర్మూలనకు, మన విప్లవానికి మధ్య ఉన్న అవినాభావ సంబం ధాన్ని లోతుగా అధ్యయనం చేసినట్టు కనిపించదు.

ఆర్థిక పునాది, ఉపరితలం సిద్ధాంతాన్ని యాంత్రికంగా అన్వయిస్తూ ఆర్థిక పునాదితో పాటే ఉపరిత లంలో భాగమైన కులం అదృశ్యమవుతుందనే స్థూల అవగాహనతో పని చేసినట్టు కనిపిస్తుంది. మనుస్మృతి ప్రకారం శూద్ర కులాల వారే అయినా నేటి ఆధిపత్య కులాలైన కమ్మ, రెడ్డి, వెలమ తదితర కులాల వారు దళితులు, మైనారిటీలు, రజకులు, కుమ్మరి, క్షురకులు వంటి అతి వెనుకబడిన కులా లపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడటం మామూలైంది. కారణం కుల వ్యవస్థ నిర్మూలనకు హిందూ మత భావజాలం అంగీకరించదు. ఆ విష యాన్ని గ్రహించిన అంబేడ్కర్‌ సర్వమానవత్వాన్ని స్వీకరించిన బౌద్ధాన్ని స్వీకరించాడు. రామానుజాచార్యులు వంటి వారు సర్వమానవ సమానతను బోధించారు. బసవుని వీరశైవం కూడా అలాంటిదే. గౌతమ బుద్ధుడు, రామా నుజాచార్యులు, బసవన్న వంటి వారి నుంచి అంబేడ్కర్‌ వరకు మన దేశం లోని పుట్టిన సంస్కర్తల ప్రగతిశీల వారసత్వాన్ని మార్క్సిజం స్వీకరించాలి. అలాంటి సమ్మిళిత పోరాటం ద్వారానే  మన దేశంలోని కష్టజీవుల, అణగారిన ప్రజలను సోషలిస్టు విముక్తి పథాన నడపగలమని మన కమ్యూనిస్టులు గుర్తించాలి. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని సృజనాత్మ కంగా అన్వయించి విప్లవాన్ని విజయవంతం చేయడం అనే మహత్తర అక్టో బర్‌ విప్లవ స్ఫూర్తిని నిజంగా గ్రహించడం అవుతుంది.

ఏది ఏమైనా మన దేశంలోని అత్యంత అణగారిన ప్రజలైన దళిత, గిరి జన, బాగా వెనుకబడిన కులాలు, మైనారిటీలు, మహిళలు తమ సమస్యలపై జరిపే పోరాటాల నాయకత్వంలో ఉండటమే కాదు, సోషలిస్టు సమాజ సాధనకై చేసే పోరాటంలో కూడా ముందు నిలవాలి. అప్పుడే భారతావనిలో  ‘అక్టోబర్‌’ విప్లవం పొద్దు పొడుస్తుంది. తరతరాలుగా అణగారిన భారత విప్లవ ప్రజల విముక్తి సాధ్యమవుతుంది.


- డాక్టర్‌ ఏపీ విఠల్‌

వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement