డ్రాగన్‌తో యమ డేంజర్‌! | C Ramachandraiah Articles On RCEP Debate | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌తో యమ డేంజర్‌!

Published Sun, Nov 17 2019 1:07 AM | Last Updated on Sun, Nov 17 2019 1:07 AM

C Ramachandraiah Articles On RCEP Debate - Sakshi

ఏసియాన్‌ దేశాలతోసహా మొత్తం 16 దేశాలతో ఏర్ప డిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌ సెప్‌) నుండి భారత్‌ వైదొ లుగుతోందంటూ ప్రధాని నరేంద్రమోదీ బ్యాంకాక్‌లో తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినది. ద్వైపా క్షిక ఒప్పందాలలో సమాన ప్రతిపత్తి, గౌరవం, పరస్పర ప్రయోజనాలు ముఖ్యమని ప్రధాని విస్పష్టం చేసినట్లయింది. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదన్న సందేశాన్ని ప్రధాని మోదీ పంపించగలిగారు. దేశ ఆర్థిక రంగం మాంద్యం ముంగిట నిలబడిన క్లిష్ట పరిస్థితుల్లో  తీసుకున్న ఈ సహేతుక నిర్ణయాన్ని రాజకీ యాలకు అతీతంగా పరిగణించాలి. వివిధ దేశాల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందాలు పరస్పరం ప్రయోజనకరంగా, పారదర్శకంగా ఉండాలే తప్ప ఏకపక్షంగా ఉండరాదు. 2012లో ఆసియాలోని 10 సభ్య దేశాలతోపాటు మరో 6 దేశాల మధ్య పరస్పర లాభదాయక ఆర్థిక భాగస్వామ్యం సాధించాలనే లక్ష్యంతో ‘ఆర్‌సెప్‌’ ఏర్పాటయింది. ఏడేళ్లపాటు 16 దేశాల మధ్య చర్చలు జరిగాయి. చివరగా నవంబర్‌ మొదటి వారంలో బ్యాంకాక్‌ వేదికగా ‘ఆర్‌సెప్‌’ శిఖరాగ్ర సమావేశం జరిగింది. మొదట్నుంచీ ‘ఆర్‌సెప్‌’ చర్చల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న భారత్‌.. తాను లేవనెత్తిన కీలక అంశాలను ఆపరిష్కృతంగా వదిలివేయడంతో భారీ వాణిజ్య ఒప్పందం నుండి వైదొలగింది. 

గత మూడు దశాబ్దాలలో కుదిరిన పలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను పరిశీలిస్తే.. ఆయా దేశాలతో అమెరికా, చైనాలు కుదుర్చుకున్న భాగస్వామ్య ఆర్థిక వాణిజ్య ఒప్పందాలు అగ్ర రాజ్యాలు సాగించిన ఆర్థిక సామ్రాజ్య వాద దాడిగానే పేర్కొనాలి. తొలుత అమెరికా భాగ స్వామ్య వాణిజ్య ఒప్పందాల పేరుతో ఆయా దేశాల మార్కెట్‌లను తన అధీనంలోకి తెచ్చుకో గలిగింది. నిన్నమొన్నటి వరకూ అమెరికా పెద్దన్న పాత్ర పోషించడం తగదన్న చైనా కూడా ప్రస్తుతం అదే బాటలో నడవడానికి సమాయత్తం అవుతు న్నది. భాగస్వామ్య ఒప్పందాలతో తన వాణి జ్యాన్ని పెంచుకోవడం లక్ష్యంగా సహేతుకం కాని అనేక ప్రతిపాదనలను రుద్దడానికి ప్రయత్ని స్తోంది.  

అమెరికాతో సాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా.. తమ దేశంలో ఇబ్బడిముబ్బడిగా తయారవుతున్న వస్తువులకు, ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను వెతుక్కొనే పనిలో పడిన చైనాకు ‘ఆర్‌సెప్‌’ ఆశాదీపంలా కన్పించింది. బ్యాంకాక్‌ శిఖరాగ్ర సమావేశంలోనే ‘ఆర్‌సెప్‌’ ఒప్పందం ఖరారు చేసుకొనేందుకు ‘చైనా’ మిగతా దేశాల మీద ఒత్తిడి తెచ్చింది. భారత్‌ ఈ ఒత్తిడిని తట్టు కోగలిగి.. సకాలంలో బయట పడగలిగింది. కాగా, వచ్చే ఏడాది మరోమారు ‘ఆర్‌సెప్‌’ సమావేశాన్ని ఏర్పాటుచేసి.. ఏదోఒక విధంగా భారత్‌ను ఇందులో భాగస్వామి చేయడానికి ప్రయత్నిస్తా మంటూ మిగిలిన 15 దేశాలు ప్రకటించినప్పటికీ.. భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో కూడా షరతులకు లొంగే అవకాశం లేదు. ఇప్పటికే.. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), కొన్ని బడా వాణిజ్య సంస్థలు ‘ఆర్‌సెప్‌’లో చేరాలంటూ చేసిన ఒత్తిడికి లొంగ కుండా రైతులు, శ్రామికులు, వినియోగదారుల పక్షానే కేంద్ర ప్రభుత్వం నిలవడం గమనార్హం. 

1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై.. వివిధ దేశాలతో ఏర్పాటైన వాణిజ్య కూటములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదు ర్చుకోవడం మొదలయ్యాక భారత్‌కు ఒనగూడిన ప్రయోజనం నామమాత్రమేనని 2017లో వెలు వడిన నీతిఆయోగ్‌ నివేదిక తేటతెల్లం చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి భాగస్వామ్య దేశాలతో మనకు సమాన అవకాశాలు ప్రాతిపది కగా ఉండాలన్న అవగాహన లోపించిన కారణం గానే భారత్‌ వాణిజ్యలోటు భారీగా పెరిగిపో తోంది. అన్ని రంగాలలో దిగుమతులు పెరు గుతూ, ఎగుమతులు తగ్గిపోత్నుట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాసియా దేశాలతో భారత్‌ వాణిజ్య ఒప్పందాలను పరిశీలిస్తే.. 2013–14 లో 5,400 కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉండగా, 2018–19 నాటికి అది రెట్టింపై దాదాపు 11,000 కోట్ల డాలర్లకు చేరింది.

ఇప్పటికే చౌకగా లభించే చైనా ఉత్పత్తులు దేశంలోకి వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక, అధికారికంగా అనుమతులిస్తే పరిస్థితి ఏమిటి? వినియోగదారుడు ప్రధానంగా ధరను, నాణ్యతను చూస్తాడే తప్ప అది స్వదేశీ వస్తువా? విదేశీ వస్తువా? అనే అంశాన్ని పట్టించుకోడు. దేశంలోని స్వల్ప, మధ్యస్థాయి ఆదాయ వర్గాల వారు సహ జంగానే చైనా ఉత్పత్తులవైపు ఆకర్షితులవుతు న్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో,  పట్ట ణాల్లో కూడా చైనా బజార్లు కనపడుతున్నాయి. చివరకు చైనీస్‌ వంటకాలపట్ల ప్రజలు మక్కువ ఏర్పర్చుకున్నారు. చైనా మొబైల్‌ ఫోన్లు, కంప్యూ టర్‌లు, టెలివిజన్‌లు భారత మార్కెట్‌లో గణనీ యమైన వాటాను సంపాదించుకున్నాయి. ఒక సారి చైనా ఉత్పత్తులు అధికారికంగా భారత్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తే.. ముందుగా కుప్పకూలేది తయారీ రంగమే. దేశంలో నెలకొన్న ఆర్థిక మంద గమనం తయారీ రంగాన్ని దెబ్బతీసిన విషయాన్ని ఎవరూ విస్మరించరు. చైనాతో వాణిజ్య ఒప్పందం అంటే కొరివితే తల గోక్కున్నట్లే!  

చైనాతో భారత్‌ కుదుర్చుకున్న పరిమిత ఒప్పందాలలో ఎన్నడూ మనకు వాణిజ్య మిగులు కనపడలేదు. పత్తిని భారత్‌ నుంచి దిగుమతి చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ.. చైనా ఆ అవకాశాన్ని ఇవ్వడం లేదు.‘ఆర్‌సెప్‌’ ఒప్పందం ద్వారా అతిపెద్దదైన భారత్‌ మార్కెట్‌తోపాటు ఇతర దేశాల మార్కెట్‌లను గుప్పిట్లో పెట్టుకోవా లన్నది చైనా వ్యూహం. ఇక, ‘ఆర్‌సెప్‌’లో భాగ స్వామ్యం కలిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు పాడి ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నాయి. అవి భారత్‌ మార్కెట్‌ను కైవసం చేసుకొంటాయన్న భయాందోళనలు మన రైతాంగంలో ఉత్పన్నమయ్యాయి. మొదట్నుంచీ మన దేశంలో రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కానప్పటికీ.. వారికి అంతోఇంతో అదనపు ఆదాయం పాడి పరిశ్రమ ద్వారానే లభిస్తోంది. దేశం లోని చిన్న, సన్నకారు రైతులకు పాడి పరిశ్రమ కల్పతరువుగా ఉంది. ఒకవేళ ‘ఆర్‌సెప్‌’లో భారత్‌ భాగస్వామి అయితే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుండి పాడి ఉత్పత్తుల వెల్లువలో దేశీయ రైతులు మునిగిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఆర్‌సెప్‌’ను అడ్డుగా పెట్టుకొని చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు.. భారత్‌ను నిలువునా ముంచివేసే ప్రమాదం తృటిలో తప్పి నట్లయింది.  
  
అమెరికాతో వచ్చిన వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌తో సహా పలు దేశాల మార్కె ట్లను తమ చేతుల్లోకి తెచ్చుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్న  చైనాతో పరిమితమైన వాణిజ్య ఒప్పం దాలు మాత్రమే కుదుర్చు కోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. మొదట్లో మార్కెట్‌లోకి కారు చౌకగా వస్తువుల్ని గుమ్మరించి.. భారత్‌ వినియో గదారుల్ని బుట్టలో వేసుకొని ఇక్కడి పరిశ్రమలు కుంటుబడి కనుమరుగయ్యాక.. చైనా తన ఉత్ప త్తులు, వస్తువుల ధరల్ని పెంచేస్తుంది. భవిష్య త్తులో చైనాతో కుదుర్చుకునే ఒప్పందాలపట్ల అప్ర మత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

వ్యాసకర్త: సి. రామచంద్రయ్య , మాజీ ఎంపీ,వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement