మెట్రో సాకారానికి ఆద్యుడు వైఎస్సార్‌ | Kommineni interview with metro MD NVS Reddy | Sakshi
Sakshi News home page

మెట్రో సాకారానికి ఆద్యుడు వైఎస్సార్‌

Published Wed, Dec 20 2017 1:01 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Kommineni interview with metro MD NVS Reddy - Sakshi

ప్రపంచస్థాయిలో నిర్మాణం జరుగుతున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు మొదటగా ప్రోత్సాహం ఇచ్చిందీ, మద్దతు పలికిందీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే అని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్థి ప్రాధమ్యాలుగా తీసుకున్నప్పటికీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు గురించి ప్రతిపాదించగానే డబ్బు విషయంలో తనను ఇబ్బంది పెట్టవద్దు కానీ ప్రాజెక్టును మీ సొంత ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలని భుజం తట్టింది వైస్సారే అని అన్నారు. మెట్రో విషయంలో మీరేం చేయాలంటే అది చేయండి. మీకు ఎంత పవర్‌ కావాలంటే అంత ఇస్తాను అని ఆయన చెప్పిన తర్వాతే ముందుకు కదిలామంటున్న ఎన్వీఎస్‌ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

హైదరాబాద్‌లో మెట్రోరైలు నిర్మాణం అనే ఆలోచన మీకు ఎలా తట్టింది?
మా గురువు శ్రీధరన్‌ ఢిల్లీలో మెట్రో కడుతున్నప్పుడు హైదరాబాద్‌లో మెట్రో ఎందుకు కట్టకూడదు అనే ఆలోచన వచ్చింది. నేనూ, నా బ్యాచ్‌మేట్‌ ఎస్పీ సింగ్‌ ఇద్దరం కలిసి హైదరాబాద్‌లో మనమూ మెట్రో కడదాం అనుకున్నాం. 

అంతకుముందు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనే లేదా?
లేదండి. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు నేను రాష్ట్రానికి వచ్చాను. ఈ ప్రాజెక్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాలా ఎత్తుతుందని, రోజుకు కోటి రూపాయల నష్టం వస్తుం దని ఆయనకు అందరూ చెప్పారు. దాంతో సరే చూద్దాం అని బాబు మెట్రో ప్రతిపాదనను అలా పక్కన పెట్టారు. తర్వాత వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చారు. హైదరాబాద్‌ పెరుగుతున్న నగరం కాబట్టి మెట్రో తప్పకుండా కట్టితీరాలి అని నేనూ, ఎస్పీ సింగ్‌ నిర్ణయించుకుని వైఎస్‌ని కలిశాం. ‘‘దానిదేముంది. చేయండి.. కానీ నన్ను మాత్రం డబ్బు అడగొద్దు’’ అనేశారు. ‘ఇంత పెద్ద ప్రాజెక్టు కదా. డబ్బు అడగొద్దంటే ఎలా’? అన్నాం. ‘ఈ ప్రాజెక్టుకు కావలసిన డబ్బుకోసం మీ సొంత సృజనాత్మక శక్తిని ఉపయోగించండి. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి నా ప్రాధాన్యతలు. మీరేం చేయాలంటే అది చేయండి. మీకు ఎంత పవర్‌ కావాలంటే అంత ఇస్తాను’ అని వైఎస్సార్‌ చెప్పారు. అలా ప్రారంభించాం. ప్రారంభంలో సమస్యలు వచ్చాయి. చివరకు 2012లో ప్రాజెక్టు మొదలైంది.

మెట్రోకు రూ.30 వేల కోట్లు ఎదురిస్తామని మైటాస్‌ చెప్పడం వివాదమైంది కదా!
వచ్చే 35 ఏళ్లలో అంత మొత్తం ఇస్తామన్నారు. కానీ దాని ప్రస్తుత విలువ రూ. 1,200 కోట్లు మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం ఖర్చుపెట్టాల్సి ఉండగా మాకేమీ వద్దు మేమే పెడతాం అని మైటాస్‌ ముందుకొచ్చింది.

మైటాస్‌తో వైఎస్సార్‌ ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైందా?
ప్రభుత్వం ఏదైనా, ఎవరిదైనా కావచ్చు. ఆ అవకతవకలను సత్యం బోర్డులో ఉన్న నిష్ణాతులైన సభ్యులు కూడా ఊహించలేకపోయారు. ప్రపంచ స్థాయి వ్యక్తులకు కూడా సత్యంలో ఇలా జరుగుతోందని చివరిదాకా తెలీకుండా పోయింది. అప్పుడే ఢిల్లీ మెట్రో ఎండీ శ్రీధరన్‌ హైదరాబాద్‌ మెట్రో గురించి విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాను కలిసి పరిస్థితి మొత్తంగా వివరించాను. ఆయన ఒకేమాటన్నారు. మీ ప్రాజెక్టు నమూనాలో ఏ తప్పూ లేదు. దాన్నే కొనసాగిస్తూ పోండన్నారు.

మెట్రో ప్రాజెక్టుకు వైఎస్సార్‌ ఇచ్చిన ప్రోత్సాహం ఏమిటి?
మైటాస్‌ ఫెయిలయిన తర్వాత వైఎస్‌ఆర్‌ మమ్మల్ని పిలిచి ‘తదుపరి చర్యలు ఏమిటి’ అని అడిగారు. మెట్రోను ప్రభుత్వమే కట్టాలంటే చాలా వ్యయం అవుతుంది. కానీ మళ్లీ పీపీపీ పద్ధతిలోనే పోవాలని కేంద్రం సూచించినట్లు చెప్పాను. ‘అలాగే ముందుకెళ్లండి’ అన్నారు. వైఎస్సార్‌ది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఒక ఆలోచనను నమ్మారంటే దానికే కట్టుబడి ఉంటారు. పైగా అధికార్లను సమర్థించేవారు. అది చాలా గొప్ప విషయం. ఆ సమయంలోనే ఎల్‌ అండ్‌ టీ వారు ముందుకొచ్చారు. వారు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి చాలా తక్కువగా అంటే పది శాతం మాత్రమే.. అంటే రూ. 1,453 కోట్లు కావాలని అడిగారు. దాంతో వారికే అవకాశం ఇచ్చాం. తర్వాత జరిగింది మీకందరికీ తెలుసు.

ఈ ప్రాజెక్టు విధానాలు, ఎల్‌ అండ్‌ టీ పెట్టిన షరతుల గురించి చెబుతారా?
ఈ ప్రాజెక్టును చాలా జాగ్రత్తగా చేస్తూ వచ్చాం. ప్రజలకు, నగరానికి, నిర్మాణ సంస్థకు కూడా ఉపయోగపడేలా మెట్రో ఉండాలి. పైగా ధర్మకర్తృత్వం కోసం ఎవరూ ఇలాంటి ప్రాజెక్టులు చేయరు కాబట్టి కంపెనీ కూడా నష్టపోలేదు. మా అంచనా ప్రకారం ప్రారంభంలో నాలుగేళ్లపాటు నష్టం వస్తుంది. వారు చెప్పినట్లు నిర్మాణ వ్యయం పెరిగి ఉంటే ఆరు లేక ఏడో సంవత్సరంలో లాభాలు వస్తాయి. ప్రపంచంలో 250 మెట్రో ప్రాజెక్టులు జరుగుతున్నాయి. కాని హైదరాబాద్‌ మెట్రోకు పెట్టినంత పెట్టుబడి మరెక్కడా పెట్టలేదు. ప్రజలు చెల్లించే పన్నులతో, ప్రభుత్వ ధనంతో కాకుండా ప్రైవేట్‌ ప్రాతిపదికన చేస్తున్న ప్రాజెక్టు ఇది. 50 శాతం ప్యాసింజర్ల నుంచి, 45 శాతం ప్రాపర్టీ అభివృద్ధి నుంచి ఆదాయం వస్తుందని మా ఆంచనా. అభివృద్ధి చేసిన ప్రాపర్టీని కూడా అమ్మడానికి వీల్లేదు. లీజు ప్రకారం అద్దెలు వస్తాయంతే.  మిగిలిన 5 శాతం ఆదాయం ప్రకటనలు ఇతరరూపంలో వస్తుంది.  

మెట్రో ప్రాజెక్టుకు కేసీఆర్‌ మద్దతు ఏ స్థాయిలో ఉంది?
ఇంత అద్భుతంగా సక్సెస్‌ అయ్యారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మమ్మల్ని ప్రశంసించారు. ఒక దశను మొదటినుంచి చివరివరకు పూర్తి చేయండి. ఫలితాలు చూడండి అని సలహా ఇచ్చారాయన. నిజానికి ఆయన చెప్పిందే కరెక్టయింది.  మెట్రో ప్రాజెక్టు చక్కగా విజయవంతం కావడానికి ఎండ్‌ టు ఎండ్‌ పనులు పూర్తి చేయడమే కారణం. మొదటి దశ పనులను పూర్తి చేస్తే వీలైనంత త్వరగా ఫేస్‌–2 పనులను కూడా చేద్దాం అని సీఎం ప్రోత్సహించారు. 

టికెట్ల రేట్లు ఇప్పటికే ఎక్కువంటున్నారు. మరి మెట్రో లాభదాయకమేనా?
మెట్రో రేట్లు ఎక్కువ అని అనుకుంటే తప్పు. ముఖ్యంగా మనకు మంచి నాణ్యత కావాలి. పైగా సెంట్రల్‌ మెట్రో నిబంధనల ప్రకారం నిర్మించిన కంపెనీకి రేట్లు నిర్ణయించే హక్కు ఉంది. పైగా కేంద్రం చెప్పినట్లు సెంట్రల్‌ మెట్రో యాక్ట్‌ కిందకు దేశం లోని మెట్రోలన్నీ వస్తే ఏడాదికి 1,450 కోట్లు కేంద్రం ఇస్తుంది కూడా. మిగతా మెట్రో వ్యవస్థలకు అనుగుణంగానే చార్జి చేయమని చెప్పాం. దాన్ని వారు పాటించారు.

మెట్రో పట్ల హైదరాబాద్‌ ప్రజల స్పందన ఎలా ఉంది?
బ్రహ్మాండంగా ఉంది. ప్రారంభంలో అటూ ఇటుగా రోజుకు 50 వేలమంది ప్రయాణిస్తున్నారని అనుకున్నాం. కానీ పని దినాల్లో దాదాపు లక్షమంది ప్రయాణిస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లో అయితే దాదాపు రెండు లక్షలమంది ప్రయాణిస్తున్నారు. ఊహించని స్పందన ఇది. ప్రారంభంలో మూడు కోచ్‌లు మాత్రమే నడుపుతున్నాం. తదుపరి దశలో ఆరు కోచ్‌లు పెడితే ప్రతి 2 నిమిషాలకు ఒక ట్రైన్‌ చొప్పున 2 వేలమంది ఒకేసారి ప్రయాణిస్తారు. అంటే గంటకు 60 వేల మంది ప్రయాణించవచ్చు. 2018 చివరికి తొలి దశ ప్రాజెక్టు పూర్తయితే కనీసం రోజుకు 10 లక్షలమంది మెట్రోలో ప్రయాణించే అవకాశముంది. తదుపరి దశలో 15 లక్షల మంది ప్రయాణించేలా ఏర్పాటు చేస్తాం. 

కానీ పార్కింగ్, గమ్యస్థానం చేరుకోవడం వంటి సమస్యలు ఉన్నాయి కదా?
మెట్రో పార్కింగ్‌ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అంతర్జాతీయ ట్రాఫిక్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం మెట్రో రైలు వ్యవస్థలో పార్కింగ్‌ వసతి కల్పించవద్దు. ఎందుకంటే పార్కింగ్‌ పేరిట రోడ్డు వెడల్పును అనవసరంగా పెంచి, పార్కింగ్‌ అవకాశం కల్పిస్తే వ్యక్తిగత వాహనాలు మరింత పెరుగుతాయి. దానికి బదులు ప్రజారవాణా వ్యవస్థను పెంచండి. చివరి గమ్యం వరకు రైల్‌ కనెక్టివిటీని పెంచండి అని సూచించారు. కానీ మన దేశంలో ఇలాంటి పరిస్థితి లేదు కాబట్టి మేం మెట్రోలో పార్కింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 24 స్టేషన్లలో మొత్తం 12 చోట్ల పార్కింగ్‌ ప్లేస్‌ సిద్ధం చేశాము. మిగతా చోట్ల కూడా సిద్ధం చేస్తున్నాం.

(ఎన్వీఎస్‌ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)

https://goo.gl/3mvfkc
https://goo.gl/Y3KAQF

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement