వేల ఏళ్లుగా ఊరికి అవతల శ్మశానాల్లో, పశువుల కళేబరాలతో సహజీవనం చేస్తూ, వెలివేత బతుకులు అనుభవించిన వారు అకస్మాత్తుగా తమతోపాటు కుర్చీల్లో కూర్చొని పనిచేయడాన్ని దళితేతర వర్గం సహించలేకపోతోంది. తమ కన్నా హీనకులం వాడు తన కన్నా ఉన్నత పదవిలో ఉన్నాడనే భావన రిజర్వేషన్ల వ్యతిరేకతకు పునాది అవుతోంది. ఎస్సీలు 30–40 ఏళ్ల నుంచి చదువుల్లో, ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుంటున్న వీళ్ల మీద రిజర్వేషన్ల పేరుతో ద్వేషాన్ని కలిగి ఉండటం సమాజానికి మంచిది కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ఏ ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.
‘‘నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి వివిధ కోర్సుల్లో సీటు, నాకన్నా తక్కువ ప్రావీణ్యం చూపిన వారికీ, తక్కువ ప్రతిభ ఉన్నవారికీ ఉద్యోగం, అంతే కాదు నాకన్నా వెనుక ఉద్యోగంలో చేరిన వారికి ఉద్యోగంలో ప్రమోషన్– ఇది దేశానికి నష్టం. ఇలాంటివి ఉండ టం వల్లే దేశం పురోగతి సాధించటం లేదు. అందుకే రిజర్వేషన్ల అమలు అవసరం లేదు’’ అనే రిజర్వేషన్ల వ్యతిరేకుల మాటలు మనకు కొత్త కాదు. రిజర్వే షన్లను ఏ విధంగానైనా దెబ్బకొట్టాలనేవారు ఇంకా చాలా మంది మన మధ్య ఉన్నారు.
ఇక రిజర్వేషన్లు కొనసాగితే తమకు కూడా అమలు చేయాలని కొన్ని ఆధిపత్య కులాలు, అభివృద్ధి చెందిన సామాజిక వర్గాలు వాదిస్తున్నాయి. ఈ వాదన క్రమంగా ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా మారిపోయింది. దానిలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు గానీ, రిజర్వేషన్లలో ప్రమోషన్లు గానీ అమలు చేయకుండా ఆందోళనలు, కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా మారిపో యింది. సమాజంలో రిజర్వేషన్లపై వ్యతిరేకతను ఇది స్పష్టం చేస్తోంది. రిజర్వేషన్లు పొందుతున్న వారిపై విద్వేషానికి, అసూయకీ ఇది తార్కాణంగా నిలు స్తోంది.
కొన్ని సార్లు కోర్టులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించడం వల్ల సామాజిక అశాంతి కొంత తగ్గుతోంది. మంగళ వారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అలాంటిదే. గత కొన్నేళ్లుగా ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రక్రియ ఆగిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రమోషన్లలో రిజర్వేషన్లు కొనసాగించవచ్చనీ, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వ డానికి ఎలాంటి ఇబ్బందీ లేదనీ సుప్రీంకోర్టు ఆదే శాలు ఇచ్చింది.
తదుపరి తీర్పు వచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇదే సుప్రీంకోర్టు ప్రమో షన్లలో రిజర్వేషన్లలో అవకతవకలున్నాయంటూ అందులో రిజర్వేషన్లను నిలిపివేసింది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఎస్సీలమీద పాశవిక దాడులకు కూడా రిజర్వేషన్లపై చర్చ కారణమయింది. ఓ రాష్ట్రం లోనైతే ఓ దళిత యువతి ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపి కయ్యాక శిక్షణ పొంది ఇంటికొచ్చినప్పుడు నీకు ఎస్‌ఐ ఉద్యోగం ఎందుకంటూ ఆమెను రాళ్లతో తల మీద మోది చంపేసిన దారుణ ఘటన సంచలనం సృష్టించింది.
మితిమీరుతున్న సామాజిక అసహనం
వేల ఏళ్లుగా ఊరికి అవతల శ్మశానాల్లో, పశువుల కళే బరాలతో సహజీవనం చేస్తూ, వెలివేత బతుకులు అనుభవించిన వారు అకస్మాత్తుగా తమతోపాటు కుర్చీల్లో కూర్చొని పనిచేయడాన్ని దళితేతర వర్గం సహించలేకపోతోంది. తమ కన్నా హీనకులం వాడు తన కన్నా ఉన్నత పదవిలో ఉన్నాడనే భావన రిజ ర్వేషన్ల వ్యతిరేకతకు పునాది అవుతోంది. ఈ విష యంపై అవగాహన కలగాలంటే మళ్లీ అంబేడ్కర్‌ను పలకరించక తప్పదు. భారత సామాజిక పరిశీలన చేసి అంటరాని కులాల పేరుతో ఊరి అవతలకి విసిరి పారేసిన కులాల పరిస్థితికి కారణం కనుక్కున్నవాడు బాబాసాహెబ్ అంబేడ్కర్. అందుకే అంబేడ్కర్ ఆలో చనను మరోసారి పరిశీలించక తప్పదు.
ఇనుపకంచెకన్నా బలమైన వర్ణ విభజన
భారతదేశ సమాజం వర్ణ, అవర్ణ అనే రెండు భాగాలుగా విడిపోయింది. వర్ణ విభాగంలో ద్విజులు, ద్విజులు కాని వారు అనే రెండు వర్గా లున్నాయి. వర్ణలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉండగా, ద్విజులు కాని వారిలో శూద్రు లున్నారు. అయితే ఈ విభజన కూడా నిలకడ అయిందేమీ కాదు. వర్ణలో ఉన్న మూడింటిలో విభే దాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియుల మధ్య జరిగిన యుద్ధాలే ఇందుకు నిదర్శనం. రామాయణంలో, భారతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ద్విజులకు, శూద్రులకు మ«ధ్య కూడా వైరుధ్యం ఉన్నది.
దీనికి ఎన్నో చారిత్రక ఆధారా లున్నాయి. శివాజీ లాంటి మహాచక్రవర్తి ఎదుర్కొన్న వివక్ష, అవమానాలే ఇందుకు ఉదాహరణ. అవర్ణలో అంటరాని కులాలు, మైదాన ఆదివాసీ తెగలు, అడవి ఆదివాసీ తెగలుగా అంబేడ్కర్ గుర్తించారు. మైదాన ఆదివాసీలను ఆ రోజుల్లో క్రిమినల్ ట్రైబ్స్‌గా పేర్కొనే వారు. అయితే అంటరాని కులాలను, ఆదివాసీ తెగ లను విడదీసి దూరంగా ఉంచారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటరాని కులాలపై ఆదివాసీ తెగలు వివక్ష చూపుతూనే ఉంటాయి.
ఆదివాసీ తెగలను సమాజంలోని వర్గ సమాజం ఎప్పుడూ కూడా తమలో భాగంగా చూడలేదు. కానీ ఆదివాసులను వర్గ సమాజం అంటరాని వారుగా చూడదు. ఈ మొత్తం సామాజిక విభజనను, పరిశీల నను గమనిస్తే అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య నున్న విభజన ఇనుప కంచెకన్నా బల మైనదనీ అంబేడ్కర్ వాదన. ఇది చర్చ జరగాల్సిన అంశం. ఈ విద్వేషం వల్లనే ఈ రోజు దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వందల మంది దళితులు హత్యకు గురవుతున్నారు. వేలాది మంది దళిత ఆడపడుచులు అత్యాచారాలకు బలవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ప్రతీచోటా అవమానాలే ఎదురవుతున్నాయి. ఇది ఈ నాటి కథ కాదు రెండు వేల ఏళ్ళుగా సాగుతున్న నరమేధం.
దళితులు ఏనాడూ హింసకు, రక్తపాతా నికీ దిగలేదన్నది వాస్తవం. శాంతియుత జీవన విధానం, శత్రువునైనా క్షమించే గుణం దళితుల సొంతం. నిజానికి ఇలాంటి హింస ఏ దేశంలో జరి గినా సగం సమాజం నాశనమయ్యేది. దీనికి కూడా సామాజిక నేపథ్యం ఉంది. ప్రస్తుతం అంటరాని కులాలుగా ఉన్న చాలామంది బౌద్ధం, జైనం వారసత్వం కలిగిన వాళ్లు. అందుకే వారిలో ప్రేమ తప్ప, ద్వేషం ఉండదు. ఎవరైనా తమతో సమా నంగా గౌరవించే తత్వం దళితులకే సాధ్యమవు తుంది.
సమానత్వమే బాబాసాహెబ్ తత్వం
అదేరకమైన స్వభావాన్ని, విధానాన్నీ బీఆర్ అంబే డ్కర్ అందిపుచ్చుకున్నారు. ఎన్నో అవమానాలు, అణచివేతను ఎదుర్కొన్న అంబేడ్కర్ ఒకవేళ హింసా మార్గం వైపు వెళ్లి ఉంటే ఈ రోజు దేశం మధ్య ఆసి యాలాగా మండుతుండేది. అంబేడ్కర్ అమెరికాలో చదివిన చదువు ఆయనకు సామాజిక మార్పుపై ఒక శాస్త్రీయ అవగాహన కలిగించింది. అమెరికాలో ఆయన గురువు జాన్ డ్యూయి బోధించిన ప్రజా స్వామ్య దృక్పథం ఆయనకు భారతదేశ సమాజ నిర్మాణానికి మార్గదర్శకమైంది. అందువల్లనే ఆయన ప్రజాస్వామ్యంలోనే పరిష్కారాన్ని కనుగొన్నారు.
ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యమంటే కేవలం ఓటు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకోవడం మాత్రమే కాదు. సామాజిక జీవితంలో ప్రజల మధ్య ఉండే సంబం ధాల్లో కొనసాగాల్సిన సోదరత్వం ప్రజాస్వామ్యానికి పునాది. అందువల్లనే ఆయన ప్రకటించుకొన్న సమా నత్వం, స్వేచ్ఛ, సోదరత్వాల్లో ఆయన ఎక్కువగా ఆలోచించింది సోదరత్వం గురించే. అంబేడ్కర్ ప్రారంభం నుంచీ గాంధీజీ విధానాలనూ, కాంగ్రెస్ రాజకీయాలను విమర్శనాత్మకంగానే చూశారు. ఒక దశలో కాంగ్రెస్‌ను, గాంధీజీని చాలా తీవ్రపదజా లంతో విమర్శించారు. అయితే 1946లో ఏర్పాటైన రాజ్యాంగ సభలో చేరడానికి వెనకాడలేదు. అంతే కాదు రాజ్యాంగ సభలో అంబేడ్కర్ చేసిన ప్రసంగం, ఆయనకు ప్రజాస్వామ్యం, భారతదేశ ఐక్యత మీద ఎంతో విశ్వాసం ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేసింది.
ఆ ప్రసంగమే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచనా కమిటీకి ఛైర్మన్‌గా ఎంపిక చేయడానికి కారణ మైంది. అప్పటి వరకు కాంగ్రెస్‌ను శత్రువుగా భావిం చినా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం పని చేసే విజ్ఞతను అంబేడ్కర్ అందిపుచ్చుకున్నారు. ఇది అంబేడ్కర్ దార్శనికతకు నిదర్శనం. ఇంకో విష యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇలాంటి దృక్పథం కేవలం అంబేడ్కర్‌కే కాదు, దళిత సమా జం మొత్తంలో ఇది నిండి ఉంది. తమను ఊరి బయటకు వెలివేసినప్పటికీ ఆ వూరి ప్రగతికోసం ప్రాణాలకు తెగించి పనిచేయడం, సమాజాభివృద్ధికి తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం దళి తులు తరాల తరబడి చేస్తూనే ఉన్నారు. వర్షాధార పంటలమీద ఆధారపడే కాలం నుంచి చెరువుల నిర్మాణం ద్వారా నికరమైన పంటల పెరుగుదలకు ప్రాణం పోశారు.
చచ్చిన పశువుల చర్మాలు ఒలిచి, మురికిలో మురికిగా మారి తోలును శుభ్రం చేసి పద్దె నిమిది కులాలకు పనిముట్లను తయారు చేసిన పని తనం దళితులది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన రైల్వేల నిర్మాణం, గనుల తవ్వకం లాంటి పనుల్లో వేలాది ప్రాణాలు బలైపోయాయి. కుళ్లు కంపుకొడుతోన్న పాయిఖానాలను, చెత్తతో నిండిన వాడలను శుభ్రం చేసిన స్వచ్ఛమైన భారతీ యులు వీరే. ఇది భారత దేశంలోని దళితుల ఔదా ర్యం. వారిగొప్పతనం. అయితే గత వేల ఏళ్ళుగా భూమికీ, చదువుకూ, సంపదకూ, మంచి బట్టకూ, ఇంటికీ దళితులు దూరంగానే ఉన్నారు.
కొన్ని కులాలు వందల ఏళ్ళుగా చదువులో, సంపదలో, భూమిలో నూటికి నూరుశాతం రిజర్వేషన్లు అను భవించాయి. చాలా మంది అన్నదాత పేరును కేవలం భూమి హక్కు కలిగిన భూస్వాములనే అర్థంలో ప్రస్తావిస్తున్నారు. నిజానికి పంట పండిం చింది, పండించేది కూలీలే. ఆ కూలీలు ఎవ్వరో కాదు, నూటికి నూరు పాళ్లూ దళితులే. ఇలాంటి ఎస్సీలు 30–40 ఏళ్ల నుంచి చదువుల్లో, ఉద్యోగాల్లోకి వస్తున్నారు. అయితే, ఇరవై ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యో గాలను కుదించారు. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుంటున్న వీళ్ల మీద రిజర్వేషన్ల పేరుతో ద్వేషాన్ని కలిగి ఉండటం సమాజానికి మంచిది కాదు. భారతదేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాం గాన్ని రూపొందించుకున్నాం. సమానత్వం, స్వేచ్ఛ, సోదరత్వం పునాదిగా ఎన్నో అంశాలను పొందుపరు చుకున్నాం. అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4)ఏ ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు: మల్లెపల్లి లక్ష్మయ్య , మొబైల్ : 97055 66213
Comments
Please login to add a commentAdd a comment