డిపాజిట్లపైనా అపోహలేనా? | Purighalla Raghuram article on Deposits | Sakshi
Sakshi News home page

డిపాజిట్లపైనా అపోహలేనా?

Published Tue, Jan 2 2018 1:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Purighalla Raghuram article on Deposits - Sakshi

అభిప్రాయం

డిపాజిట్‌దారుల నగదులో రూ. లక్షకు మాత్రమే బీమా చేయాలన్న నిర్ణయం కూడా బీజేపీ లేదా నరేంద్ర మోదీ ప్రభుత్వ చర్య కాదు. 1993లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనికి కూడా మోదీపైన బురద చల్లటం ఏమిటి?

వరదలో కొట్టుకుపోతున్న ప్పుడు తెడ్డు దొరికినా చాలనిపి స్తుంది. దాన్ని వాడుకుని ఎలా గైనా బయటపడాలనిపిస్తుంది. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రమాదం నుంచి గట్టెక్కాలనే ఆతృత సహజం. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఒక తప్పును పట్టాలని, దాన్ని అడ్డం పెట్టుకుని బతకాలని ఆ పార్టీ తాపత్రయపడుతోంది.
భారీ మెజార్టీతో ఎన్నికల్లో ప్రజామోదం పొంది, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎదురుచూపులు మొదలయ్యాయి. పెద్ద నోట్ల రద్దు వంటి సాహసోపేతమైన చారిత్రక చర్య దగ్గర్నుంచి, సరిహద్దు వెంబడి మెరుపుదాడుల వంటి సున్నితమైన చర్యల వరకు ప్రతిదాన్నీ వివాదాస్పదం చేయాలని, ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని చూసింది.

ప్రభుత్వం చేసే ప్రతి పనినీ అభినందించాలని, ఆమోదించాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ, ప్రభుత్వం చేసే మంచి పనుల్ని కూడా చెడ్డగా చిత్రీకరించే ప్రతి పక్షాలు ఉండటం మాత్రం సరికాదు. నల్లధనం అదుపు చేసే క్రమంలో వ్యక్తిగత బంగారంపై పకడ్బందీ నిబంధ నల్ని ప్రభుత్వం రూపొందిస్తే.. మహిళల బంగారాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుందని పుకార్లు పుట్టించటం ఎంత వరకు సమంజసం? దేశంలో బ్యాంకింగ్‌ రంగాన్ని పటిష్టం చేసేందుకు చట్టం తీసుకురావాలని పార్లమెంటు ముందుకు వస్తే.. బ్యాంకుల్లో ప్రజలు దాచుకునే సొమ్మును వాడేసుకుంటారంటూ వదంతులు ప్రచారం చేయటం ఎంతవరకు సబబు?
వ్యక్తిగత బంగారం విషయానికొస్తే.. పెళ్లైన మహిళ అరకిలో బంగారం తన వద్ద ఉంచుకోవచ్చు.

వారసత్వంగా వచ్చినదైతే ఎంతైనా అట్టిపెట్టుకోవచ్చు. వారస త్వంగా వచ్చిన బంగారాన్ని పక్కనబెడితే దేశంలో సామాన్య మహిళలు ఎంతమందికి అరకిలో బంగారం ఉంటుంది? అక్రమంగా ఆస్తులు కూడబెట్టే వాళ్లని పట్టుకునేందుకు ఉద్దేశించిన ఇలాంటి చర్యలను కూడా ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి వాడుకున్నాయి. ఇప్పుడు బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, వాటిలో దాచుకున్న నగదు విషయానికొద్దాం. ప్రతిపక్షాల పుణ్యమా అని చాలామంది ఈ అపోహల్ని నమ్మి బ్యాంకుల ఎదుట బారులుతీరి మరీ తమ నగదును వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అంటే కొంతవరకూ ప్రతిపక్షాలు విజయవంతమైనట్లే.

ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులోని ‘బెయిల్‌ ఇన్‌’ అనే అంశం పైనే ప్రతిపక్షాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తు న్నాయి. బ్యాంకుల్లో ప్రజలు దాచుకునే నగదులో రూ. లక్షకు మాత్రమే ప్రభుత్వం బీమా చేస్తుంది. ఆపై నగ దుకు బీమా సదుపాయం ఉండదు. అంటే.. ఒకవేళ బ్యాంకు దివాళా తీస్తే.. రూ. లక్ష లోపు ఉన్న డిపాజిట్‌ దారులందరికీ నగదు సర్దుబాటు చేసి, ఆ తర్వాత రూ. లక్షపైన మొత్తాలకు నగదును సమకూరుస్తారు. అయితే, ఈ అంశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా చేర్చలేదు. 1961లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ చట్టం చేసింది. డిపాజిట్‌దారుల నగదులో రూ. లక్షకు మాత్రమే బీమా చేయాలన్న నిర్ణయం కూడా బీజేపీ లేదా మోదీ ప్రభుత్వ చర్య కాదు. 1993లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం. దీనికి మోదీపైన బురద చల్లటం ఏమిటి? ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం దేశంలో బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత బలోపేతం చేయటమే తప్ప నీరుగార్చటం కాదు. దీనికీ డిపాజిటర్ల డబ్బులకు, మరీ ముఖ్యంగా రూ. లక్ష నగదుపై బీమాకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు.

రూ. లక్ష నగదుపైన బీమా నిమిత్తం దేశంలోని 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 3వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నాయి. అసలు 1961లో చట్టం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా దివాళా తీయటం కానీ, ఈ చట్టాన్ని ఉప యోగించటం కానీ జరగలేదు. అలాంటిది.. కోడిగుడ్డుకు, బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా కాంగ్రెస్‌ హయాంలో బ్యాంకులకు టోపీ పెట్టిన మోసగాళ్ల నేరాలకు, రూపాయి.. రూపాయి కూడబెట్టుకునే సామాన్య ప్రజల డిపాజిట్లకు ముడిపెట్టి, అపోహలు సృష్టించి, ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడటం క్షమించరాని నేరం కాదా?
కాంగ్రెస్‌ పార్టీ ఇలా ఎన్ని అపవాదుల్ని సృష్టించినా, అపోహల్ని ప్రచారం చేసినా, అమాయకుల్ని చేసి ప్రజల్ని రెచ్చగొట్టినా.. నిజం నిలకడమీద తెలుసుకుని నరేంద్ర మోదీ చర్యల్ని సమర్థిస్తోంది ఈ దేశం. నిజాయితీగా దేశం కోసం మోదీ పడుతున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుం టున్నారు కాబట్టే కాంగ్రెస్‌ పార్టీ కుతంత్రాలను తిప్పికొట్టి, బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కొత్త సంవత్స రంలో, కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనైనా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని ఆశిద్దాం.

పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
ఈ–మెయిల్‌ : raghuram.delhi@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement