శిలా విగ్రహాలు కూలితేనేం? | Statue Only Destroyed But Lenin Always Wins | Sakshi
Sakshi News home page

శిలా విగ్రహాలు కూలితేనేం?

Published Sat, Mar 10 2018 12:53 AM | Last Updated on Sat, Mar 10 2018 12:53 AM

Statue Only Destroyed But Lenin Always Wins - Sakshi

మనం ఒక బూటకపు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాం. అదే నిజమైన ఏకైక జాతీయ సిద్ధాంతం. ఒక పార్టీ వామపక్ష కంచుకోటను బద్దలు చేసినందుకు సంబరాలు జరుపుకుంటుంది. ఒక ఉద్రిక్త క్షణంలో ఆ పార్టీ కార్యకర్తలు లెనిన్‌ విగ్రహాన్ని కూల్చివేశారు. వారు ద్వేషిస్తున్న నియంత ఇప్పటికీ విజయం సాధిస్తూ ఉన్నాడన్నదే వారికి తెలియని విషయం. లెనిన్‌ 1924లో చనిపోయాడు. ఆయన సొంత దేశం తన తాత్విక చింతనను 1990లో వదిలిపెట్టేసింది. కానీ భారత్‌లో అది మార్పు లేకుండా కొనసాగుతోంది.

భారత వామపక్షంతో నా తొలి అవగాహన క్రికెట్‌ ఆటలో మొదటి బాల్‌కే డకౌట్‌ కావడంతో సరిసమానమైనదే. 1975లో నేను జర్నలిజం విద్యార్థిగా ఉన్నప్పుడు జరిగిందిది. అప్పుడు మాతో పాటు ఒకే ఒక కామ్రేడ్, నిజానికి శాంతియుతంగా ఉండే నక్సలైట్‌ ఉండేవాడు. ఆయనతో పందెం వేశాను. ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ జీవించి ఉన్నారా, లేదా అన్నదే ఆ పందెం. ఆ పందెంలో నేను పది రూపాయలు పోగొట్టుకున్నాను. విద్యార్థి వసతిగృహం అద్దె, మెస్‌ బిల్లు కట్టడానికి ఇంటి దగ్గర నుంచి వచ్చే 200 రూపాయల కోసం ఎదురు చూసే రోజులవి. కాబట్టి పది రూపాయలంటే పెద్ద మొత్తమే. 

తరువాత చాలాకాలానికి కేరళ మీద వార్తా కథనం రాస్తున్నప్పుడు జరిగింది. వామపక్ష ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం (అప్పుడు అక్కడే ఉన్న దాదా జర్నలిస్ట్‌ రమేశ్‌ మేనన్‌తో కలసి) రాసినప్పుడు సాక్షాత్తు ఈఎంఎస్‌ను కలుసుకున్నాను. నా పందెం విషయం ప్రస్తావించాను. ఆయన తన చేయి పైకి ఎత్తి, మణికట్టు దగ్గర చూపిస్తూ, ‘మీరు నా నాడిని ఎందుకు పరీక్షంచకూడదు’ అన్నారు, నిర్వికారంగా. ఇంకా, ‘మీరు చెప్పిందే నిజమైతే, మీ డబ్బు మీకు వెనక్కి రావలసిందే’అన్నారు. అంతా నవ్వుకున్నాం. జర్నలిజం విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా నేను వామపక్ష రాజకీయాల గురించి తెలియకుండా ఉండిపోయానంటే అందుకు పంజాబ్‌ పల్లెటూళ్లలో ఉండే చిన్న చిన్న పాఠశాలల్లో, తరువాత హరియాణా వంటి చోట చదవడం కొంత కారణం. అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు ఉండేవి కావు. ఒక ఉపాధ్యాయుడు కామ్రేడ్‌ వంటి పదాలతో పిలిపించుకోవాలని ఆసక్తిగా ఉన్నప్పటికీ అసలు ఎలాంటి కార్మిక సంఘాలు, అందులోను వామపక్ష కార్మిక సంఘాలు లేనేలేవు. ఇక తూర్పున వచ్చిన నక్సల్‌ ఉద్యమం మాకు చేరేటప్పటికి పురాతనమైపోయింది. 

నేను భారత వామపక్ష రాజకీయాల గురించి తెలుసుకున్నది జర్నలిస్టుగా పనిచేయడం మొదలు పెట్టిన తరువాతనే. ఆ క్రమంలో నేను వామపక్ష విమర్శకుడిగానే ఎదిగాను. ముఖ్యంగా వారి ఆర్థిక సిద్ధాంతం, రాజకీయ–సామాజిక కపటత్వాన్ని నేను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నాను. నియంతృత్వం నుంచి అధికారాన్ని తెచ్చుకునే ఒక సిద్ధాంతం ‘ప్రజాస్వామిక’ అనే పదం పక్కన ఎలా ఇముడుతుంది? అలాగే భద్రలోక్‌ అని పిలుచుకునే అగ్రకులాల నుంచి వచ్చిన వ్యక్తులు(విదేశాలలో చదువుకున్నవారు, ప్రత్యేక హక్కులు ఉన్న భారతీయ వ్యవస్థల నుంచి వచ్చిన వారు) సమానత్వం గురించీ, బలహీన వర్గాల గురించీ ఏకధాటిగా ఎలా మాట్లాడతారు? ఇన్ని దశాబ్దాలలోను వామపక్ష రాజకీయాలతో నేను ఏకీభవించిన పరిస్థితి ఎక్కడా లేదు. ఈ మేధోపరమైన, తాత్వికమైన అహంకారం గురించి నేను బాధపడ్డాను కూడా. నీవు మాతో రాకపోతే పెట్టుబడుదారుల తాబేదారువి అయినట్టే. 

బూర్జువా అనే పదం కాలక్రమంలో వెలుగులోకి వచ్చి, తరువాత అదే నియో లిబరల్‌గా రూపాంతరం చెందింది. ఇది కాకపోతే ఇంకొకటి. 1989–1993 మధ్య పంజాబ్‌ను తుది దశ ఉగ్రవాదం కకావికలు చేసింది. సరిహద్దు జిల్లాలలో ఉగ్రవాదులు ‘విముక్తం’చేశామని చెప్పిన గ్రామాల మీద తిరిగి పట్టు సాధించిన ఏకైక రాజకీయ శక్తులు, అందుకు త్యాగాలు చేసిన పార్టీలు, ఇప్పటికీ కార్యకర్తలు ఉన్న పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే. పోలీసులు వారికి ఆయుదాలు అందించారు. ఒక మహిళా కామ్రేడ్‌ ఎల్‌ఎమ్‌జీ (లైట్‌ మెషీన్‌ గన్‌)ని తన ఇంటి మీద ఏర్పాటు చేసి, నిరంతరం రక్షించుకుంటూ ఉన్న ఉదంతం గురించి మేం నివేదించాం కూడా. 

ఆ ఒక్క రాష్ట్రంలో ఆ దశను మినహాయిస్తే, వామపక్షం గురించి చప్పట్లు కొట్టేందుకు ఏదీ నాకు కనిపించలేదు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం అనూహ్యంగా ఓడిపోయిన తరువాత సీపీఐ నాయకుడు ఏబీ బర్దన్‌ ‘భాద్‌మే జాయే డిజిన్వెస్ట్‌మెంట్‌’ అంటూ ఇచ్చిన ప్రకటనకు నేను మండిపడ్డాను కూడా. అణు ఒప్పందం గురించి జరిగిన ఓటింగ్‌లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ విజయం సాధించినప్పుడు, వామపక్షాలు ఏహ్యభావంతో చూసే మాయవతి, బీజేపీ సహా కుల,మత శక్తులని పిలిచే వారితో చేతులు కలిపినప్పుడు కూడా నేను అభినందించాను. ఆ తరువాత అంతిమంగా మమతా బెనర్జీ వారిని పశ్చిమ బెంగాల్‌లో ఓడించినప్పుడు అభినందించాను. దాంతోనే భారత వామపక్ష రాజకీయాల కథ ముగిసిందని స్పష్టమైంది. తూర్పు, మధ్య భారతంలో ఉగ్రవాద వామపక్షం కూడా అనివార్యంగా అదే బాటలో ఉంది. కాబట్టి లెనిన్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్ఘటన పట్ల నేను నిరసన ప్రకటించనని మీలో చాలామంది ఊహించవచ్చు. కానీ నేను నిరసన ప్రకటించాను. కానీ దానికి అనివార్యమైన వేరే కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఎవరైనా తమకు నచ్చిన దేవుళ్లను ఎంచుకుని పూజించుకునే హక్కు కలిగి ఉన్నారు. ఇతరులకు చెందిన విగ్రహాలను ధ్వంసం చేసే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. 

1980 దశకం చివరి అంకంలో ప్రపంచ కమ్యూనిజంలో మార్పు ఆరంభమైంది. సోవియెట్‌ యూనియన్‌ కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆఫ్ఘానిస్తాన్‌తో చేసిన యుద్ధంలో ఓడిపోయింది. గోర్బచెవ్‌ పెరిస్త్రోయికా, గ్లాస్‌నోస్త్‌లను ప్రవేశపెట్టారు. డెంగ్‌ సరళీ కరణను అనుమతిస్తూ, ఎలకలని పట్టుకోగలినదైతే పిల్లి తెల్లగా ఉంటే ఏమి, నల్లగా ఉంటే ఏమి అంటూ చైనా ప్రజలకు హితబోధ చేశారు. ‘భారత్‌లో మారని వామపక్షం’ అన్న అంశం మీద పని చేయడానికి ఆ సమయంలో నేను కలకత్తాలో ఉన్నాను. అప్పుడు సరోజ్‌ ముఖర్జీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి. పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల లెనిన్, స్టాలిన్, మార్క్స్‌ల పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నాయి. ‘గోర్బచెవ్, డెంగ్‌ మారుతున్నారు. మీరు ఎందుకు మారడం లేదు సార్‌?’ అని అడిగాను. ‘ఎందుకంటే, నా కమ్యూనిజం డెంగ్, గోర్బచెవ్‌ల కమ్యూనిజం కంటే స్వచ్ఛమైనది’ అన్నారాయన అచంచల విశ్వాసంతో. 

తరువాత సరిగ్గా రెండేళ్లకి రిపబ్లిక్‌లు విడిపోయాక సోవియెట్‌ యూనియన్‌ను చూసేందుకు నేను మాస్కో వెళ్లాను. బుఖారెస్ట్‌లో ట్యాంకులు ఇంకా రోడ్ల మీదే ఉన్నాయి. వందలాదిమంది ప్రజలు సీసెస్క్యూను చంపిన చోటికి తండోపతండాలుగా వచ్చారు– శపించడానికి, ఉమ్మడానికి. రుమేనియా కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమావేశాలకు వెళ్లిన భారత వామపక్ష బృందం ఒకటి అంతకు కొన్ని వారాల ముందే మన దేశం చేరుకుంది. ఈ బృందంలోనే ఎవరో ది పయనీర్‌ పత్రికకు ఒక వ్యాసం రాశారు. సీసెస్క్యూ అరాచకాలకు సంబంధించి వస్తున్న వార్తలు, ఆయన ప్రభుత్వం పతనం కావడం గురించిన వార్తలు– ఇవన్నీ పాశ్చాత్య దేశాల దుష్ప్రచారమేనని రాశారు. అందుకు చూపించిన ఉదా‘‘ నియంత తన ఉపన్యాసం ముగించిన వెంటనే మొదలైన ప్రశంసల వర్షం కొన్ని గంటల దాకా ఆగలేదని పేర్కొన్నారు. 

ఇది జరిగిన సరిగ్గా ఎనిమిది మాసాల తరువాత మళ్లీ నేను మాస్కో వెళ్లాను. ఇవాళ ఇక్కడ ఎలా జరిగిందో, అలాగే అక్కడ జరిగిన కమ్యూనిస్టు నేతల విగ్రహాలను ఎలా పెళ్లగించడం జరిగిందో చూసేందుకు వెళ్లాను. ఆ విగ్రహాలను కూల్చివేసినందుకు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న కొందరు తప్ప చాలా తక్కువ మంది విచారం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం. ఒక సిద్ధాంతం కాలగర్భంలో కలసిపోతే, దానితో పాటు ఆ సిద్ధాంతం పునాదిగా వేళ్లూనిన నియంతృత్వాలు, వాటిని సాగించిన నియంతలు కూడా దాని వెంట కాలగర్భంలోకి నిష్క్రమించవలసిందే. 

తన 34 సంవత్సరాల పాలనలో రాజకీయంగా వామపక్ష కూటమి బెంగాల్‌ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది. అది ప్రజాస్వామ్యం గురించి, ఉదారవాదం గురించి ప్రబోధించింది. కానీ దుండగులతో, బలవంతపు వసూళ్లు చేసేవారితో కూడిన ఒక సైన్యాన్ని తయారు చేసి పెట్టింది. ఈ సైన్యం ఏ ఒక్క ప్రతిపక్షాన్ని బతకనివ్వలేదు. కేరళకు ఒక సోషలిస్టు గుణం ఉంది. అక్కడ కాంగ్రెస్, వామపక్షం ఒకదాని తరువాత ఒకటి అధికారం పంచుకుం టాయి. మిగిలిన దేశమంతటా పంజాబ్‌ మొదలు మహారాష్ట్ర వరకు; బిహార్‌ నుంచి ఆఖరికి అస్సాం వరకు కూడా వామపక్షాలు అంతర్ధానమయ్యాయి. అయితే ఇతరుల పుణ్యమా అని 2004లో 59 స్థానాలు పొందిన వామపక్షాలకు జాతీయ స్థాయి అధికారాన్ని రుచి చూసే అవకాశం దక్కింది. 

ఆ తరువాతే వారి రాజకీయ అధికారం పతనం కావడం ఆరంభమైంది. వామపక్షం అడుగంటిపోతోంది. ఆ పార్టీ పెద్దల విగ్రహాలు కూలుతున్నాయి. కానీ వాళ్ల సిద్ధాంతం ఇంకా ఏలుతుంది. అది సవాలు చేయలేనిది. నేను ప్రయాణించిన ట్యాక్సీ డ్రైవర్‌ చెప్పిన ప్రకారం పత్రికా విలేకరులు వార్తా కథనాల కోసం హేళన చేస్తూ ఉంటారు. వాక్లవ్‌ హావెల్‌ వెల్వెట్‌ రివల్యూషన్‌ కారణంగా ప్రేగ్‌ నగరంలో కమ్యూనిజం కకావికలైంది. అక్కడ మీరు ప్రయాణించే కారు డ్రైవర్‌ ఒక అణు ప్రయోగశాలలో ఉద్యోగం పోగొట్టుకున్న కంప్యూటర్‌ ఇంజనీర్‌ అయి ఉండవచ్చు. మేం ప్రయాణించిన కారు డ్రైవర్‌ అలాంటి వాడే. మా సంభాషణ అనివార్యంగా కమ్యూనిజం వైఫల్యాలు, తీవ్ర చర్యల మీదకు మళ్లింది. భారతదేశంలో సోషలిజం ఇప్పటికీ ఎందుకు అంత ప్రాచుర్యం కోల్పోకుండా ఉంది వంటి ప్రశ్న నుంచి చాలా ప్రశ్నలే అడిగాడు. 

అలాగే ముఖ్యమైన రాష్ట్రాలలో తరుచూ ఎందుకు ఎన్నికవుతారని కూడా అతడు ప్రశ్నించాడు. దానికి అతడే సమాధానం కూడా చెప్పాడు. మీ సోషలిజం మా సోషలిజం కంటే భిన్నమైనదని అన్నాడు. మా సోషలిస్టులు మా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛలను మా నుంచి దూరంగా తీసుకుపోయారు. కానీ మీ స్వేచ్ఛలు మీ దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఎమర్జెన్సీ సమయంలో వాటిని ప్రభుత్వం లాక్కున్నా మళ్లీ మీరు సాధించుకున్నారని కూడా వ్యాఖ్యానించాడు. అతడు చెప్పింది నిజమే. అయితే మీరు ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఎన్నడూ రుచిచూడలేదు కాబట్టి సోషలిజం మిమ్మల్ని నష్టపరిచింది ఏమిటో మీరు అర్థం చేసుకోలేరు. 

అతడు చెప్పింది నిజం. మనం ఇప్పుడు ఒక బూటకపు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాం. అదే నిజమైన ఏకైక జాతీయ సిద్ధాంతం. ఒక పార్టీ వామపక్ష కంచుకోటను బద్దలు చేసినందుకు సంబరాలు జరుపుకుంటుంది. ఒక ఉద్రిక్త క్షణంలో ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు లెనిన్‌ విగ్రహాన్ని కూల్చివేశారు. వారు ద్వేషిస్తున్న నియంత ఇప్పటికీ విజయం సాధిస్తూ ఉన్నాడన్నదే వారికి తెలియని విషయం. లెనిన్‌ 1924లో చనిపోయాడు. ఆయన సొంత దేశం తన తాత్విక చింతనను 1990లో వదిలిపెట్టేసింది. కానీ భారత్‌లో అది ఏమాత్రం మార్పు లేకుండా కొనసాగుతోంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement