
సీపీఎం గుర్తు, సీతారాం ఏచూరి
కొన్ని రోజులుగా వామపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి నేతల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు చైనాకు అనుకూలంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌కంటే చైనా గొప్ప దేశమని మన ఆర్థిక వ్యవస్థకంటే చైనా ఆర్థిక వ్యవస్థ గొప్పదని మాట్లాడుతూ ఈ దేశంలో ఉండే 125 కోట్ల మంది భారతీయులను అవమానిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ఏదో కిందిస్థాయి నాయకులు మాట్లాడితే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ సీపీఎం చీఫ్ సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ రాష్ట్ర కార్యదర్శి కె. బాలక్రిష్ణన్ చైనాను పొగడటం సగటు భారతీయులు జీర్ణించుకో లేకపోతున్నారు. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, భారత్ కూటమి చైనాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెక్నాలజీ పరంగా అమెరికా సైతం ఇజ్రాయెల్‌పైన ఆధారపడుతుంది. వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనల ద్వారా ఇజ్రాయెల్ ముందుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇజ్రాయెల్ సహాయంతో కొత్త వంగడాలు తీసుకువచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నది కేంద్రప్రభుత్వం ఆలోచన... దేశీయంగా వ్యవసాయాభివృద్ధికి కమ్యూనిస్టులు వ్యతిరేకమో, అనుకూలమో చెప్పాలి.
అమెరికా ఇన్నాళ్లు భారతదేశంలో బలహీన నాయకత్వాలను ఖాతరు చేయకుండా భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి పాకిస్తాన్‌ని ప్రేరేపించి, వారికి ఆర్థికంగా సహకరించి పరోక్షంగా భారత్‌ను ఇబ్బంది పెట్టిన దేశంగా మనకు తెలుసు. మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత అమెరికా భారత్ ఒక బలమైన దేశంగా భావించి మనతో చెలిమి చేస్తున్నది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరంగా ప్రపంచానికి చెప్పి వారికి నిధులు సైతం రద్దు చేసి ప్రపంచంలో పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాము. ఇది మోదీ దౌత్య విజయమే. ఈ సందర్భంలో పాకిస్తాన్ కొంతమంది తీవ్రవాదులను అరెస్టు చేసింది. అనేక దేశాలు అమెరికా చెలిమి కోసం సాగిలపడుతున్నాయి. కానీ అమెరికా భారత్ చెలిమి కోసం సాగిలపడుతుంది. వ్యూహాత్మకంగా అమెరికాతో సంబంధాలను భారత్ చేపడుతుంటే కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.
చైనా భారతదేశంకంటే గొప్ప దేశమని భజన చేస్తున్న కమ్యూనిస్టు నాయకులు వాస్తవాలను గమనించాల్సి ఉంది. చైనా భారత్‌ను ఒకసారి యుద్ధంలో ఓడించి నేటికీ పాకిస్తాన్‌కు సహకరిస్తూ మనల్ని నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నది. నిత్యం పాకిస్తాన్‌ను రెచ్చ గొడుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా పాక్‌కు సహాయం చేస్తూనే ఉన్నది. అలాంటిది.. చైనాను మనం ఆదర్శంగా తీసుకోవాలని కమ్యూనిస్టులు నీతి సూత్రాలు వల్లిం చడం ఏ దేశభక్తి? చైనా దేశీయంగా బౌద్ధులపై కొనసాగి స్తున్న దాడులు, ముస్లింలను భయభ్రాంతులకు గురిచేయడం, కార్మికులతో 10 నుండి 12 గంటలు గొడ్డుచాకిరి చేయించటం, ప్రతిపక్ష పార్టీలను కాలరాయడం, అవినీతిని ప్రశ్నించిన సొంత పార్టీ నేతలమీద వివిధ కేసులు బనాయించి వేధించడం మనం ఆదర్శంగా తీసుకోవాలా? డోక్లాంలో భారత సైన్యాన్ని ప్రతిరోజూ కవ్విం చడం, అరుణాచల్ సరిహద్దుల్లో రోజూ మన సైన్యాన్ని రెచ్చగొట్టడం, బ్రహ్మపుత్రానది మన దేశంలోకి రాకుండా దారి మళ్లించడం, మన సముద్ర జలాల గుండా సీపీఈసీ కారిడార్‌ను నిర్మించి మన దేశంపై దండయాత్ర ఆలోచనలను ఈ కమ్యూనిస్టులు ఎందుకు వ్యతిరేకిం చడం లేదో ప్రజలకు తెలియాలి.
చైనా తన నిధులతో శ్రీలంకలో పోర్టు నిర్మాణం చేసేందుకు శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వెనుక భారత్‌పై దొంగచాటు దెబ్బతీయాలనే ఆలోచన లేదంటారా? మన చుట్టూ ఉన్న చిన్న దేశాలైన నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో వ్యాపారం పేరుతో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొని మనల్ని దొంగదెబ్బ తీయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకోవాలా? పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించి స్వేచ్ఛ, పత్రికలు లేని, ప్రజాస్వామ్యంలేని నియంత పాలనను ఆదర్శంగా తీసుకోవాలా? పంచశీల ఒప్పందాల బంధాల్ని తెగదెంచిన చైనాను ఏ ప్రాతిపదికన ఆదర్శంగా తీసుకోవాలో కమ్యూనిస్టులే జవాబివ్వాలి. ఎన్.ఎస్.జి.లో భారత్‌కు వ్యతిరేకంగా చైనా ఒక్కటే అడ్డు పడుతుంటే ఈ కమ్యూనిస్టుల నోళ్లు ఎందుకు పడిపోయాయి?
చైనాతో భారత్ పోరాడుతున్న సందర్భంలో ఈ దేశంలోని వామపక్ష పార్టీలు చైనాకు వంత పలికాయి. ఈ ద్రోహాన్ని ఈ దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. నిజానికి కమ్యూనిస్టులకు ఈ దేశంపై గౌరవముంటే ఈ దేశ జాతీయ నాయకుల చిత్రపటాల్ని వారి కార్యాలయాల్లో ఎందుకు ఉంచరు? చేగువేరా, కారల్‌మార్క్స్, లెనిన్, స్టాలిన్.. వీళ్లేనా వీళ్లకు హీరోలు? గాంధీజీ, పటేల్, నేతాజీ, అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తదితరులెవ్వరూ కారా వీరికి ఆదర్శం? వారి కార్యాలయాలపై ఎందుకు జాతీయ జెండాను ఎగరే యరు? సిద్ధాంతం పేరుతో రాద్ధాంతం చేస్తూ దేశ ఔన్న త్యాన్ని కించపరచడం.. పరాయి దేశాలను, శత్రుదేశా లను కీర్తించడం భారత్‌లో కమ్యూనిస్టులకే సాధ్యం. దేశ వ్యతిరేక చర్యలు చేస్తే చైనా దేశస్తుడు ఆ దేశంలో ఉండ గలడా? అయినా గతి తప్పిన ఆలోచనలతో– భవిష్యత్తును చూడలేని కమ్యూనిస్టులు పంథా మార్చాలి. గుడ్డిగా విమర్శించడం మాని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి.
- ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి
వ్యాసకర్త బీజేపీ శిక్షణ విభాగం కన్వీనర్, ఏపీ
ఈ–మెయిల్ : mjrinfravishnu@gmail.com
Comments
Please login to add a commentAdd a comment