
బలహీనపడిన తుపాను
విశాఖపట్టణం: క్యాంట్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 220 కిలో మీటర్ల దూరంలో, విశాఖపట్టణానికి దక్షిణ నైరుతి దిశగా 260కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
శుక్రవారం మధ్యాహ్నానికి వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పింది. దీని ప్రభావంగా కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు క్యాంట్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖపట్టణం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కుంభవృష్టిగా కురిసింది.
ప్రస్తుతం విశాఖపట్టణంలో ఆకాశం మేఘావృతమై ఉంది. శ్రీకాకుళం జిల్లాలోనూ అక్కడక్కడా తుపాను ప్రభావంగా చిరుజల్లులు కురిశాయి. దీంతో జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. శనివారం విశాఖపట్టణం వేదికగా భారత్-కివీస్ జట్ల మధ్య సిరీస్ లో ఆఖరి వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.
తుపాను హెచ్చరికలతో చివరి మ్యాచ్ కు ఆటకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సిరీస్ ఫలితం తేల్చే రేపటి మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.