పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశామని, రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో పార్టీ మరింత బలహీనపడిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి ఎంపికచేసిన 70 మంది ముఖ్య కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి వివరించడంతో పాటు ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలకు ఈ శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 15 వేల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలను తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ చేసిన తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేసేందుకు శిక్షణ తరగతులు ఉపకరిస్తాయన్నారు.