
2016 పోరాటాల సంవత్సరమే: కిషన్‌రెడ్డి
ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలపై 2016లో పోరాటాలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హెచ్చరించారు.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలుకోసం 2016లో పోరాటాలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ నేతలు ప్రకాశ్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌లతో కలసి సోమవారం ఆయన రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలతో కలసి సీఎం కేసీఆర్‌ను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ఏడాది సంస్థాగత నిర్మాణ సంవత్సరంగా, వచ్చే ఏడాదిని పోరాటాల సంవత్సరంగా తాము భావిస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థలో శిక్షణకోసం వెళ్తూ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల పట్టుబడటం దీనికి నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులను ఎంఐఎం పెంచి పోషిస్తున్నదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కఠినమైన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. దీనివల్ల హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ప్రమాదం ఉందని హెచ్చరించారు.