హైదరాబాద్ : మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దాదాపు 15 రోజుల విరామం తర్వాత ఇన్పేషంట్ సేవలు శుక్రవారం మళ్లీ ప్రారంభమైనాయి. ఈ రోజు ఉదయం అవుట్ పేషంట్ విభాగానికి వచ్చిన రోగుల్లో 40 మందిని ఇన్పేషంట్లుగా ఆసుపత్రలో చేర్చుకున్నారు. వీరికి సోమవారం శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
సదరు ఆసుపత్రిలో ఇటీవల క్యాటరాక్ట్ శాస్త్రచికిత్స చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని... కేసు నమోదు చేసింది. అలాగే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు కూడా నోటీసులు జారీ చేసింది.