న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటిశుక్లాల తొలగింపు శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటు రెండు వారాల్లోగా తుది నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ సహా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌లతో పాటు డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
కాగా కంటిచూపు మందగించడంతో మెరుగైన చూపుకోసం గత నెల 30న ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్ (ఆర్‌ఎల్)సెలెన్‌వాటర్‌తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్‌ఫెక్షన్ బారినపడగా, వీరిలో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్తో పాటు, లోకాయుక్తా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.