మన హైదరాబాద్ నెం - 4 | Air pollution in the fourth place finish | Sakshi
Sakshi News home page

మన హైదరాబాద్ నెం - 4

Published Wed, Mar 16 2016 11:54 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

మన హైదరాబాద్  నెం - 4

మన హైదరాబాద్ నెం - 4

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి
అధ్యయనంలో వెల్లడి నగర వాసుల ఆరోగ్యానికి పొగ
మేలుకోకపోతే ముప్పు తప్పదు


సిటీబ్యూరో: మహా నగరంపై కాలుష్య రక్కసి దాడి చేస్తోంది. నగర వాసుల ఆరోగ్యాన్ని హరిస్తోంది. అన్ని వయసుల వారినీ మంచాన పడేలా చేస్తోంది. వాయు కాలుష్యంలో దేశంలోని ఐదు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ నగరం నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. సీపీసీబీ తాజా నివేదికలో వాయు కాలుష్యంలో ఎప్పటిలాగానే దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో...      కోల్‌కతా మహా నగరం రెండో స్థానంలో నిలిచాయి. మూడు, నాలుగో స్థానాల్లో ముంబ యి, హైదరాబాద్ ఉన్నాయి. మన పొరుగున ఉన్న చెన్నై, బెంగళూరు మహా నగరాలు ఐదు, ఆరుస్థానాల్లో నిలిచాయి. ప్రధానంగా సూక్ష్మ ధూళి కణాలు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాల మోతాదు పెరగడంతో నగర వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. పలువురి ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినడం...  ఎడతెరిపి లేని దగ్గు... గుండె జబ్బులకు వాయు కాలుష్యమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.

కాలుష్యానికి ప్రధాన కారణాలివే...
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 45 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పదిహేనేళ్లకు పైబడినవి ఆరు లక్షలు. వీటిలో ఆటోలు, బస్సులు, కార్లు, జీపులు, ఇతర రవాణా వాహనాల పొగతో కార్బన్‌మోనాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, ధూళి కాలుష్యం (ఆర్‌ఎస్‌పీఎం) అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న వాటికి తోడు రోజూ కొత్తగా 800 వాహనాలు రోడ్డెక్కుతుండడంతో రహదారులు కిక్కిరిసిపోయి నగరం పొగ చూరుతోంది.

 ప్రధాన రహదారులపై వాహనాల వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోవడంతో ఇంధన వినియోగం బాగా పెరుగుతోంది. మరోవైపు సర్వీసింగ్ చేయకుండానే నడుపుతుండడంతో లక్షలాది వాహనాల నుంచి వెలువడుతున్న పొగ దట్టమైన మేఘాలను తలపిస్తోంది. దీనిలో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు అధికంగా ఉంటున్నాయి. కొన్ని పెట్రోలు బంకుల్లో కల్తీ ఇంధ న విక్రయంతో కాలుష్య కారకాల మోతాదు అధికంగా నమోదవుతున్నట్లు పీసీబీ అధ్యయనంలో తేలింది.

ప్రధాన నగరంలో మెట్రో పనులు జరుగుతున్న నేపథ్యంలో కాంక్రీటు, సిమెంటు మిశ్రమం నుంచి వెలువడే ధూళికణాలు, పిల్లర్ల ఏర్పాటుకు తవ్వకాలు జరుపుతున్నప్పుడు వెలువడే దుమ్ము రేణువులు గాలిలో కలిసి శ్వాసించే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి.మహా నగరంలో నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం..తరచూ రహదారుల మరమ్మతులు, విద్యుత్, టెలిఫోన్, మంచినీరు, మురుగు నీటి పైపులైన్ల కోసం తవ్వకాలతో దుమ్ము, ధూళి కాలుష్యం పెరుగుతోంది.

జలమండలి, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తిచేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నాయి. దీంతో తరచూ ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు అలాగే వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం మరింత పెరుగుతోందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాహనాల వేగానికి రహదారులపై పైకి లేచే దుమ్ము, ధూళి... ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగలో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాల మోతాదు పెరుగుతోందని పీసీబీ నిపుణులు చెబుతున్నారు. పంజగుట్ట, లక్డీకాపూల్, నాంపల్లి, అబిడ్స్, జేఎన్టీయూ, జీడిమెట్ల, జూపార్కు, ప్యారడైజ్, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో అధికంగా వాయు కాలుష్యం నమోదవుతోంది.

వాయు కాలుష్యం నమోదుకు ఫిన్లాండ్ యంత్రం
నగరంలో వాయు కాలుష్యం మోతాదును, గాలిలో సుమారు 250 రకాల కాలుష్య కారకాలను లెక్కించేందుకు ఫిన్లాండ్ దేశానికి చెందిన పోర్టబుల్ ఎయిర్‌క్వాలిటీ మానిటరింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ  పీసీబీ ప్రయత్నిస్తోంది. ఇటీవల బెంగళూరులోని బయోకాన్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన యంత్రాన్ని పీసీబీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. దీని పనితీరు సంతృప్తికరంగా ఉందని వారు ‘సాక్షి’కి తెలిపారు. దీని ఖరీదు సుమారు రూ.70 లక్షల వరకు ఉంటుందని... నగరంలోని ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

అనర్థాలివీ..
వాయు కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాసకోస సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. ఆస్తమా, బ్రాంకైటీస్, హై బ్లడ్‌ఫ్రెషర్, ఊపిరితిత్తుల వృద్ధి రేటు తగ్గిపోవడం తదితర వ్యాధులతో జనం సతమతమవుతున్నారు.  వివిధ ఆస్పత్రులకు వస్తున్న వారిలో 90 శాతానికి పైగా రోగులు వాయు కాలుష్యం బారిన పడుతున్నవారేనని వైద్యులు చెబుతున్నారు.

ఊపిరితిత్తులకు ప్రమాదమే
గాలిలో కలిసి ఉండే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, దుమ్ము, ధూళి రేణువులు సూర్యకిరణాలతో రసాయనిక సంయోగం చెంది ఫొటో కెమికల్ సొల్యూషన్ ఉత్పత్తి అవుతుంది. దీని ప్రభావంతో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేవారే అధికంగా ఉంటున్నారు. వీటి వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా కేసులు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యత, మన్నిక కలిగిన మాస్క్‌లను ధరించడం ద్వారా కొంతవరకు కాలుష్యం నుంచి బయటపడవచ్చు. కొన్నిసార్లు ధూళి రేణులువులు రక్తంతో కలిసిపోయి రక్తప్రసరణకు అడ్డుగా నిలిచి గుండెపోటుకు కారణమయ్యే ప్రమాదం ఉంది. - డాక్టర్ సుధీర్ నడింపల్లి, పల్మనాలజిస్టు,సన్‌షైన్ ఆస్పత్రి

సీపీసీబీ తాజా లెక్కల ప్రకారం గ్రేటర్‌లో కాలుష్య కారకాల మోతాదు ఇలా...
ప్రతి ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ చాలా ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాములకు మించడం గమనార్హం. ఘనపు మీటరు గాలిలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదు ఒక గ్రాముకు మించరాదు. కానీ చాలా ప్రాంతాల్లో 3 గ్రాములుగా నమోదైంది.   ఘనపు మీటరు గాలిలో సల్ఫర్‌డయాక్సైడ్ మోతాదు 80 గ్రాములకు మించరాదు. చాలా ప్రాంతాల్లో వంద గ్రాములు దాటడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement