వైఎస్సార్‌సీపీలోకి ఆనం సోదరుడు
జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆనం విజయకుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో ఆనం వర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ రాజకీయాలు నడుపుతూ వచ్చిన ఆనం విజయకుమార్‌రెడ్డి (నాలుగో సోదరుడు) బుధవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చిన ఆనం వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డి ఇటీవల టీడీపీలో చేరినా విజయ్ వారివెంట వెళ్లలేదు. అన్నలిద్దరినీ విభేదిస్తూ తన కుమారుడు కార్తికేయరెడ్డి, మరికొందరు ముఖ్య అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. విజయ్ తన కుమారుడు, అనుచరులతో ఉదయం జగన్ నివాసానికి వచ్చి ఆయనను కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. జగన్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హామీలు నెరవేర్చని పార్టీలోకి ఎవరు పోతారు?: మేకపాటి
ఎన్నికలపుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబు పార్టీలోకి ఎవరు పోతారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. విజయ్ చేరిక సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ వారెవ్వరూ టీడీపీవైపు కన్నెత్తి చూడరని చెప్పారు. తాను తొలి నుంచీ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానినని, అయితే తన అన్నల చాటున రాజకీయం చేస్తూ వచ్చాను కనుక బయటకు రాలేక పోయామని విజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు.