
నాయకా.. ఇదీ జన ఎజెండా..
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ
కోటి ఆశలతో ప్రజల ఎదురు చూపులు
ప్రతినిధులు తమ గళాన్ని వినిపించాలని వేడుకోలు
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేస్తాం.. ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, అధునాతన షాపింగ్‌కాంప్లెక్స్‌లు నిర్మిస్తాం.. గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి నీటి సమస్యను తీరుస్తాం.. హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేస్తాం.. అంటూ పాలకులు ఇస్తున్న హామీలు నెరవేరుతాయా..? ఏళ్లతరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ప్రజాప్రతినిధులు తమ వాణిని వినిపిస్తారా? కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరుగుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల్లో వీటికి పరిష్కారం లభిస్తుందా..? గ్రేటర్ వాసులు
ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘సాక్షి’ ప్రజల కష్టాలను సభ ముందుంచే ప్రయత్నం చేసింది.
‘నాయకా.. ఇదీ జనం ఎజెండా’ అంటూ సమస్యలపై ఫోకస్ పెట్టింది..
అమలుకు నోచుకోని ఎన్నో హామీలు...ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వెలగని వీధి దీపాలు, పొంగి పొర్లుతున్న నాలాలు, నానాటికి తీవ్ర మవుతున్న విద్యుత్ కోతలు, విజృంభిస్తున్న విష జ్వరాలు, ఆసుపత్రుల్లో అందుబాటులో లేని మందులు, పట్టించుకోని అధికారులు...ముందుకు సాగని ‘మెట్రో’ పనులు, వెరసి ఇదీ భాగ్యనగర వాసుల బతుకు చిత్రం...ఈ నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ ఇబ్బందులపై తమ పక్షాన ఎమ్మెల్యేలు గళ మెత్తుతారని...తమ క ష్టాలకు పాలకులు ఒక పరిష్కారం చూపుతారని నగర సగటు జీవి ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు..అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్‌ను పట్టి పీడిస్తున్న సమస్యలపై సాక్షి’ జన ఎజెండా..!
‘మెట్రో’కల నెరవేరాలి..!
గ్రేటర్ వాసుల కలల ప్రాజెక్టుగా పేరొందిన ‘మెట్రో’పనులను సకాలంలో పూర్తిచేసి రైలు ప్రయాణ భాగ్యం కల్పించాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఈ నెల 21 ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం వాయిదా పడటం, పాతనగరంలో అలైన్‌మెంట్ మార్పులు, నిర్మాణ సంస్థ, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం, ఆస్తుల సేకరణ లో జాప్యం, మెట్రో పనుల కారణంగా ట్రాఫిక్ చిక్కులు, గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి కాకపోవడంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నారు. నాగోల్-మెట్టుగూడ మార్గంలో పూర్తయిన 8 కి.మీ మార్గం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించలేదని నిర్మాణ సంస్థ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ స్టేషన్ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించేందుకు ఒలిఫెంటా బ్రిడ్జి, ఆలుగడ్డబాయి, చిలకలగూడ ప్రాంతాల్లో మూడు ఆర్‌ఓబీలు నిర్మించాల్సి ఉన్నందున మరో ఏడాది పైగా పట్టనుంది. దీంతో 2016 డిసెంబరులోగా ప్రాజెక్టు ప్రారంభంపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తాజా సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పాతనగరంలో జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో ఇప్పటికే ఉన్న 14.3 కి.మీ మార్గంలో అలైన్‌మెంట్ మార్పు చేయడంతో దూరం 3.2 కి.మీ మేర పెరిగింది. కొత్త రూట్‌లో ప్రాజెక్టును చేపడితే వాణిజ్య పరంగా ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుందనే అంశంపై ఎల్‌అండ్‌టీ అధ్యయనం చేస్తోంది. త్వరలో పాతనగరం సహా ఎల్బీనగర్-మియాపూర్,నాగోల్-శిల్పారామం రూట్లలో వచ్చే ఏడాదైనా మెట్రో ప్రాజెక్టును ప్రారంభించాలని సిటీజన్లు భావిస్తున్నారు. పనులను వేగవంతం చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
వాటర్ గ్రిడ్ కావాలి..దాహార్తి తీరాలి...
మహానగరం పరిధిలో సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరాకు పైప్‌లైన్ వ్యవస్థ, స్టోరేజీ రిజర్వాయర్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ మంజూరుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని తక్షణమే పూర్తిచేయాలని, అందుకు ప్రస్తుత బడ్జెట్‌లో సర్కారు రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని సిటీజన్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటడం, జలమండలి సరఫరా నెట్‌వర్క్ లేకపోవడంతో శివార్ల గొంతెండుతోంది. పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉన్న కొన్ని ప్రాంతాలకు సైతం పది, ఇరవై రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం గోదావరి మొదటిదశ మంచినీటి పథకం, కృష్ణా మూడోదశ పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి జనం దాహార్తిని తీర్చాలని నగరవాసులు కోరుకుంటున్నారు. మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలో డ్రైనేజీ వసతి లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లో డ్రైనేజీ వసతుల కల్పనకు మరో రూ.3 వేల కోట్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేయాలి
ప్రభుత్వ , యూసీఎల్ స్థలాల్లో అభ్యంతరకర ఇళ్ల క్రమబద్ధీకరణకు జారీ చేసిన 58 జీవో ప్రకారం హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో 1,89,243 మంది ఉచిత క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌లో 50 శాతానికిపైగా, రంగారెడ్డిలో 40 శాతం దరఖాస్తులు అభ్యంతరకరమైనవిగా పేర్కొంటూ కొర్రీలు పెడుతుండడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. హైదారాబాద్ జిల్లాలో 64,243 దరఖాస్తులు రాగా, 35,700 దరఖాస్తులను పక్కకు పెట్టారు. నగరంలో యూసీఎల్‌కు సంబంధించిన స్థలాలు కోనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పడు అన్ని విధాలుగా సహకరించిన అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరతో మళ్లీ క్రమబద్ధీకరించుకోవాలని పేర్కొనటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీసీఎల్‌ఏ, యూసీఎల్ కార్యాలయాల వద్ద అందోళనలు నిర్వహించారు. అయినా అధికార యంత్రాంగంలో మార్పు రాకపోగా, ఆ ఇళ్లకు నోటీసులు ఇచ్చి, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించడంపై తీవ్ర నిరసనలు వ్యక్త మవుతున్నాయి.ఈ అంశంపై వామపక్షాలతో సహా ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చించేందుకు సన్నద్ధమవుతున్నారు. వాస్తు పేరుతో గ్రేటర్‌లోని పలు కార్యాలయాలను సుదూర ప్రాంతాలకు తరలించటం, 59 జీవో ప్రకారం సొమ్ము చెల్లించే ఇళ్ల క్రమబద్ధీకరణకు ఆశించిన స్పందన రాలేదనే కారణంతో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భూములను విక్రయించాలనే ప్రభుత్వ యోచనపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశాలున్నాయి.
వైద్యరంగాన్ని గాడిలో పెట్టాలి
పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతిష్టాత్మక దవాఖానాలకు జబ్బు చేసింది. ఎబోలా, స్వైన్ ఫ్లూ వంటి ప్రమాదకరమైన వైరస్‌లే కాదు...సాధారణ డెంగీ, మలేరియా జ్వరాలతో సిటిజన్లు విలవిల్లాడుతున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి చేరినసామాన్యులకు ప్రాణాలపై కనీస భరోసా ఇవ్వలేక పోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో ఉస్మానియా రూ.100, నిమ్స్‌కు రూ.200, గాంధీకి రూ.100, నిలోఫర్‌కు రూ.30, సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి రూ.25, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రికి రూ.25, ఈఎన్‌టీకి రూ.10, సరోజినిదేవి కంటి ఆస్పత్రికి రూ.10, ఛాతి, మాన సిక ఆస్పత్రులకు రూ.10 కోట్ల చొప్పున కేటాయించింది. అయితే ఆ నిధుల్లో ఇప్పటివరకు సగం కూడా విడుదల చేయక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వైన్‌ఫ్లూ నియంత్రణలో భాగంగా గాంధీ సహా, ఉస్మానియా, ఫీవర్, నిమ్స్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు ఘనంగా ప్రకటించినా..గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో మినహా ఎక్కడా పూర్తి స్థాయి వసతులు లేకపోవడంతో కేవలం రెండు మాసాల్లోనే 50 మందికిపైగా మృత్యువాత పడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో చూపిన చొరవ నిధుల మంజూరులో చూపించి ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగాలను పునరుద్ధరించాలని సీనియర్ వైద్య నిపుణులతో పాటు రోగులు కోరుతున్నారు.
చీకట్లోనే 21 ఆస్పత్రులు
గ్రేటర్(హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్) పరిధిలో 96 ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వీటిలో పంజాషా-1, యాకుత్‌పుర-2, మెట్టుగూడ, మలక్‌పేట్, ఆగపురా, గగన్‌మహల్, నిలోఫర్ యూనిట్ ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడం తో నర్సులే రోగులకు దిక్కవుతున్నారు. మాదన్నపేట్, గగన్‌మహల్, డీబీఆర్‌మిల్స్, చింతల్‌బస్తీ, అఫ్జల్‌సాగర్, శాంతినగర్, ఆగ పురా, కార్వాన్ -2, పానిపురా, పురాణాపూల్-2, మహరాజ్ గంజ్, దూద్‌బౌలి, భోలక్‌పూర్, మెట్టుగూడ, బోయగూడ, శ్రీరాంనగర్ , వినాయక్‌నగర్ , తారామైదాన్(జూపార్క్ ఎదరుగా), కుమ్మరివాడి, తీగల్‌కుంట, చందలాల్ బారాదరి ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు 2013 మార్చి నుంచి 2014 సెప్టెంబర్ వరకు విద్యుత్ బిల్లులు చెల్లించక పోవడంతో ఆయా ఆస్పత్రులకు విద్యత్ సరఫరా నిలిపివేయడంతో గత ఎనిమిదినెలలుగా అవి చీకట్లోనే మగ్గుతున్నాయి.
రైల్వే పనులు ముందుకు సాగాలి
కేంద్రరాష్ట్రాల మధ్య నిధులు, వనరులతో ముడిపడి ఉన్న అనేక రైల్వే ప్రాజెక్టులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశే ఇందుకు ఉదాహరణ. సుమారు రూ.850 కోట్లతో కూడిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ర్టప్రభుత్వం 2/3 వంతున, రైల్వేశాఖ 1/4 వంతు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం గత రెండేళ్లలో రాష్ర్ట ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లు మాత్రమే అందజేసింది. మరోవైపు పటాన్‌చెరు-తెల్లాపూర్, మేడ్చెల్-బోయిన్‌పల్లి మార్గాల్లో రెండో దశ పనులు జరుగుతున్నప్పటికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంపై ఏడాది కాలంగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ వివాదానికి తెరదించి రైల్వే మార్గాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.
ఊసేలేని భారీ టర్మినళ్లు...
హైదరాబాద్ న గరానికి ప్రతి రోజు వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లో ప్రయాణికులు తాకిడిని తట్టుకునేందుకు మౌలాలీ, వట్టినాగులపల్లిలో రెండు భారీ ప్రయాణికుల టర్మినళ్లు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే అందుకు సంబందించి ఇప్పటివరకు స్థలం కేటాయించకపోవడంతో రైల్వేశాఖ బడ్జెట్‌లో టర్మినళ్ల ప్రతిపాదన చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
నత్తనడకన ఆర్‌ఓబీలు,ఆర్‌యూబీలు...
జీహెచ్‌ఎంసీ, రైల్వేశాఖ సంయుక్తం తుకారంగేట్, ఆనంద్‌బాగ్, సఫిల్‌గూడ,ఉప్పుగూడ,కందికల్‌గేట్,ఆలుగడ్డబావి, తదితర ప్రాంతాల్లో ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మిం చాలని ప్రతిపాదించారు.వీటిలో కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతుండగా, మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మెట్రో పనుల కారణంగా ట్రాఫిక్ పద్మహ్యూహాన్ని తలపిస్తోంది. దానికితోడు రైల్వేగేట్ల కారణంగా వాహనాలకు బ్రేకులు పడుతున్నాయి. ఈ ఏడాదైనా ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీ నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.
మైనార్టీలకు పెద్ద పీట వేయాలి
రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమం, అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరుగుతున్నా... విడుదల నత్తను తలిపిస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు కనీసం 23 శాతానికి మించి నిధులు విడుదల కాలేదు. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన బడ్జెట్‌లో సుమారు రూ.480 కోట్లు మురిగిపోగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం నిధుల వినియోగంపై సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బ్యాంకింగ్ లింకేజీ రుణాల ఊసే లేకుండాపోగా, గతేడాది దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. షాదీముబారక్ పథకం అమలుపై నీలి నీడలు అలుముకున్నాయి. ఈ పథకానికి వచ్చి దరఖాస్తుల్లో సగానికిపైగా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్దూ అమలు ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. మైనార్టీలకు విద్యా, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్ అమలు కేవలం కమిషన్ ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పటికే సచార్, మిశ్రా కమిషన్లు మైనార్టీల ఆర్ధిక,సామాజిక స్థితిగతులపై సర్వే చేసి నివేదికలు సమర్పించినా, ప్రభుత్వం తాజాగా మరో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు వక్ఫ్ భూముల, ఆస్తుల పరిరక్షణ హౌస్ కమిటీలకే పరిమితం కాగా, గతంలో పార్లమెంటరీ, అసెంబ్లీ కమిటీలు వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై సర్వే చేసి సమర్పించిన నివేదికలు పత్తా లేకుండా పోయాయి. మరోమారు హౌస్ కమిటీ వేశారు. మైనార్టీ ఇంజనీరింగ్ కళాశాలలకు ఈ విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు లభించకపోవడంతో సుమారు 20 వేల మైనార్టీ విద్యార్ధులకు ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు లేకుండా పోయాయి. మైనార్టీ విద్యార్ధుల ఫీజు రీయంబర్స్‌మెంట్ పెండిం గ్‌లో మగ్గుతూనే ఉన్నాయి.
నిధులపై స్పష్టత ఇవ్వాలి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌కు వచ్చిన వారు అచ్చెరువొందేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బహిరంగ ప్రకటన చేశారు. అందులో భాగంగా విశ్వనగరం దిశగా పలు ప్రాజెక్టులనూ ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. వాటిల్లో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలనుంచి మొదలు పెడితే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో స్కైవేల దాకా వీటిల్లో ఉన్నాయి. వాటన్నింటికీ రూ. వేల కోట్ల నిధులు కావాల్సి ఉంది. వాటిని ఎలా తెస్తుందో.. ఎక్కడి నుంచి ఇస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొత్త ప్రాజెక్టుల సంగతలా ఉండగా, నగరజీవికి అవసరమైన కనీస మౌలికసదుపాయాల కల్పన పనులు ముందుకు సాగడం లేదు..
ఆయా సమస్యలపై సంక్షిప్తంగా.. అధ్వాన్నపు రహదారులు..
గ్రేటర్‌లో 7వేల కి.మీ.ల మేర రహదారులున్నప్పటికీ, వీటిల్లో వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తప్ప మినహా మిగతా రోడ్లన్నీ గుంతల మయం. అధ్వాన్నపు రహదారులపై ప్రయాణాలతో ప్రజలు వెన్నునొప్పి నుంచి మొదలుపెడితే వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు. బాటిల్‌నెక్స్ ప్రాంతాల్లోని ట్రాఫిక్‌జామ్‌లతో నిత్యనరకం అనుభవిస్తున్నారు.
తీరని చెత్త సమస్య..
గ్రేటర్ నుంచి రోజుకు దాదాపు 3700 మెట్రిక్‌టన్నుల చెత్త వెలువడుతుండగా, నిల్వ చేసేందుకు అవసరమైనన్ని కుండీలు లేవు. దీనికితోడు డబ్బాల్లో నిండిన చెత్తను సైతం ఎప్పటికప్పుడు డంపింగ్‌యార్డుకు తరలించకపోవడంతో పరిసరాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఇంటింటినుంచి చెత్తను సేకరించేందుకు అవసరమైనని ట్రైసైకిళ్లు లేవు.
నడిచే దారేదీ.. ?
నగరంలో మాత్రం పాదచారులు నడిచేందుకు దారి లేదు. అనేక ప్రాంతాల్లో ఫుట్‌ఫాత్‌లే లేకపోగా, ఉన్న చోట్ల సైతం దుకాణాలు వెలసి ప్రజలకు నడిచే దారి లేదు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలపై హైకోర్టు మందలించినా పరిస్థితిలో మార్పులేదు.
పార్కింగ్ సదుపాయాల్లేవు..
నడిచే వారికే కాక వాహనాలున్నవారికీ బాధలు తప్పడం లేవు. వివిధ అవసరాల నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు పార్కింగ్ సదుపాయం లేక వారి బాధలు వర్ణనాతీతం. అటు వాణిజ్యసంస్థలు తగిన పార్కింగ్ సదుపాయం కల్పించక, ఇటు జీహెచ్‌ఎంసీ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు చేయక వాహనాలెక్కడ నిలపాలో తెలియక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
పబ్లిక్‌టాయ్‌లెట్స్..లేవు.
నగర ప్రజల అవసరాలకు తగిన విధంగా అవసరమైనన్ని పబ్లిక్‌టాయ్‌లెట్లు లేక ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. వెయ్యి టాయ్‌లెట్ల ఏర్పాటు చేస్తామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
ఇంకా, మూతల్లేని మ్యాన్‌హోళ్లు.. సదుపాయాలు లేని శ్మశానవాటికలు.. నిర్వహణ లేని కమ్యూనిటీ హాళ్లు. ఇలా ఎన్నెన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కట్..కటా!
గ్రేటర్‌లో విద్యుత్ కనెక్షన్ల వివరాలు ఇలాః
మొత్తం విద్యుత్ కనెక్షన్లు 37.90 లక్షలు
గృహ విద్యుత్ కనెక్షన్లు 30.90 లక్షలు
వాణిజ్య కనె క్షన్లు 5.50 లక్షలు
చిన్న, మధ్య తరహా,
భారీ పరిశ్రమలు 40 వేలు
అడ్వైర్‌టైజ్‌మెంట్లు, స్ట్రీట్‌లైట్స్ 40 వేలకుపైనే
లైన్లను ఎప్పటికప్పుడు పునరుద్ధరించక పోవడం, ప్రజావసరాలకు అనుగుణంగా కొత్తలైన్లు వేయక పోవడంతో పాతబస్తీ వాసులు నేటికీ నిజాం కాలం నాటి లైన్ల మీదే ఆధారపడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ స్థంభాలు శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్న గాలికే సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ పోల్స్‌కు సపోర్టింగ్‌గా ఏర్పాటు చేసిన వైర్లు ముట్టకుంటే షాక్ కొడుతుండటంతో అమాయకులు బలవుతున్నారు.
ఉంటే ఉలుకరు...పోతే పలకరుః
బెంగళూర్ , బొంబాయి వంటి మెట్రో నగరాల్లో 80 శాతం భూగర్భలైన్లు ఉండగా.. హైదరాబాద్‌లో 10 శాతం కూడా లేదు. నాశీర కం యూజీ, ఏబీ కేబుల్స్ వాడుతుండటంతో అవి త్వరగా పాడైపోతున్నాయి. సరఫరాలో తలెత్తే లోపాలను వెంటనే గుర్తిం చేందుకు అవసరై మెన ‘జియోగ్రాఫికల్ ఇన్పర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)’నేటికీ అమల్లోకి రాలేదు. విద్యుత్ ప్రమాదాలు, కోతలు, ఇతర సమస ్యల పై వినియోగదాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డిస్కం 1219 సర్వీసు నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి సర్కిల్‌కు ఒక ఫ్యూజ్ ఆఫ్ కాల్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వాటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు.
కాంట్రాక్టర్లే అడ్డు..
గ్రేటర్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగు పర్చేందుకు కేంద్రం ఆర్-ఏపీడీఆర్‌పీ పథకం కింద టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు 2011 లో రూ.806.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఒక్క గ్రేటర్‌లోనే రూ.143. 84 కోట్లతో అరువైనాలుగు 33/11కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించింది. అయినా నేటికీ రీఛార్జీకి నోచుకోలేదు. ఆపరేటర్ల ఎంపికపై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడమే ఇందుకు కారణం.దీంతో లోఓల్టేజీతో ఆయా ప్రాంతాల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశ్వనగరం.. వైఫైసిటీ.....ఎంతటి ఖ్యాతిగాంచిన నగరమైతేనేమీ...చిన్న ఈదురుగాలికే గజగజ వణికి పోతోంది. ఎండ ముదిరి నా...గాలివీచినా...వర్షం కురిసినా...గ్రేటర్‌లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలుతోంది. మెరుగైన సరఫరా కోసమంటూ అధికారులు చేస్తున్న నెలవారీ సమీక్షలు...ముందస్తు హడావుడి చిన్న ఈదురుగాలి ముందు బలాదూరే. చిన్నచిన్న అంశాలకే కుప్పకూలుతున్న గ్రేటర్ విద్యుత్ వ్యవస్థ మెరుగు పర్చే దిశగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నగరవాసులు కోరుతున్నారు.