బచావత్ నుంచి బ్రిజేశ్ దాకా..
కృష్ణా నీళ్లపై దశాబ్దాలుగా కొనసాగుతున్న లొల్లి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంపై 1969లో ఆర్‌ఎస్ బచావత్ ఆధ్వర్యంలో కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1973లో తీర్పు వెల్లడించింది. దీన్ని పునఃపరిశీలించాల్సిందిగా 2002లో ఉమ్మడి ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలు సుప్రీంకోర్టును కోరాయి. దాంతో 2004 ఏప్రిల్‌లో బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలో కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యున ల్ ప్రస్తుతం వరకు కొనసాగుతూ వస్తోంది.
కృష్ణా జలాల వివాదాల కథ ఇదీ..
⇔ ఏప్రిల్ 10, 1969: జస్టిస్ బచావత్ నేతృత్వంలో కృష్ణా జల వివాదాల పరిష్కార మండలి (కేడబ్ల్యూడీటీ-1)ని కేంద్రం ఏర్పాటు చేసింది
⇔ డిసెంబర్ 13, 1973: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీ చేస్తూ బచావత్ ట్రిబ్యునల్ కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది
⇔ మే 31, 1976: కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్‌కు 811(నీటి పునర్వినియోగంతో కలపి) టీఎంసీలు కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పునిచ్చింది. మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఉంటుందని తేల్చి చెప్పింది. మే 31, 2000 తర్వాత ఈ తీర్పును పునఃసమీక్ష చేయవచ్చునని పేర్కొంది.
⇔ ఏప్రిల్ 2, 2004: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు బచావత్ తీర్పును పునఃసమీక్షించాలని కోరడంతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ ఎస్పీ శ్రీవాత్సవ, జస్టిస్ డీకే సేత్‌లు సభ్యులుగా కృష్ణా జల వివాదాల పరిష్కార మండలి(కేడబ్ల్యూడీటీ-2)ను కేంద్రం ఏర్పాటు చేసింది
⇔ డిసెంబర్ 30, 2010: బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపులపై పునఃసమీక్ష చేయకుండా.. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 911, ఆంధ్రప్రదేశ్‌కు 1001 టీఎంసీలు కేటాయించింది. మిగుల జలాలపై ఉన్న హక్కును రద్దు చేయడంతో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది
⇔సెప్టెంబర్ 16, 2011: తాము తీర్పు ఇచ్చే వరకూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయకూడదని.. గెజిట్ ప్రచురించకూడదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది
⇔నవంబర్ 29, 2013: మొదటి తీర్పును సవరిస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది తీర్పునిచ్చింది. కర్ణాటకు కేటాయించిన జలాల్లో 4 టీఎంసీలను మాత్రమే ఏపీకి అదనంగా కేటాయించింది
⇔జనవరి 16, 2014: కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో అన్యాయం జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నీటిని పంపిణీ చేయాలని.. మిగుల జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కును కొనసాగించాలని కోరింది. ఇదే సమయంలో తమకు కేటాయించిన నీటిలో 4 టీఎంసీలు కోత వేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలంటూ మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించాయి
⇔ ఫిబ్రవరి 20, 2014: ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ విభజన చట్టంలో సెక్షన్ 89లో కేంద్రం పేర్కొంది
⇔ ఆగస్టు 1, 2014: ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును మరో రెండేళ్లు పొడగించింది
⇔ ఆగస్టు 1, 2016: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువు ముగియడంతో మరో ఆర్నెళ్లు పొడగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది
⇔ సెప్టెంబర్ 8, 2016: కృష్ణా జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ పంపిణీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కోరాయి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే నీటిని పంపిణీ చేయాలని.. మిగులు జలాలపై హక్కును తమకే వదిలేయాలని ఏపీ, తెలంగాణ వాదించాయి. వీటిని మహారాష్ట్ర, కర్ణాటక వ్యతిరేకించాయి. ఏపీ, తెలంగాణ వాదనలను పరిగణనలోకి తీసుకోని కేంద్రం.. మహారాష్ట్ర, కర్ణాటకలకు వంత పాడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్యే నీటిని పంపిణీ చేయాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, సుప్రీంకోర్టుకు అఫిడవిట్లు సమర్పించింది.
⇔ అక్టోబర్ 19, 2016: కృష్ణా జలాల పునఃపంపిణీ ఏపీ, తెలంగాణలకు మాత్రమే పరిమితమని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రెండు వారాల్లోగా అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఏపీ, తెలంగాణకు సూచించింది.