=బడా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్న అధికారులు
=కనీస షెడ్డు లేని వారికి ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు పనుల అప్పగింత
=ప్రతిఫలంగా ఒక్కో కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలకుపైగా వసూలు
=తీవ్రంగా నష్టపోతున్న చిరు కాంట్రాక్టర్లు
సాక్షి,సిటీబ్యూరో: సెంట్రల్ డిస్కంలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల పనులకు‘టెండర్’ వేశారు. కాంట్రాక్టర్ల మధ్య పోటీని పెంచాల్సిన అధికారులు చిన్నచిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపి పోటీ నుంచి తప్పిస్తున్నారు. కనీసం షెడ్డు కూడా లేని వ్యక్తులకు నాలుగు నుంచి ఐదు టెండర్లు కట్టబెడుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో కాంట్రాక్టర్ రూ.రెండు లక్షలకుపైగా అధికారులకు ముట్టజెప్పుతుండడం విశేషం.
రంగారెడ్డిలోని ఓ సీజీఎం స్థాయి అధికారి మొదలు డిస్కంలోని పలువురు డెరైక్టర్లకు ఇందులో ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 11 సర్కిళ్లు ఉండగా, వీటిలో 138 ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. ఆయా సర్కిళ్ల పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కోసం మింట్‌కాంపౌండ్‌లోని సీసీఎం ఆర్‌ఆర్ కార్యాలయం 2012 డిసెంబర్‌లో ఓపెన్ టెండర్లు పిలిచింది. ఇందుకు కనీసం రెండేళ్ల అనుభవాన్ని నిర్ధేశించారు. దీంతో కొంతమంది ఔత్సాహిక చిరు కాంట్రాక్టర్లుసీఎండీని కలిసి ఈ నిబంధనల నుంచి తమకు సడలింపు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన అంగీకరించడంతో 70కిపై గా టెండర్లు దాఖలు అయ్యాయి.
అక్రమాలకు పాల్పడుతున్నారిలా..: అయితే అప్పటికే వేర్వేరు డివిజన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఏడాదిన్నర నుంచి మరమ్మతులు చేస్తున్నారు. శాశ్వత షెడ్డు నిర్మాణం, సిబ్బంది, ఇతరత్రా వసతుల కోసం ఒక్కొక్కరు భారీగా ఖర్చు పెట్టారు. తీరా గడువు దగ్గర పడటంతో రెండేళ్ల అనుభవాన్ని సాకుగా చూపి, వీరందరి జీవితాలను రోడ్డుపాలు చేశారు. గుత్తేదారుల మధ్య పోటీని పెంచాల్సిన అధికారులు బడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కనీసం షెడ్డు కూడా లేని ఒక్కో కాంట్రాక్టర్‌కు నాలుగు నుంచి ఐదు పనులు అప్పగిస్తున్నారు. పైరవీలతో పనులు దక్కించుకున్న వీరు కమీషన్‌పై సబ్‌కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతూ అక్రమాలకు తెరలేపుతున్నారు. చిన్నపాటి మరమ్మతులను పెద్దగా చూపుతూ భారీగా దండుకుంటున్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కారు: డిస్కం పరిధిలోని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15 శాతం,ఎస్టీలకు 6శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీలకు వ్యక్తిగత కాంట్రాక్టుల్లో రూ.లక్షవరకు, సొసైటీలకు రూ.మూడు లక్షల వరకు ధరావతు మినహాయింపు కల్పించినా అధికారులు వీటిని అమలు చేయడం లేదని, దీంతో ఆవర్గం చిరు కాంట్రాక్టులు భారీగా నష్టపోవాల్సి వస్తోందని విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు గోపి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ లెసైన్స్‌బోర్డు సభ్యుడు నక్క యాదగిరిలు చెప్పారు.
డబ్బు కొట్టు..పని పట్టు
Published Fri, Dec 6 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement