మృత్యు గుంత!
మెట్రో పిల్లర్ గుంతలో పడి బాలుడు మృతి
మోండా మార్కెట్ ప్రాంతంలో ఘటన
పిల్లర్ కోసం 40 అడుగుల గుంత తవ్వి తొమ్మిది నెలలుగా అలాగే వదిలేసిన వైనం
వర్షాలతో నీటితో నిండిపోయిన గుంత..
ఆడుకుంటూ వెళ్లి మునిగిపోయిన బాలుడు
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
హైదరాబాద్: మెట్రో రైలు అధికారుల నిర్లక్ష్యం తొమ్మిదేళ్ల బాలుడిని బలి తీసుకుంది.. పిల్లర్ కోసం తవ్వి వదిలేసిన 40 అడుగుల గుంత ఆ చిన్నారి ప్రాణాలను మింగేసింది. హైదరాబాద్‌లోని మోండా మార్కెట్ ప్రాంతంలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఇంటిపెద్దను కోల్పోయి దీనావస్థలో ఉన్న ఆ కుటుంబం.. ఈ ఘటనతో మరింతగా కుంగిపోయింది. సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ ప్రాంతంలో పాత గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉండే ఫుట్‌పాత్ పక్కన జ్యోతి, శ్యాంబాబు అనే దంపతులు గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. వారికి నరసింహ (9), కీర్తి, శ్యాంప్రకాశ్ అనే ముగ్గురు పిల్లలున్నారు. శ్యాంబాబు గతేడాది డిసెంబర్‌లో అనారోగ్యంతో మరణించాడు. దాంతో జ్యోతి అక్కడే పాత బట్టలు కుడుతూ.. తన తల్లిని, ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. పెద్ద కుమారుడు నరసింహ మార్కెట్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు.
గురువారం మధ్యాహ్నం నరసింహ, మరికొందరు పిల్లలు ఆడుకుంటూ.. పాతగాంధీ ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న మెట్రోస్టేషన్ ప్రాంగణంలోకి వెళ్లారు. అక్కడ తొమ్మిది నెలల కింద మెట్రో పిల్లర్ కోసం సుమారు 40 అడుగుల లోతు గుంతను తవ్విన అధికారులు.. తర్వాత అలాగే వదిలేశారు. ఇటీవలివర్షాలకు ఆ గుంత నీటితో నిండిపోరుు ఉంది. దాన్ని గమనించని బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆ గుంతలో పడిపోయాడు. అది చూసిన తోటి పిల్లలు స్థానికంగా ఉన్న వారికి చెప్పడంతో కొందరు నీళ్లలోకి దిగి బాలుడిని బయటకు తీశారు. కానీ నరసింహ అప్పటికే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మార్కెట్ ఇన్‌స్పెక్టర్ మట్టయ్య, ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మెట్రో అధికారుల నిర్లక్ష్యం
మెట్రో పిల్లర్ కోసం అధికారులు దాదాపు తొమ్మిది నెలల కింద 40 అడుగుల లోతు గుంత తవ్వారు. తర్వాత అలాగే వదిలేశారు. దాన్ని పూడ్చలేదు.. చుట్టూ కనీసం రక్షణ ఏర్పాట్లూ చేయలేదు. దీంతో వాన నీళ్లు, డ్రైనేజీ నీటితో గుంత నిండిపోరుుంది. ఆ గుంత పక్కనుంచే మెట్రో కార్మికులు చిన్న దారిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన గేటు నుంచి వెళితే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండటంతో ఈ చిన్నదారి ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. నరసింహ కూడా ఈ చిన్నదారి ద్వారా బయటకు వెళ్లేందుకు వచ్చి గుంతలో పడిపోరుు ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు బాలుడు చనిపోరుున తర్వాత అధికారులు హడావుడిగా ఆ దారిని మూసేశారు. ఆ గుంతను కూడా పూడ్చేందుకు ప్రయత్నించగా.. ముందు బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు అడ్డుకున్నారు. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన మేరకు మృతి చెందిన నరసింహ కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు మెట్రో అధికారులు అంగీకరించారు.
బాలుడు పడి మరణించిన మెట్రో పిల్లర్ గుంత