
గగన విహారానికి బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: గగనతలం నుంచి భాగ్యనగరం అందాలను వీక్షించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన హెలీ టూరిజం-జాయ్ రైడ్స్ ప్రాజెక్టు దాదాపుగా అటకెక్కింది. కనీసం ఒక్క బుకింగ్ కూడా రాకపోవటంతో ప్రాజెక్టును పర్యాటక శాఖ తాత్కాలికంగా రద్దు చేసుకుంది. హుస్సేన్‌సాగ ర్ తీరంలో నెక్లెస్‌రోడ్డు వైపు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను మూసేసింది. మరోసారి హెలికాప్టర్ ట్రిప్పుల ను పునరుద్ధరించాలని పర్యాటక శాఖ చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు కూడా స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
డోలాయమానంలో సీ ప్లేన్ ప్రాజెక్టు...
జాయ్ రైడ్స్ విఫలం కావటంతో దాని ప్రభావం ‘సీ-ప్లేన్’ ప్రాజెక్టుపైనా పడింది. నీళ్లు, భూమి.. రెంటినీ రన్‌వేగా చేసుకొని గాలిలోకి ఎగిరే చిన్నవిమానాల (సీ ప్లేన్)ను కూడా పరిచయం చేయాలని పర్యాటక శాఖ భావించింది. తెలంగాణలో ఒక్క హైదరాబాద్ మినహా మరెక్కడా విమానాశ్రయాలు లేవు. దీంతో ఈ ప్రాంతంలోని పట్టణాలకు తొందరగా వెళ్లాలనుకునేవారికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుందని ఆశించింది. హుస్సేన్‌సాగర్ నుంచి గాలిలోకి ఎగిరే సీ ప్లేన్ కరీంనగర్ ఎల్‌ఎండీ నీళ్లలో, వరంగల్ వడ్డేపల్లి చెరువులో సులభంగా దిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్ పట్టణాలకు వెళ్లేవారు దీనిపై ఆసక్తి చూపుతారని అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లన్నీ చేశాక జాయ్ రైడ్ తరహాలోనే ఇది విఫలమైతే ఏంచేయాలన్న ఆలోచనతో ఈ ప్రాజెక్టునూ తాత్కాలికంగా పక్కనపెట్టారు.
టికెట్ ధర ఎక్కువగా ఉందనే...
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో హెలిటూరిజానికి పర్యాటక శాఖ రూపకల్పన చేసింది. అయితే కేవలం 10 నిమిషాల పర్యటనకు రూ.3,500 వరకు చెల్లించాల్సి రావటం, కనీసం ఆరుగురు ఉం టేనే ట్రిప్పు ఉండే మెలిక దానికి ఇబ్బందిగా మారింది. అంత ధర పెట్టడం మధ్య, దిగువ తరగతుల వారి కి ఇబ్బందిగా మారింది. ఎగువ తరగతి ప్రజలకు విమాన ప్రయాణాలు సాధారణమే అయినందున హెలి కాప్టర్‌లో చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఫలితంగా ప్రాజెక్టు విఫలమైంది. గత ఫిబ్రవరిలో మేడారం జాతర సమయంలో బేగంపేట నుంచి మేడారానికీ సర్వీసు ప్రారంభించారు. ఆరుగురు సభ్యుల ప్యాకేజీ ధర రూ.2.75 లక్షలు ప్లస్ సర్వీసు చార్జీ అదనంగా నిర్ధారించటంతో ఒక్కరూ ముందుకు రాలేదు.