
డీసీసీ నియామకాలకు బ్రేక్..?
ఎన్నికల్లో పోటీ వద్దంటే ఎలాగంటున్న జిల్లాల నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షుల నియామకానికి మరికొంతకాలం బ్రేక్ పడినట్టుగా కనిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసీసీ నిర్దేశించిన అర్హతలు, నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో నేతలకు అవరోధాలు ఎదురవుతున్నట్టుగా టీపీసీసీ నేతలు వెల్లడించారు. డీసీసీ అధ్యక్షులుగా పనిచేయాలంటే రానున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడానికి అవకాశం రాదని పెట్టిన నిబంధన.. చాలా జిల్లాల్లో ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ కీయాల్లో ఎవరు పనిచేస్తారన్న ప్రశ్న జిల్లాల్లో తలెత్తుతోంది. లోక్‌సభకు, శాసనసభకు పోటీ చేయకూడదనే నిబంధనతో పలువురు నేతలు ఆ పదవి చేపట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.
ఈ విషయంలో ఏఐసీసీ కూడా పట్టుదలతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షునిగా పనిచేసేవారు పూర్తికాలం పార్టీ కోసం పనిచేయాల నేది ఏఐసీసీ సూచన. పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన నాయకుడికి ఎక్కడైనా పోటీ చేయాలనే ఆలోచన ఉంటే పరిమితులు ఏర్పడ తాయనేది ఏఐసీసీ అనుమానం. తాను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గంపైనే దృష్టిని కేంద్రీకరించి, మిగిలిన నియోజకవర్గాల్లో సమయాన్ని ఇవ్వకపోవడం, పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టకుండా పోయే ప్రమాదముందని ఏఐసీసీ ఆందోళన. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంకాక టీపీసీసీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.