ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరుపై కేంద్రం ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తామిచ్చిన నిధుల్ని సక్రమంగా వ్యయం చేయకుండా దుర్వినియోగం చేయడమేగాక ఏపీ ప్రభుత్వం అవాస్తవ లెక్కలు చెబుతున్నదని కేంద్రప్రభుత్వం గుర్తించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రత్యేక సాయం కింద రాష్ట్రానికి రూ.2,000 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ తొలుత నిర్ణయించింది. అయితే ప్రధానమంత్రి కార్యాలయ జోక్యంతో ఆఖరి నిమిషంలో తన ఆలోచనలో మార్పు చేసుకుంది. తొలుత విడుదల చేయాలని నిర్ణయించిన రూ.2,000 కోట్లల్లో రూ.1,100 కోట్లకు కోత విధించి రూ.900 కోట్లనే గురువారం విడుదల చేసినట్లు పేర్కొన్నాయి. ఇందులో రెవెన్యూలోటు భర్తీకి రూ.500 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.200 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.200 కోట్లతో సరిపెట్టింది.
అంతేగాక ఇచ్చిన నిధులకు సంబంధించి వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇస్తేనే ఇకమీదట నిధుల విడుదల ఉంటుందని, లేనిపక్షంలో నిధులను విడుదల చేయబోమని కేంద్రం కరాకండీగా తేల్చిచెప్పింది. రెవెన్యూలోటును ఎక్కువగా చూపించారని కాగ్ తన నివేదికలో పేర్కొనడాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు రూ.850 కోట్లను ఇచ్చినప్పటికీ వాటిని ఇతర అవసరాలకు మళ్లించి నిధులివ్వాలంటూ మళ్లీ కోరడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దీంతో హడావుడిగా వారం క్రితం రాజధాని నిర్మాణానికి రూ.500 కోట్లను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. అయితే ఆ నిధుల్ని సీఆర్‌డీఏ పీడీ ఖాతాలో ఉంచారు.
దీన్ని గ్రహించిన కేంద్రం.. ఇచ్చిన నిధుల్ని వ్యయం చేశాకనే మళ్లీ నిధులిస్తామని, అప్పటివరకు తాత్కాలికంగా రాజధాని నిర్మాణానికి రూ.200 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొంది. కాగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకోసం రూ.1,000 కోట్లను విడుదల చేసి ఏడాదిన్నర కావస్తున్నా పైసా కూడా అందుకు వ్యయం చేయలేదన్న విషయాన్నీ కేంద్రం గ్రహించింది. దీన్ని గమనించిన రాష్ట్రప్రభుత్వం వారంక్రితం హడావుడిగా ఆ రెండు కార్పొరేషన్లకు రూ.1,000 కోట్లను విడుదల చేస్తూ పీడీ ఖాతాల్లో ఉంచింది. ఈ విషయమూ కేంద్రం దృష్టికొచ్చింది. ఇక పోలవరం ప్రాజెక్టు కింద రూ.2,094 కోట్లను వ్యయం చేశామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అవాస్తమని కేంద్రం తేల్చింది. కాగా సీఎస్‌టీ పరిహారం కింద అన్ని రాష్ట్రాలకిచ్చే నిధుల్లో భాగంగా రాష్ట్రానికి రూ.642 కోట్లను కేంద్రం విడుదల చేసింది.