విజయవాడ: కేంద్రం నిధులను తాత్కాలిక సచివాలయానికి ఏపీ ప్రభుత్వం మళ్లిస్తుందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారం యనమల విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాజధాని కోసం రూ. 1,850 కోట్లను కేంద్రం మంజూరు చేసినట్టు ఆయన గుర్తు చేశారు. వెయ్యి కోట్లు తాత్కాలిక సచివాలయానికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్రం నిధులనే తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తున్నామన్నారు. వెయ్యి కోట్లు తాత్కాలిక సచివాలయానికి ఖర్చు చేస్తామని యనమల చెప్పారు. దాంతో వినియోగం తర్వాత తాత్కాలిక సచివాలయం కమర్షియల్ కాంప్లెక్స్గా మారనున్నది.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని యనమల చెప్పారు. కేంద్రం రూ. లక్షా 43 వేల కోట్లు ఇచ్చారని చెబుతున్నారు.. ఆ నిధులు నేరుగా ఏపీ ప్రభుత్వం ఖాతాకు రావని ఆయన అన్నారు. వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీకి నిధులిస్తున్నారని చెప్పారు.
విభజన చట్టం ప్రకారం అదనంగా రూ. 6,400 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చారని యనమల అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించదని స్పష్టం చేశారు. తాము కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నామనడం వాస్తవం కాదని.. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగారంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
'ఆ నిధులు తాత్కాలిక సచివాలయానికే మళ్లించాం'
Published Sat, May 14 2016 7:01 PM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
Advertisement
Advertisement