
కర్నూలు నుంచి అమరావతికి డైరెక్ట్ రోడ్డు
కర్నూలు నుంచి రాజధాని అమరావతికి నేరుగా రోడ్డు మార్గం వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
హైదరాబాద్ : కర్నూలు నుంచి రాజధాని అమరావతికి నేరుగా రోడ్డు మార్గం వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై ఆయన గురువారం శాసనమండలిలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ...'ఏ ప్రాంతం వారి ఆదాయం వారిదే అని ఇరురాష్ట్రాలకు కేంద్రం పెద్దలు చెబుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ఆదాయం తక్కువ.. జనాభా ఎక్కువని.. ఈ విషయంలో తెలంగాణ ఆదాయం ఎక్కువని, జనాభా తక్కువని అన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారో కేంద్రం చెప్పలేదని పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరానని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణను తాను అభివృద్ధి చేశానని ప్రస్తుతం ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని చెప్పారు.
రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ బిల్లు తెచ్చినప్పటికీ రైతులు, ప్రజల నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో కాస్త తగ్గినట్లు చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం నేపథ్యంలో రాజభవన్, అసెంబ్లీ, సచివాలయం వంటి వాటి నిర్మాణాల కోసం రూ.1500 కోట్లను కేంద్రం ప్రకటించగా, అందులో రూ.500 కోట్లు కేవలం రాజధాని విజయవాడ ప్రాంత అభివృద్దికే ఖర్చుచేయాల్సి వస్తోందన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటూ అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిశానని' తెలిపారు.