
టవర్ల పేరుతో ఫ్లవర్లు
నిరుద్యోగుల అమాయకత్వాన్ని మోసగాడు దర్జాగా సొమ్ము చేసుకున్నాడు. గ్రామాల్లో ఇళ్లపై సెల్‌టవర్లు, సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని, ఇంజనీర్లు కావాలంటూ ప్రకటన గుప్పించి వారి నుంచి డబ్బులు వసూలు నిండా ముంచాడు.
నిరుద్యోగుల అమాయకత్వాన్ని మోసగాడు దర్జాగా సొమ్ము చేసుకున్నాడు. గ్రామాల్లో ఇళ్లపై సెల్‌టవర్లు, సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని, ఇంజనీర్లు కావాలంటూ ప్రకటన గుప్పించి వారి నుంచి డబ్బులు వసూలు నిండా ముంచాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన మహ్మద్ సాద్ ఏడాదికాలంగా బంజారాహిల్స్ రోడ్డునెం.2లోని కమలాపురికాలనీలో సిల్వర్టన్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. తమ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో సెల్‌టవర్లు, సోలార్ ప్యానళ్లను ఏర్పాటుచేస్తుందని..వీటి కోసం సర్వే చేయడానికి ఇంజనీర్లు కావాలంటూ ఆయా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు.
దీన్ని నమ్మిన ఆయా జిల్లాలకు చెందిన బీటెక్,ఎంటెక్ తదితర విద్యార్హతలు కలిగిన 300మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోరి వద్ద రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశాడు. మూడునెలలు వీరందర్ని గ్రామాల్లో సర్వే పేరుతో పనిచేయించుకొని జీతం చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన పలువురు నిరుద్యోగులు వారం క్రితం కార్యాలయానికి చేరుకొని యజమానిని నిలదీశారు. విషయం తెలిసిపోయిందని గ్రహించిన మహ్మద్‌సాద్ పరారయ్యాడు.
మోసపోయామని నిర్దారించుకున్న నిరుద్యోగులు అనేకమంది మంగళవారం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చే యగా..సాద్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.
జిల్లాల్లోనూ దగా : మీ ఇంటిపై, ఖాళీ స్థలంలో సెల్‌టవర్లు నిర్మించి వేలాది రూపాయల అద్దె ఇస్తామంటూ వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్టణం తదితర జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు సంస్థ తరఫున ఉద్యోగులు వెళ్లారు. తమ సంస్థ దేశంలోని పలు టెలికాం సంస్థలతో సెల్‌టవర్ల నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకుందని..ఇందులో భాగంగానే గ్రామాల్లో, పట్టణాల్లో సెల్‌టవర్ల నిర్మాణం కోసం సర్వే నిర్వహిస్తున్నామని నమ్మబలికారు.
ఇవి ఏర్పాటు చేస్తే ఆదాయం బాగా వస్తుందని నమ్మించారు. ఇలా అనేక గ్రామాల్లో వందలాదిమంది నుంచి రూ.9వేల చొప్పున డీడీలు కట్టించుకున్నారు. డీడీలు పంపి నెలలు గడిచినా సెల్‌టవర్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు సంస్థ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఇదంతా పచ్చిమోసమని తేలింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. జిల్లాల్లో ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు రావడంతో నమ్మి మోసపోయామని వరంగల్‌వాసి రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
- బంజారాహిల్స్,న్యూస్‌లైన్