తెలంగాణ సినిమా అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్ కార్యదర్శి ఠాగూర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా జవహర్‌కాలనీలో గత ఏడాది తెలంగాణ సినిమా అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఏజెంట్స్ యూనియన్‌ను తెరిచారు.
ఈ సంస్థలో చాలా మంది లక్షన్నర రూపాయలు చెల్లించి గుర్తింపు కార్డులు తీసుకున్నారు. ఈ సంస్థలో గుర్తింపు కార్డు తీసుకున్న వి.శ్రీనివాస్ అనే యువకుడి.. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించగా.. తన గుర్తింపు కార్డుకు విలువ లేదన్నారు.
ఈ కార్డు చెల్లదని షూటింగుల వద్ద నుంచి వెనక్కి పంపివేశారు. దీంతో విషయం యూనియన్ కార్యదర్శి ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఠాగూర్ నుంచి ఎటువంటి స్పందన లేక పోవడంతో.. ఇదే యూనియన్ లో రిజిస్టర్ చేసుకున్న 83 మంది యువకులు ఇలాగే మోసపోయారని తెలుసుకున్నాడు. ఠాగూర్ తమను మోసం చేశాడని ఆరోపిస్తూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.