
కలసికట్టుగా సమస్యలకు చెక్
నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు...
సమన్వయ సమావేశంలో 14
విభాగాల ఉన్నతాధికారుల తీర్మానం
ఇకపై నెలనెలా సమావేశాలు
సర్కిల్, జోనల్ స్థాయిల్లోనూ అమలు
సమన్వయం లేకే ప్రజలకు సమస్యలని ఒప్పుకోలు
నగర ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందుకు సమన్వయం ఎంతో ముఖ్యమని ప్రకటించారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీలో శుక్రవారం గ్రేటర్ పరిధిలోని 14 విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్‌లో ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేద్దామని తీర్మానించారు.
సిటీబ్యూరో: వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం గ్రేటర్ ప్రజలకు శాపంగా మారుతోంది. ఏటా రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ఆయా ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం లేక సదరు ప్రాజెక్టులు పూర్తికావడం లేవు. సంక్షేమ పథకాలు కుంటుతుండటంతో ప్రజలకు పూర్తి ప్రయోజనం లభించడం లేదు. పనుల్లో జాప్యంతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఇవే అంశాల్ని శుక్రవారం జీహెచ్‌ఎంసీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు ప్రస్తావించారు. ఇకపై ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని విభాగాల వారు సమన్వయంతో కలిసిమెలసి పనిచేద్దామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల ఇబ్బందులు తొలగిద్దామని నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌స్థాయిలోనే కాకుండా జోనల్, సర్కిల్ స్థాయిలోనూ ఇలాంటి సమన్వయ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. నగరవాసుల ఇబ్బందులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతినెలా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని 14 శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈసమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. పౌరసేవలు, అభివృద్ధిపనులకు సంబంధించి వివిధశాఖల మధ్యసమన్వయ సమావేశాలు నిర్వహించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, శాఖల మధ్యసమన్వయంతో వేల కోట్ల పనులు కుంటుతున్నాయన్నారు. ము ఖ్యంగా జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, మెట్రోరైలు, టెలికాం శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఇంకా సమావేశంలో ఎవరేమన్నారంటే..
వచ్చే నెల 5న మళ్లీ భేటీ
ఈ సమావేశంలో వచ్చిన సలహాల అమలుకు, సమస్యల పరిష్కారానికి తగుచర్యలు తీసుకోవాలని జనార్దన్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులకు విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల 5వ తేదీన మెట్రోరైలు కార్యాలయలో సమన్వయ సమావేశం నిర్వహించాలని లాటరీ ద్వారా నిర్ణయించారు.
ఖాళీ స్థలాల్లో పౌర సదుపాయాలు
నగరంలో వివిధ పౌరసదుపాయాలకు కేటాయించిన అనేక స్థలాల్లో వాటిని కల్పించకపోవడంతో ఖాళీగా ఉండి కబ్జాలపాలవుతున్నాయి. అలా జరగకుండా వెంటనే తగు నిర్మాణాలు ప్రారంభించాలి. క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోని మూడు ఎకరాల భూమి వివాదంలో ఉన్నందున దానిని ఎస్సార్‌డీపీ, తదితర పనులకు కేటాయించడం సాధ్యం కాదు. - రాహుల్ బొజ్జా, హైదరాబాద్ కలెక్టర్
పైప్‌లైన్ల పరిరక్షణకు కమిటీలు..
గోదావరి, కృష్ణాఫేజ్-3 పనులు త్వరలో పూర్తికానున్నాయి. నగరానికి నీరందించేందుకు వేసిన 168 కి.మీ.ల ప్రధాన పైప్‌లైన్లను ఎవరూ ధ్వంసం చేయకుండా పైప్‌లైన్ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం. జలమండలి చేపట్టే పనుల వివరాలను ముందస్తుగానే ఆయా విభాగాలకు తెలియజేస్తాం. జీహెచ్‌ఎంసీ త్వరలో ప్రారంభించనున్న 2 వేల ఆటో టిప్పర్లు, 44 లక్షల డస్ట్‌బిన్‌ల పంపిణీ ఇతరత్రా కార్యక్రమాల అమలుకు అందరి సహకారం అవసరం. - బి.జనార్దన్‌రెడ్డి (జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎం.డి)
ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారులు
దశాబ్దాల నాటి బస్‌షెల్టర్లు, బస్‌బేలు ప్రస్తుత జనాభాకు సరిపోవడంలేవు. పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాలి. ముఖ్యంగా బల్దియా, జలమండలి, టెలికాంల మధ్య సమన్వయం అవసరం. అవి చేపట్టే పనుల వివరాలను ముందస్తుగా తెలియజేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలి.
- జితేందర్, అడిషనల్ సీపీ(ట్రాఫిక్)
చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యంత్రాంగం
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, నీటిపారుదల శాఖలకు చెందిన వందలాది చెరువులు కబ్జాకావడానికి కారణం వాటిమధ్య సమన్వయం లేకపోవడమే. సకాలంలో స్పందించకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. వివిధశాఖల పరిధిలో ఉన్న చెరువులన్నింటినీ ఒకే శాఖ కిందకు తెస్తే మేలు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో చెత్తతో నిండిన ప్రదేశాన్ని వెంటనే క్యాపింగ్ చేయాలి.
- రఘనందన్‌రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్
బస్‌షెల్టర్లు వెంటనే నిర్మించాలి
జీహెచ్‌ఎంసీలో 116 బస్‌షెల్టర్లు, 14 బస్‌బేలు నిర్మించేం దుకు ప్రతిపాదనలు పంపాం. వీటిని వెంటనే నిర్మించాలి. నగర ప్రజలకు సదుపాయంగా ఉండేలా బస్‌షెల్టర్లను డిజైన్ చేయాలి.
- పురుషోత్తం, టీఎస్సార్‌టీసీ ఈడీ
చట్టాల్లోని లొసుగులతోనే ఉల్లంఘనలు
నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, అక్రమపార్కింగ్‌లు, భూకబ్జాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇందుకు కారణం చట్టాల్లోని లొసుగులే. వీటిపై అన్నిశాఖల అధికారులు ఉమ్మడిగా స్పందిస్తే చాలావరకు అరికట్టవచ్చు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు తీసుకుంటే చట్టాలు అతిక్రమించేందుకు భయపడతారు. - మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్
అన్ని శాఖల సహకారం అవసరం
మెట్రోస్టేషన్లలో ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనకు వివిధ ప్రభుత్వశాఖల సహాయ సహకారాలు ఎంతో అవసరం. ముఖ్యంగా నాగోల్, ఉప్పల్ మెట్రోస్టేషన్లలో పీపీపీ లేదా బీపీఓ పద్ధతిలో ఆయా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ స్టేషన్లలో మీసేవ తరహాలో పౌరసేవాకేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. - ఎన్వీఎస్‌రెడ్డి, మెట్రోరైలు ఎండీ