మువ్వన్నెల చిత్ర సాహిత్యం!
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ // కౌంట్‌డౌన్ 2
సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: మనిషి ముందుగా బొమ్మలను వేశాడు. అక్షరాలను తర్వాత రూపొందించుకున్నాడు. అక్షరాల సాహిత్యం ప్రాచుర్యంలోకి వచ్చిన అనేక శతాబ్దాల తర్వాత ‘చిత్రసాహిత్యం’ ప్రత్యేక ప్రక్రియగా గుర్తింపు పొందింది. బొమ్మలను రూపొందించడం ఒక సాహితీ కళ. వాటిని అర్థం చేసుకోలేకపోవడం ‘విజువల్ ఇల్లిటరసీ’ (దృశ్య నిరక్షరాస్యత)గా స్పష్టత వచ్చింది.
ఈ నేపథ్యంలో నాల్గో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ చిత్రసాహిత్యానికి ప్రత్యేక గౌరవం ఇస్తోంది. ఇందులో భాగంగా లిటరరీస్ట్రీట్‌గా ప్రాచుర్యం పొందుతోన్న బంజారాహిల్స్, రోడ్‌నెం.8లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో మూడు వినూత్న ప్రదర్శనలను మూడు రోజులపాటు నిర్వహిస్తోంది. ఆర్తివీర్ మట్టితో చేసిన ఆకృతుల రూపకల్పన, నోబెల్ బహుమతి గ్రహీత దివంగత కామూ డిజిటల్ ఎగ్జిబిషన్, ప్రియాం క ఏలె చిత్రాల ప్రదర్శనలను ఫెస్టివల్ తొలిరో జు శుక్రవారం మధ్యాహ్నం 12-30 గంటలకు పద్మశ్రీ జగదీష్ మిట్టల్ ప్రారంభిస్తారు.
‘అక్షరాల దారుల’ ప్రదర్శన!
సుశీథారు-కె.లలితలసంపాదకత్వంలో రూపొందిన అపురూప పుస్తకం, ‘విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా’ను ప్రపంచంలోని అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు సేకరించాయి. క్రీ.పూ 6వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దపు మహిళా సాహిత్యకారుల వరకూ ఆసక్తికర విశేషాలున్న ఈ పుస్తకం ‘దారులేసిన అక్షరం’గా తెలుగులో త్వరలో రానుంది. ఈ పుస్తకానికి వర్ధమాన చిత్రకారిణి ప్రియాంక ఏలె సమకూర్చిన చిత్రాలు ప్రత్యేకమైనవి. బ్రష్‌లు, రంగులు వాడలేదు. రచన-చిత్రకళ సమ ఉజ్జీలని సంకేతమిస్తూ కలం-సిరాతో చిత్రసాహిత్యానికి రూపిచ్చారు.
ప్రియాంక తన చిత్రాల గురించి:
‘దృశ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అక్షర సాహిత్యం కంటే చిత్రసాహిత్యం ఏమాత్రం తీసిపోదనే గుర్తింపు ఆధునిక కాలంలో ఏర్పడింది. మహాభారత రచనలోనే ప్రస్తావించిన దమయంతి తన ప్రియుడు నలమహారాజుకు ‘సందేశం’ పంపడంతో ‘దారులేసిన అక్షరం’ మొదలైంది. ఈ సంకలనంలో ఇటీవల కాలం వరకూ అనేక మంది మహిళా రచయితలున్నారు. వీరందరూ వేర్వేరు కాలాలకు, సమాజాలకు సంస్కృతులకు చెందిన వారు. అన్నింటిలో అంతఃసూత్రం ఒక్కటే. ‘వస్తువుగా పరిగణింపబడిన మహిళ, ఎవరూ దొంగిలించలేని జ్ఞానం అనే వస్తువుపై సాధికారత తెచ్చుకుని ‘నో’ అనగలిగిన ధీమతిగా పురోగమిస్తోంది’! ఉత్తరాన్ని తెస్తోన్న పక్షి ఆ నాటి దమయంతినే కాదు, చదువుకున్న ఆధునిక మహిళకూ ప్రతీక! సావకాశంగా సాలోచనగా చూస్తే నా చిత్రాలు మంచి పఠనానుభూతిని కలిగిస్తాయని విశ్వసిస్తున్నాను.’