బెల్లంకొండ ఇంటి ఎదుట మంచు లక్ష్మి అనుచరుల ఆందోళన
బంజారాహిల్స్: తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇంటి ఎదుట మంగళశారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నటుడు మోహన్‌బాబు కూతురు మంచులక్ష్మి అనుచరులు ఆందోళనకు దిగారు. మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలికిపడతారా...’ సినిమా సెట్టింగ్‌ను నిర్మాత బెల్లండ సురేశ్ రభస సినిమా కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం రూ.58 లక్షలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అనుకున్న ప్రకారం... డబ్బులు ఇవ్వడానికి బెల్లంకొండ సురేశ్ వెనుకడుగు వేశారని మంచు లక్ష్మి అనుచరులు ఆరోపిస్తున్నారు.
రభస సినిమా బుధవారం విడుదలవుతుంది. తమ డబ్బులు చెల్లించిన తరువాతే సినిమా విడుదల చేసుకోవాలంటూ వీరంతా సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించారు. దీంతో ఫిలింనగర్‌లోని సురేశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.