
సాక్షి, వరంగల్ రూరల్: సాగుకు నిరంతర విద్యుత్ కుదించాలని భావిస్తే, సంబంధిత గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి, వంచనగిరిల్లో శనివారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలసి హరీశ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. హరీశ్ మాట్లాడుతూ హైటెక్ సిటీలో ఎంత నాణ్యమైన కరెంట్ ఉందో అదే కరెంట్ గ్రామాలకూ వస్తుందన్నారు. ‘తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రం చీకటిగా మారుతుందని కాంగ్రెస్ వాళ్లు అన్నారు. కానీ, నేడు సాగుకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం’ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతీ నియోజకవర్గానికి సాగు నీరు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు.
24 గంటల కరెంట్ వద్దు: ఎర్రబెల్లి
సాగుకు 24 గంటల కరెంట్‌పై టీఆర్‌ఎస్ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్వతగిరిలో జరిగిన సభలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వేదికపైనే ‘వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల బావులు ఎండిపోయే ప్రమాదముందని, 12 గంటల కరెంట్ చాలు’ అని మంత్రి హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ‘మీకు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంట లు విద్యుత్ ఇస్తాం. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే పరిశీలిస్తాం’అంటూ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment