కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలున్నాయని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో వంద సీట్లు గెలుస్తామని, ఎంఐఎంతో పొత్తు అవసరం లేద ని మంత్రి కేటీఆర్ చెప్పగా, ఆయన సోదరి కవిత కూడా ఎవరి సాయం లేకుండానే మేయర్ స్థానం దక్కించుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు.
కేసీఆర్ మాత్రం ఎంఐఎం సహకారంతో మేయర్ స్థానం దక్కించుకుంటామని చెబుతున్నారని, దీన్ని బట్టే వారి కుటుంబంలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తోందన్నారు. ఎంఐఎం-టీఆర్‌ఎస్ కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని తాము ఏనాడో చెప్పామని గుర్తుచేశారు. సొంత పార్టీలో, కుటుంబంలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.