
ఫిరాయింపుల కోసం ప్రజల సొమ్ము
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు నిస్సిగ్గుగా ప్రజల సొమ్మును ప్రభుత్వం
ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు నిస్సిగ్గుగా ప్రజల సొమ్మును ప్రభుత్వం పంచిపెడుతోందని కాంగ్రెస్ విప్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డికి ప్రభుత్వ భూములను కట్టబెట్టారని ఆరోపించారు. జీఓ 59 కింద రూ. 45 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించారని ఆరోపించారు.
ఈ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ చేస్తున్న నీతిమాలిన రాజకీయాలకు అధికారులు సహకరించవద్దని సంపత్ కోరారు. ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధపు సర్వేలను ప్రచారంలో పెడుతోందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, భ్రమల్లో పెట్టడానికి తెచ్చిన సర్వేలను ప్రజలు నమ్మరని సంపత్ చెప్పారు.