గాంధీభవన్‌లో మళ్లీ రెచ్చిపోయిన కార్యకర్తలు
హైదరాబాద్ : గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో కార్యకర్తల మధ్య రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలే కారణమంటూ కార్యకర్తలు మరోసారి విరుచుకుపడ్డారు. దాంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అనుచరులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది.
కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలకు నిన్న ఘోర పరాభవం ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పరాజయం పాలవడానికి టీపీసీసీ పెద్దలే కారణమంటూ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీవల్లే పార్టీ సర్వనాశనమైంది.
పాతికేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న మాలాంటి వాళ్ల నోట్లో మన్నుకొట్టారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహలను గాంధీభవన్‌లో నిలదీశారు. కార్యకర్తల ఆగ్రహానికి విస్తుపోయిన సదరు నేతలు చేసేదేమీ లేక తలదించుకుని వెళ్లిపోయారు.